పచ్చబొట్టేసినా..!

31 May, 2016 03:54 IST|Sakshi
పచ్చబొట్టేసినా..!

పచ్చబొట్లపై పెరుగుతున్న మోజు
54 రంగుల్లో శాశ్వతంగా నిలిచిపోతున్న చిత్రాలు
►  ఖరీదు ఎక్కువైనా కర్నూలుకు పాకిన టాటూ

 
 కర్నూలు(అర్బన్)
: పచ్చబొట్టూ చెరిగి పోదూలే ... నా రాజా ... అనే పాత తరానికి, పచ్చబొట్టేసినా ... పిల్లగాడా నీతో ... పచ్చి ప్రాయాలని పంచుకుంటాను రా ... అనే కొత్తదనానికి దీటుగా నేటి యువత టాటూ వేయించుకునేందుకు తెగ ఉత్సాహాన్ని చూపుతోంది. ఒకప్పుడు పెద్ద పెద్ద నగరాలకే పరిమితమైన టాటూ నేడు కర్నూలుకూ వచ్చింది. ఆరోగ్యవంతమైన శరీరం కలిగిన యువత.. చేతులపై తమకు ఇష్టమైన చిత్రాలను వేయించుకునేందుకు ఇష్టపడుతోంది. టాటూతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేక పోవడం వల్ల అమ్మాయిలు కూడా ఉత్సాహం చూపుతున్నారు. పూర్వం రాజుల కాలంలో ఖైదీలకు గుర్తించించేందుకు పచ్చబొట్లను పొడిచే వారని, అలాగే కొన్ని గిరిజన తెగలు సంప్రదాయంగా పచ్చబొట్లను పొడిపించుకునే వారని తెలుస్తోంది.

కాలక్రమేణ గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు అధికశాతం పచ్చబొట్లను వేయించుకునేవారు. అలాగే తల్లిదండ్రులు కూడా తమ కూతుర్లకు చేతి బొటన వేలు, చూపుడు వేలి మధ్యలో కనీసం మూడు చుక్కలు లేక స్వస్తిక్ సింబల్‌ను వేయించేవారు. ఈ నేపథ్యంలోనే గ్రామీణ ప్రాంతాల్లోని పురుషులు తమ చేతి మణికట్టు పైభాగాన తమకు ఇష్టమైన వారి పేర్లు, దేవుళ్ల బొమ్మలను వేయించుకునే వారు. కాలానుగుణంగా పచ్చబొట్లు పోయి ఫ్యాషన్‌గా టాటూలు రంగ ప్రవేశం చేశాయి. నాడు పచ్చబొట్లు వేసే వారు ఊరూరు తిరిగి జీవనం సాగించేవారు. నేడు టాటూలు వేసే వారి దగ్గరకు మనమే వెళ్లాల్సి వస్తోంది. నాడు సూదులతో పచ్చబొట్లు పొడిస్తే ... నేడు అదే సూదిని యంత్రంలో అమర్చి టాటూ వేస్తున్నారు.
 
 స్క్వైర్ ఇంచ్‌కు రూ.600
 గోవా, బెంగళూరు, మంగళూరు, చెన్నై, ముంబాయి, హైదరాబాద్ వంటి మహా నగరాలకే పరిమితమైన టాటూ నేడు చిన్న చిన్న పట్టణాలకు విస్తరిస్తోంది. కర్నూలు గాంధీనగర్‌లోని సైక్లోన్ డ్యాన్స్ ఇనిస్టిట్యూట్‌లో దీనిని వేస్తున్నారు. టాటూ వేయించుకునేందుకు ఒక స్క్వైర్ ఇంచ్‌కు రూ.600 ఫీజుగా తీసుకుంటున్నారు. 54 రంగులను మిక్స్ చేసి తమకు ఇష్టమైన చిత్రాలను గీయించుకునే అవకాశం ఉంది. శరీరం కింద రెండు లేయర్ల వరకు ఈ టాటూఉంటున్న నేపథ్యంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవని  నిపుణులు చెబుతున్నారు.
 
 పూర్తిగా తెలుసుకోవాలి
 టాటూ వేయించుకోవాలనే వారు ముందుగా దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. టాటూ వేసే వారి అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. మంగళూరుకు చెందిన మేం ఏడాదికి రెండు సార్లు కర్నూలుకు వచ్చి టాటూ వేస్తుంటాం. శరీరానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని రంగులను మిక్స్ చేసి యువత కోరుకున్న చిత్రాలను ఎలాంటి బాధ లేకుండా వేయడం మా ప్రత్యేకత. 15 సంవత్సరాలుగా మంగళూరు, బెంగళూరు, గోవా తదితర నగరాల్లో తమ బ్రాంచ్‌లు ఉన్నాయి. కనీసం 30 స్క్వైర్ ఇంచుల బిజినెస్ ఉంటే ఇక్కడకు వస్తుంటాం.- గాడ్విన్ మోజేస్

మరిన్ని వార్తలు