కడపకు నీళ్లొచ్చేశాయ్‌

26 Aug, 2019 08:53 IST|Sakshi

గండికోట నుంచి నీరు విడుదల చేసిన ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి

హర్షం వ్యక్తం చేస్తున్న ఆయకట్టుదారులు

సాక్షి, కడప : జిల్లాలో కరువు పరిస్థితులు ఉన్నా.. కృష్ణా జలాలను యుద్ధప్రాతిపదికన జిల్లాకు తరలించి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అన్నదాతకు అండగా నిలిచింది. ఇప్పటికే కేసీ కెనాల్, తెలుగుగంగ ప్రాజెక్టుల ద్వారా జిల్లాకు చేరగా, తాజాగా కర్నూలు జిల్లాలోని అవుకు నుంచి గండికోటకు సైతం ప్రభుత్వం కృష్ణా జలాలను తరలించింది. ఆదివారం కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి గండికోట పరిధిలోని నీటి వనరులకు జలాన్ని విడుదల చేశారు. దీంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎగువన భారీ వర్షాలు కురవడంతో శ్రీశైలం ప్రాజెక్టు నిండింది. జిల్లాలో కరువు పరిస్థితుల నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు తక్షణమే తెలుగుగంగ, కేసీ కెనాల్‌తోపాటు గండికోట ప్రాజెక్టు పరిధిలోని నీటి వనరులకు కృష్ణా జలాలు విడుదల చేయాలని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, జిల్లాలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శాసనసభ్యులు ప్రభుత్వాన్ని కోరారు.

వెంటనే స్పందించిన జగన్‌ ప్రభుత్వం శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు, బానకచర్ల మీదుగా జిల్లాకు నీటిని విడుదల చేసింది. ఆదివారం నాటికి గండికోటలో ఐదు టీఎంసీలు చేరాయి. దీంతో దిగువనున్న నీటి వనరులకు కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి నీటిని విడుదల చేశారు. చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌కు 500 క్యూసెక్కులు, మైలవరానికి 500, సర్వరాయసాగర్‌కు 500, పైడిపాలెంకు 200 క్యూసెక్కుల చొప్పున తొలిరోజు ప్రజాప్రతినిధులు నీటిని విడుదల చేశారు. సోమవారం సర్వరాయసాగర్‌కు కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి 200 క్యూసెక్కులు విడుదల చేయనున్నారు. ప్రస్తుతం గండికోటకు పది వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ఒకటి, రెండు రోజుల్లో ఇన్‌ఫ్లో మరికొంత పెరగనుందని గాలేరు–నగరి ఎస్‌ఈ మధుసూదన్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. గండికోట పరిధిలోని మొత్తం ఆయకట్టుకు సాగునీరు అందించనున్నట్లు చెప్పారు. 

అన్నదాతలను ఆదుకుంటాం 
ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు పడటంతో శ్రీశైలం జలాశయంలో నీళ్లు నిల్వ ఉన్నాయి. దీంతో జిల్లాలోని అన్ని ప్రాజెక్టులను నీటితో నింపి రైతులకు మేలుచేసే కార్యక్రమం చేపట్టినట్లు కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం గండికోట ప్రాజెక్టు వద్ద రెండు గేట్లు ఎత్తి మైలవరానికి, గండికోట ఎత్తిపోతల పథకం స్టేజ్‌–1 ద్వారా పైడిపాళెంకు, స్టేజి–2 ద్వారా చిత్రవతి బ్యాలెన్స్‌ రిజర్వాయర్‌కు మోటర్లు ఆన్‌ చేసి ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, జీఎన్‌ఎస్‌ఎస్‌ ఎస్‌ఈ మధుసూదన్‌రెడ్డి, ఈఈ రామంజినేయులు నీరు విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ రైతులకు సాగునీరు ఇచ్చి ఆదుకోవాలనే సంకల్పంతో నాడు గండికోట ప్రాజెక్టును నిర్మించిన మహనీయుడు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సహకారంతో గండికోట ప్రాజెక్టు ద్వారా మైలవరం జలాశయం నుంచి పెన్నానదిలోకి విడుదల చేసి ప్రొద్దుటూరు, కమలాపురం నియోజకవర్గాల్లోని గ్రామాల్లో నీటి ఎద్దడి లేకుండా చేస్తామని చెప్పారు. జిల్లాలోని వామికొండ, సర్వారాయసాగర్, చిత్రావతి బ్యాలెన్స్‌రిజర్వాయర్, మైలవరం ప్రాజెక్టుల్లో నీటిని నింపుతామన్నారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బ్రహ్మంసాగర్‌లో 10 టీఎంసీల నీళ్లు నిల్వ చేశారు. ఈ ఏడాది 12 టీఎంసీలు నిల్వ చేసి చరిత్ర తిరగరాస్తామని చెప్పారు.

ఎమ్మెల్యే డాక్టర్‌ సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ముంపు గ్రామాల సమస్యలు పరిస్కారం కాలేదని అన్నారు. ముంపు గ్రామాల్లోని తాళ్లప్రొద్దుటూరు, యర్రగుడి, చామలూరు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరిలించేదాకా ఇబ్బందుకు గురిచేయమన్నారు. పేజ్‌–2 గ్రామాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాట చేస్తామని చెప్పారు. ప్రజలను అన్ని విధాలా ఆదుకుంటామని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి దండ్లాగు శంకర్‌రెడ్డి, ముద్దనూరు మునిరాజారెడ్డి, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ నిరంజన్‌రెడ్డి, కొండాపురం సింగిల్‌విండో అధ్యక్షుడు కొండువాసుదేవారెడ్డి, కొండాపురం నీలకంఠారెడ్డి,రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఎల్‌. రామమునిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌. హరినారాయణరెడ్డి,జిల్లా కార్యదర్శి ఎస్‌ చిన్నఅంకిరెడ్డి, మండల మైనార్టీ అధ్యక్షుడు ఖాదర్‌భాషా,రామసుబ్బారెడ్డి, మండల యూత్‌ కన్వీనర్‌ లక్ష్మికాంత్‌రెడ్డి, గండ్లూరు బాలనాగిరెడ్డి, రామం జి, పెద్దిరెడ్డి, రమేష్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు