రైలు ప్రమాదంలో యువకుడికి తీవ్రగాయాలు

2 Mar, 2017 22:20 IST|Sakshi
► 20 రోజులుగా అక్రమంగా నిర్బంధించిన డోన్ రైల్వే ఔట్‌పోస్ట్‌ పోలీసులు
► చిత్రహింసలు తాళలేక తప్పించుకుని పారిపోయిన బాధితుడు
► రైలు కిందపడి రెండు కాళ్లు కోల్పోయిన తమిళనాడు యువకుడు
► తప్పించుకుని పారిపోతూ గాయపడ్డాడని రైల్వే పోలీసుల వివరణ
 
డోన్ టౌన్ : రైల్వే ఔట్‌పోస్టు పోలీసులు 20 రోజులుగా అక్రమంగా నిర్భందించి పోలీసులు పెడుతున్న చిత్రహింసలు తాళలేక బుధవారం ఉదయం స్టేషన్ నుంచి పారిపోతూ ప్రమాదవశాత్తు రైలు కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన యువకుడి ఉదంతం డోన్ రైల్వేస్టేషన్లో బుధవారం జరిగింది. ఈ ప్రమాదంలో అతడు రెండు కాళ్లు కోల్పోయి, రైలు పట్టాలపై తల్లడిల్లిన తీరుచూసి ప్రయాణీకులు కన్నీరు పెట్టారు. ప్రత్యక్ష సాక్షులు అందించిన సమాచారం మేరకు తమిళనాడు రాష్ట్రం, తిరుచ్చీకి చెందిన ముడియంటి కుమార్‌ (35) అనే యువకుడిని రైళ్లలో జరిగిన దొంగతనాల గురించి విచారించేందుకు 20రోజుల క్రితం  ఔట్‌పోస్టు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అయితే అతడి నుంచి పోలీసులు  ఎలాంటి సమాచారం రాబట్టలేకపోయారు.
 
తన విషయంలో పోలీసులు అమానుషంగా ప్రవర్తిస్తుండడంతో.. ఆ యువకుడు బుధవారం ఉదయం స్టేషన్ నుంచి  రైలు పట్టాలపై పరుగులు తీశాడు. అదే సమయంలో గుంతకల్లు నుంచి విజయవాడ వైపు వెళుతున్న గూడ్స్‌ బండి ఆ యువకుడిని ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయిన ఆ యువకుడు సుమారు 20 నిమిషాలు పాటు పట్టాలపైనే ఆర్తనాదాలు చేశాడు. తమ బండారం బయటపడుతుందనే ఉద్దేశంతో రైల్వే ఔట్‌పోస్టు పోలీసులు గాయపడిని ఆ యువకుడిని హుటాహూటీన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యుల సలహా మేరకు అక్కడి నుంచి కర్నూల్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 
 
చేతులకు బేడీలు వేశారా..? రైల్వే ఔట్‌పోస్టు నుంచి పారిపోయే సందర్భంలో అనుమానితుడైన ముడియంటి కుమార్‌ చేతులకు బేడీలు వేసినట్లు కొందరు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ఔట్‌ పోస్టు పోలీసులు అక్కడికి చేరుకుని చేతికున్న బేడీలను తొలగించి అతడిని ఆసుపత్రికి తరలించినట్లు కొందరు ప్రయాణీకులు తెలిపారు. మంగళవారం రాత్రి స్థానిక రైల్వేస్టేషన్లో ల్యాప్‌టాప్‌ పట్టుకుని అనుమానాస్పదంగా తిరుగుతున్న కుమార్‌ను అదుపులోకి తీసుకున్నామని ఎస్‌ఐ సుబ్బారావు తెలిపారు. బుధవారం ఉదయం అతడిని కోర్టులో హాజరుపరిచేందుకు స్టేషన్ నుంచి బయటకు తీసుకోస్తుంటే తప్పించుకుని ప్రమాదానికి గురయ్యాడని వివరించారు. దొంగతనాల కేసులో విచారించేందుకు అతడిని  నిర్భందించినట్లు వచ్చిన వార్తలు వాస్తవం కాదన్నారు. 
 
 
మరిన్ని వార్తలు