తెలంగాణ పునర్నిర్మాణంలో యువతే కీలకం

2 Sep, 2013 00:41 IST|Sakshi

 మోమిన్‌పేట, న్యూస్‌లైన్: అన్ని వర్గాల ప్రజలు కలసికట్టుగా పనిచేస్తేనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్ పేర్కొన్నారు. ఆదివారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ప్రారంభం, మేకవనంపల్లి, అంరాధికలాన్, అంరాధికుర్దు, కొత్తకొల్కుందలలో పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. పాత కొల్కుందలో రూ.5లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసినందున తెలంగాణ పునర్నిర్మాణంలో యువత కీలకపాత్ర పోషించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
 
 ఎవరెన్ని కుట్రలు పన్నినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆగదన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికకు, బంగారు తల్లి పథకానికి చట్టబద్ధత కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. దళిత, గిరిజనుల అభివృద్ధికి, బాలికల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అంతకుముంది చీమల్‌ధరి సర్పంచ్ నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో 100మంది గ్రామస్తులు మంత్రి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం రాళ్లగుడుపల్లి సమీపంలో ఉన్న రామలింగేశ్వరస్వామిని మంత్రి దర్శించుకున్నారు. కార్యక్రమంలో మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు వేమారెడ్డి, మండల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు నర్సింహారెడ్డి, సర్పంచ్‌లు శంకర్, మల్లారెడ్డి, మోతిలాల్, పర్మయ్య, పార్టీ నాయకులు భుజంగ్‌రెడ్డి, బుచ్చిరాంలు, మల్లేష్, మహిపాల్, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు