‘యువ’తరం తగ్గుతోంది!

19 Jan, 2020 05:17 IST|Sakshi

2011లో 1.69 కోట్లు ఉండే యువత 2026 నాటికి 1.47 కోట్లకే పరిమితం

ఇదే సమయంలో రాష్ట్ర జనాభా కూడా కేవలం 65 లక్షల మేర మాత్రమే పెరుగుదల

పెళ్లి, పిల్లలపై యువతలో మారుతున్న ఆలోచన ధోరణులే కారణమంటున్న నిపుణులు

ప్రణాళికా శాఖ రూపొందించిన అంచనాల్లో వెల్లడి

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ‘యువ’తరం తగ్గిపోతోంది. 2011 గణాంకాలతో పోలిస్తే.. 2026 నాటికి 20 ఏళ్లలోపు యువత ఏకంగా 22 లక్షల మంది తగ్గనున్నట్లు రాష్ట్ర ప్రణాళికా శాఖ రూపొందించిన జనాభా గణాంకాల అంచనాల్లో వెల్లడైంది. 2011 నాటికి 1.69 కోట్లు ఉన్న 20 ఏళ్లలోపు యువతీ యువకుల సంఖ్య 2026 నాటికి 1.47 కోట్లకే పరిమితం కానున్నట్లు తెలిపింది. ఇదే సమయంలో రాష్ట్ర జనాభా కేవలం 65 లక్షల మేర మాత్రమే పెరిగే అవకాశం ఉందని ప్రణాళికా శాఖ పేర్కొంది.

యువతలో మారుతున్న ఆలోచన 
20 ఏళ్లలోపు యువతీ యువకుల సంఖ్య తగ్గిపోవడానికి ప్రధాన కారణం పెళ్లిళ్లు, పిల్లలపై యువతలో మారుతున్న ఆలోచన ధోరణులేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పాత తరంలో ఎక్కువ మంది పిల్లలను కనేవారు. ఇటీవల వరకు ఒకరిద్దరు పిల్లలు చాలనే ధోరణి నెలకొంది. కానీ, ఇప్పుడు ఒకరు చాలనే ఆలోచనకు వచ్చేశారని వారు విశ్లేషిస్తున్నారు. దీనివల్లే 20 ఏళ్లలోపు యువతీ యువకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోందంటున్నారు. అలాగే, యువకులతో పాటు యువతుల సంఖ్య కూడా సమానంగా తగ్గిపోతున్నట్లు ప్రణాళికా శాఖ అంచనాలో వెల్లడైంది. 1971లో రాష్ట్ర మొత్తం జనాభాలో 20 ఏళ్లలోపు వారి శాతం 48.4 ఉండగా.. అది 2026 నాటికి 26.5 శాతానికే పరిమితం కావచ్చునని ప్రణాళికా శాఖ అంచనాల్లో తేలింది. 

జనాభా పెరుగుదలలోనూ తగ్గుదలే
అలాగే, 1991 నుంచి 2011 వరకు రాష్ట్ర జనాభా 90 లక్షలు పెరగ్గా.. అదే 2011 నుంచి 2026 నాటికి జనాభా పెరుగుదల కేవలం 65 లక్షలు మాత్రమే ఉంటుందని అంచనాల్లో తేలింది. కాగా, 20 ఏళ్ల జనాభా పెరుగుదల శాతం ఆధారంగా విద్యకు సంబంధించిన మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టాల్సి ఉంటుందని ప్రణాళిక శాఖ పేర్కొంది. 

మరిన్ని వార్తలు