యువత.. నిస్సహాయత!

24 Jun, 2014 02:37 IST|Sakshi
యువత.. నిస్సహాయత!

 శ్రీకాకుళం కలెక్టరేట్: సర్కారు సంక్షేమాన్ని మరిచింది. యువతకు చేయూత కొరవడుతోంది. స్వయం ఉపాధి ఎండమావిగా మారుతోంది. గత రెండేళ్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, యువజన స్వయం ఉపాధి రుణాల పంపిణీ లక్ష్యానికి బారెడు దూరంగా ఉండటం ఈ దుస్థితిని స్పష్టం చేస్తోంది. ప్రతి ఏటా ఔత్సాహికులు, నిరుద్యోగ యువకులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకుంటున్నా.. అవన్నీ బుట్టదాఖలవుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా దాదాపు అదే పరిస్థితి కనిపిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో సబ్సిడీకి సంబంధించి మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేయకపోవడంతో యూనిట్లు మంజూ రైనా రుణాలు విడదల కాలేదు. ఆ తర్వాత ఎన్నికల కోడ్ అమల్లోకి రావ డం.. ఆర్థిక సంవత్సరం ముగిసిపోవడంతో ఆ దరఖాస్తులన్నింటికీ కాలదోషం పట్టింది. బీసీ, ఎస్సీ సంక్షేమ శాఖలతోపాటు, రాజీవ్ యువశక్తి పథకానికి సంబంధించి యూనిట్ల మంజూరులో లక్ష్యాలు సాధించలేకపోయారు. ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రెండు నెలలు ముగిసి.. మూడో నెల మూడొంతులు గడిచిపోయింది. అయినా ఇప్పటివరకు యూనిట్ల లక్ష్యాలను ప్రభుత్వం నిర్దేశించలేదు. దరఖాస్తుల స్వీకరణ కూడా ప్రారంభం కాలేదు.
 
 వివిధ శాఖల లక్ష్యాలు, పనితీరు ఒకసారి పరిశీలిస్తే..
   బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 2013-14 ఆర్థిక సం వత్సరంలో 4321 స్వయం ఉపాధి యూనిట్లు పంపిణీ చేయాలని లక్ష్యంగా తీసుకున్నారు. వీటికి రూ.1296.30 లక్షల ప్రభుత్వ రాయితీ ఇవ్వాలని నిర్ణయించారు. ఆ మేరకు బీసీ వర్గాల యువత నుంచి 1027 దరఖాస్తులు వచ్చాయి. సంబంధిత మండలాధికారులు వీటిని ఆన్‌లైన్‌లో పొందుపరిచి మంజూరు కోసం ఉన్నతాధికారులకు రిఫర్ చేశారు. అయితే వీటిలో ఒక్క యూనిట్ అయినా మంజూరు కాలేదు. దీంతో బీసీ కార్పొరేషన్ లక్ష్యసాధన సున్నా శాతంగా నమోదైంది.
 
   ఎస్సీ కార్పొరేషన్‌కు సంబంధించి 50 శాతం రాయితీపై 2013-14 ఆర్థిక సంవత్సరంలో 1175 యూనిట్లు పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇందుకోసం రూ.1096 లక్షల రాయితీ ఇవ్వాలని నిర్ణయించారు. కానీ 718 మందికి మాత్రమే యూనిట్లు మంజూరు చేసి రూ.7.63 లక్షల రాయితీ మాత్రమే అందజేయగలిగారు. దాంతో లక్ష్యసాధన 55 శాతానికే పరిమితమైంది.  రాజీవ్ యువశక్తి పథకం ద్వారా 2013-14 ఆర్థిక సంవత్సరంలో జిల్లా యువతకు 350 యూనిట్లు పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇందుకు రూ. 360 లక్షల సబ్సిడీ కేటాయించారు. అయితే 251 యూనిట్లు పంపిణీ చేసి రూ. 251లక్షల సబ్సిడీ మాత్రమే ఇవ్వగలిగారు.
 

మరిన్ని వార్తలు