రైతులకు ఇన్సూరెన్స్‌ ఇప్పించాలి

19 Aug, 2018 12:46 IST|Sakshi

పెండింగ్‌లో ఉన్న వారందరికీ ఇవ్వాలి

 ఇన్‌పుట్‌ సబ్సిడీ మంజూరు చేయించండి

 జేసీ–2ను కోరిన మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి

కడప కార్పొరేషన్‌ : 2012 రబీకి సంబంధించి 21,250 మంది రైతులకు పెండింగ్‌లో ఉన్న ఇన్సూరెన్స్‌ను వెంటనే ఇప్పించాలని మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి కోరారు. ఆయన జెడ్పీ వైస్‌ చైర్మన్‌ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, వేముల, ముద్దనూరు, కొండాపురం రైతులతో కలసి జేసీ–2 శివారెడ్డిని శనివారం కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ 2014 రబీలో బుడ్డశనగ పంటకు బ్యాంకులో రెన్యువల్‌ æచేసిన వారికి చెల్లించారని, మిగిలిన వారికి, ఇన్సూరెన్స్‌ కంపెనీ ద్వారా కట్టిన వారికి ఇవ్వలేదన్నారు. వేముల, ముద్దనూరు, కొండాపురం మండలాల రైతులకు ఈ ఇన్సూరెన్స్‌ రాలేదన్నారు. అలాగే 2013–14లో లింగాల, వేముల మండలాల్లో బుడ్డశనగ, ఉద్యాన పంటలు వేసిన రైతులు అకాల వర్షాల వల్ల పంట పూర్తిగా నష్టపోయారన్నారు.

 జిల్లా వ్యవసాయ, రెవెన్యూ, ఉద్యాన శాఖల అధికారులు వచ్చి పంటను సర్వే చేసి ప్రభుత్వం ద్వారా నష్ట పరిహారం ఇప్పిస్తామని హామీ ఇచ్చారని, ఇంత వరకూ ఇవ్వలేదన్నారు. 2015 ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇంకా కొందరికి రాలేదన్నారు. 2014–15 రబీ బుడ్డశనగకు గ్రామాన్ని యూనిట్‌గా తీసుకున్నారని, దీనికి కూడా ఇన్సూరెన్స్‌ రాలేదన్నారు. 2016 బుడ్డశనగ ఇన్సూరెన్స్‌ కూడా పెండింగ్‌లోనే ఉందన్నారు. 2017లో ప్రతి పంటకు ఇన్సూరెన్స్‌ బ్యాంకులకు పంపారని, కానీ ఇంత వరకూ రైతుల ఖాతాల్లో జమ చేయలేదన్నారు. 2013–14లో లింగాల, తొండూరు, పులివెందుల, సింహాద్రిపురం మండలాల్లో వర్షాభావం వల్ల ఉద్యాన పంటలు ఎండిపోతుంటే అధికారులు వచ్చి.. మీరు ట్యాంకర్ల ద్వారా నీళ్లు తోలుకోండి, డబ్బులిస్తామని రైతులకు చెప్పారని, ఇంత వరకూ ఇవ్వలేదన్నారు.

 2015–16 కరువు నిధులు 30 శాతం పెండింగ్‌లో ఉన్నాయన్నారు. జిల్లాలో రైతు రుణమాఫీ 20 శాతం పెండింగ్‌లో ఉందని, దీనివల్ల బ్యాంకు అధికారులు రుణాలు చెల్లించాలని రైతులపై ఒత్తిడి తెస్తున్నారన్నారు. ఈ ఏడాది అరకొర వర్షం పడటం వల్ల కొందరు రైతులు విత్తనం విత్తినారని, వర్షం పడక పైరు ఎండిపోయిందన్నారు. 80 శాతం మంది రైతులు విత్తనమే వేయలేదన్నారు. రైతుల జీవన పరిస్థితి దుర్భరంగా ఉందని, వారికి పెట్టుబడి రాయితీ వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. జేసీ–2ను కలిసిన వారిలో వైఎస్‌ఆర్‌సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి, రైతులు విజయశంకర్, మోహన్, ప్రహ్లాదుడు, రజనీకాంత్‌రెడ్డి, శివశంకర్, చంద్రశేఖర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, విజయ్‌భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు