రుణమా.. రణమా?

20 Jun, 2018 08:17 IST|Sakshi

కార్పొరేషన్ల రుణాల కోసం యువత పాట్లు

నాలుగేళ్లుగా పదేపదే దరఖాస్తు చేసినా దక్కని రుణం

రాయితీ ఎరతో జన్మభూమి కమిటీలు దోపిడీ

కేటాయించిన యూనిట్లు స్వల్పం... దరఖాస్తులు అధికం

బీసీ రుణాలకే 40 వేల వరకూ దరఖాస్తులు 

ఎస్సీ రుణాలకు 11,420 రిజిస్ట్రేషన్లు 

సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం:  అలా అతనొక్కడే కాదు జిల్లాలో వేలాది మంది కోరుకునేదీ అదే! కానీ అలా జరిగితే జన్మభూమి కమిటీలు ఊరుకుంటాయా? ఊహూ... టీడీపీ అనుకూలమా? ఏమైనా కమీషను ముట్టజెబుతున్నాడా? మనోడా కాదా? ఇలా అన్నీ చూసుకున్న తర్వాతే దరఖాస్తులు ముందుకెళ్లే అవకాశం కల్పిస్తున్నాయి. లేదంటే గత నాలుగేళ్లు మాదిరిగానే ఈ ఏడాదీ ఆశాభంగం తప్పదు మరి!

వివిధ కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వం యువతకు ప్రకటించిన రాయితీ రుణాలకు ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. వారిలో చాలామంది గతంలో దరఖాస్తు చేసుకున్నప్పటికీ జన్మభూమి కమిటీలు సిఫారసు చేయకపోవడంతో నిరాశ తప్పలేదు. రుణాలు పొందే అవకాశం చేజారిపోయింది. దీంతో వారు మళ్లీ మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, కాపు, ఎంబీసీ తదితర వర్గాలకు ఆయా కార్పొరేషన్ల ద్వారా బ్యాంకు లింకేజీలతో రుణాలు మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ దఫా గడువు ముగిసిన సమయానికి బీసీ రుణాలకు 40 వేల వరకూ దరఖాస్తులు దాఖలయ్యాయి. ఎస్సీ రుణాలకు 11,420 వరకూ రిజిస్ట్రేషన్లు అయ్యాయి. మిగతా కార్పొరేషన్లకు కూడా దరఖాస్తుల తాకిడి ఎక్కువగానే ఉంది. 

పచ్చచొక్కాలు, దళారులదే హవా...
రాయితీ రుణాలంటే జన్మభూమి కమిటీలకు, టీడీపీ నాయకులు, కార్యకర్తలకే కాసుల సంద డి. నిరుద్యోగుల నుంచి కమీషన్లు భారీగానే నొక్కేస్తున్నారు. కానీ దాఖలైన దరఖాస్తుల సంఖ్యకు, మంజూరైన యూనిట్ల సంఖ్యకు భారీ తేడా ఉంటోంది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ను ప్రభుత్వం జన్మభూమి కమిటీల చేతుల్లో పెట్టడంతో అర్హులైన లబ్ధిదారులకు న్యాయం జరగట్లేదు. రాయితీ రుణం వస్తుందని జన్మభూమి కమిటీలకు నిరుద్యోగులు కమీషన్లు ముట్టజెప్పుతున్నారు. తీరా జన్మభూమి కమిటీలు ఎంపిక చేసిన వారికి బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు మొగ్గు చూపించట్లేదు. దీంతో యూనిట్లు గ్రౌండ్‌ కావడంలేదు.

 ఒక్కో యూని ట్‌ విలువ రూ.2 లక్షలు. దీన్ని ఒక్కో లబ్ధిదారుడికే మంజూరు చేయాలి. కానీ ఎక్కువ మందిని ముగ్గులోకి దింపడానికి వీలుగా టీడీపీ నాయకులు ఒక్కో యూనిట్‌ను ఇద్దరికి, ముగ్గురికి, కొన్ని చోట్ల నలుగురిని లబ్ధిదారులుగా ఎంపిక చేసిన దాఖలాలు ఉన్నాయి. అంతేకాదు చాలాచోట్ల బినామీ పేర్లతో రుణాలను వారే దక్కించుకుం టున్నారనే విమర్శలు వస్తున్నాయి. మొత్తం మీద జన్మభూమి కమిటీల పెత్తనం, బ్యాంకుల్లో దళారుల జోక్యం కారణంగా రుణాల మంజూ రు ప్రక్రియ గందరగోళంగా తయారైంది. 

మూడేళ్లుగా మంజూరు ముచ్చట..
బీసీ రుణాలు: 2016–17 ఆర్థిక సంవత్సరంలో జిల్లా లక్ష్యం 2,174 యూనిట్లు. రుణాల కింద రూ.38.98 కోట్లు లబ్ధిదారులకు ఇవ్వాల్సి ఉంది. కానీ ఇద్దరు ముగ్గురికి పంచడంతో యూనిట్ల సంఖ్య 3,086కి చేరింది. తీరా మంజూరైన రుణాల మొత్తం రూ. 31.63 కోట్లు మాత్రమే. రూ. 7.35 కోట్ల మేర నిధులు మిగిలిపోయాయి. 2017–18 ఆర్థిక సంవత్సరంలో 5,449 యూనిట్లకు రూ. 108.98 కోట్లు రుణాలుగా ఇవ్వాలనేది లక్ష్యం కాగా 7,769 మందికి రూ. 97.06 కోట్లు మాత్రమే మంజూరు చేశారు. ఈసారి కూడా రూ.11.91 కోట్లు మిగిలిపోయాయి. 2018–19 ఆర్థిక సంవత్సరానికి 5,063 యూనిట్లకు రూ. 101.26 కోట్లు రుణాలుగా ఇవ్వాలనేదీ లక్ష్యం. కాగా గడువు ముగిసే సమయానికి 40,365 దరఖాస్తులు వచ్చాయి. 

 కాపు రుణాలు : 2016–17 ఆర్థిక సంవత్సరంలో యూనిట్లు 1,147 కాగా రూ. 21 కోట్లు రుణాలుగా ఇవ్వాలనేది లక్ష్యం. కానీ 993 మందికి రూ. 14.06 కోట్లు మాత్రమే మంజూరు చేశారు. సుమారు రూ. 7 కోట్ల నిధులు మిగిలిపోయాయి. 2017–18లో 1200 యూనిట్లకు రూ. 24 కోట్లు రుణాలుగా ఇవ్వాలనేదీ లక్ష్యం. కానీ 1371 మందికి రూ. 19.56 కోట్లు మాత్రమే మంజూరు అయ్యాయి. రూ. 4.44 కోట్లు నిధులు మిగిలిపోయాయి. ఈ 2018–19 ఆర్థిక సంవత్సరానికి వెయ్యి యూనిట్లకు రూ. 20 కోట్లు రుణాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకూ 4,538 దరఖాస్తులు దాఖలయ్యాయి. 

 ఈబీసీ రుణాలు: 2017–18 ఆర్థిక సంవత్సరానికి 638 యూనిట్లుకు రూ. 12.76 కోట్లు రుణాలు లక్ష్యం కాగా, 217 యూనిట్లుకు రూ. 4.32 కోట్లు మాత్రమే మంజూరయ్యాయి. 2018–19 ఆర్థిక సంవత్సరంలో  471 యూనిట్లుకు రూ. 9.42 కోట్లు రుణాలు ఇవ్వాలనేది లక్ష్యం. కాగా 236 దరఖాస్తులు వచ్చాయి. 

 ఎంబీసీ రుణాలు : మిక్కిలి వెనుకబడిన వర్గాలకు 2017–18 ఆర్థిక సంవత్సరంలో 2,574 యూనిట్లుకు రూ. 15.44 కోట్ల మేర రుణాలు ఇవ్వాలనేదీ లక్ష్యం. కానీ 1,641 యూనిట్లుకు రూ. 9.84 కోట్లు మాత్రమే మంజూరు చేశారు. ఈ 2018–19 ఆర్థిక సంవత్సరానికి 857 యూనిట్లకు రూ. 17.14 కోట్లు రుణలక్ష్యం నిర్దేశించారు. వాటి కోసం 2,640 మంది దరఖాస్తు చేసుకున్నారు.  
 ఎస్సీ రుణాలు: 2016–17 ఆర్థిక సంవత్సరంలో 1,075 యూనిట్లకు రూ. 21.02 కోట్ల రుణాలు ఇవ్వాలి. కానీ 892 యూనిట్లకు రూ. 12.13 కోట్లు మాత్రమే మంజూరు చేశారు. 2017–18 ఆర్థిక సంవత్సరంలో 2,413 యూనిట్లకు రూ.24.13 కోట్లు లక్ష్యం కాగా వాటిలో 1,986 యూనిట్లకు రూ. 28.75 కోట్లు మంజూరు చేశారు. 2018–19 ఆర్థిక సంవత్సరానికి 1,926 యూనిట్లకు రూ. 31.89 కోట్లు రుణాలు ఇవ్వాలనేదీ లక్ష్యం. గడువు సమయానికి 11,420 మంది దరఖాస్తు చేసుకున్నారు.  

మరిన్ని వార్తలు