వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో ప్రతి ఆటో కార్మికుడికి రూ.10 వేలు

26 Feb, 2019 13:24 IST|Sakshi
కడపలో ఖాకీ చొక్కాలతో మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, మేయర్, ఎమ్మెల్యేలు

మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, మేయర్, ఎమ్మెల్యేలు

ఆటో కార్మికులకు ఖాకీ చొక్కాలు పంపిణీ

కడప కార్పొరేషన్‌: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ఏర్పడితే ప్రతి ఆటో కార్మికుడికి ఏడాదికి రూ.10వేలు ఇస్తామని మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక అపూర్వ కల్యాణమండపంలో కడప ఎమ్మెల్యే అంజద్‌బాషా ఆధ్వర్యంలో ఆటోలకు ‘రావాలి జగన్, కావాలి జగన్‌’ స్టిక్కర్లు అతికించి, డ్రైవర్లకు ఖాకీ చొక్కాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఆటో కార్మికుల సంక్షేమం గురించి ఏ నాయకుడు ఆలోచించలేదన్నారు. ప్రజా సంకల్పయాత్రలో ఆటో కార్మికుల జీవితాలు ప్రత్యక్షంగా చూసిన వైఎస్‌ జగన్‌ వారి సంక్షేమం కోసం ఏడాదికి రూ.10వేలు ఇవ్వాలని నిర్ణయించారన్నారు. ఆటో కార్మికులంతా వైఎస్‌ఆర్‌సీపీకి మద్దతు పలుకుతారని భావించిన సీఎం చంద్రబాబు ఆటో కార్మికులకు లైఫ్‌ ట్యాక్స్‌ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారన్నారు.

ఇది కచ్చితంగా వైఎస్‌ఆర్‌సీపీ ఘనతేనని తెలిపారు. మేయర్‌ సురేష్‌బాబు మాట్లాడుతూ ఆటో కార్మికులకు ఇచ్చే రూ.10వేలతోపాటు నవరత్నాల వల్ల కూడా ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వల్లే జిల్లా అభివృద్ధి చెందిందని, మళ్లీ అలాంటి పాలన రావాలంటే వైఎస్‌ జగన్‌తోనే సాధ్యమన్నారు.  కడప ఎమ్మెల్యే అంజద్‌బాషా మాట్లాడుతూ ఎన్నికల కోసమే చంద్రబాబు పింఛన్ల పెంపు, పసుపు, కుంకుమ అంటూ పథకాలు ప్రకటిస్తున్నారన్నారు. ఆయనకు ప్రజల సంక్షేమంపై చిత్తశుద్ధి ఉంటే అధికారంలోకి వచ్చిన నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలు ఏం చేశారని ప్రశ్నించారు.  అనంతరం వారు ఖాకీ చొక్కాలు తొడుక్కొని ఆటో డ్రైవర్లను ఉత్సాహ పరిచారు. ఈ  కార్యక్రమంలో కమలాపురం సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, హరూన్‌బజాజ్‌ ఎండీ ఎస్‌బి అహ్మద్‌బాషా, వైఎస్‌ఆర్‌టీయూసీ నాయకులు జి. సురేష్‌కుమార్, జాషువా, జోసెఫ్, జాకీర్, కడప అసెంబ్లీ మైనార్టీ ఇన్‌చార్జి షఫీ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు