రూ.400 నుంచి ఏకంగా 900లకు పెంచేశారు

7 Oct, 2018 07:48 IST|Sakshi

280వ రోజు ప్రజాసంకల్పయాత్ర

సాక్షి, చీపురుపల్లి : రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలుస్తూ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరం జిల్లాలో అనంతవాహినిలా సాగిపోతోంది. ఆదివారం ఉదయం జననేత 280వ రోజు పాదయాత్రను వల్లాపురం క్రాస్‌ నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి చీపురుపల్లి నియోజకవర్గంలోని కెల్లా మీదుగా రెల్లి పేట, గుర్ల వరకు పాదయాత్ర కొనసాగనుంది. సాయంత్రం గుర్లలో జరిగే బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ పాల్గొని ప్రసంగిస్తారు. కాగా, ఇప్పటివరకు వైఎస్‌ జగన్‌ 3089.3 కిలోమీటర్లు నడిచారు.

ధరలు విపరీతం..
కెల్లా గ్రామంలో వైఎస్‌ జగన్‌ను కలిసిన చేనేత కార్మికులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం నూలు ధరలను విపరీతంగా పెంచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టె నూలు 400 రూపాయలు ఉండగా.. ఇప్పుడు ఏకంగా 900 చేరిందని వాపోయారు. ఎంత కష్టపడినా గిట్టుబాటు ధర రావడం లేదన్నారు. పాదయాత్రలో మాజీ ఎంపీ వరప్రసాద్‌ పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. వైఎస్‌ జగన్‌ను ఖోఖో ప్లేయర్లు కలిశారు. కోచ్‌ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. సరైన కోచ్‌ ఉంటే జాతీయ స్థాయిలో సత్తా చాటుతామని వెల్లడించారు.

విశ్వబ్రాహ్మణ సంఘం నేతలు వైఎస్‌ జగన్‌ కలిశారు. స్వర్ణకారులకు హామీ ఇచ్చినట్టే తమను కూడా ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. కార్పెంటర్లకు ప్రభుత్వ టింబర్‌ డిపోల నుంచి సబ్సిడీపై కలప సరఫరా చేయాలని ఆయనకు విన్నవించారు. కాగా, విశ్వబ్రాహ్మణుల్లో.. కార్పెంటర్లు, శిల్పం,  కంచర, కమ్మర ఉప కులాలు ఉన్నాయి.

జననేత వైఎస్‌ జగన్‌ను కలవడానికి పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, పార్టీనేతలు తరలివచ్చారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి రాజన్న తనయుడికి ఘనస్వాగతం లభించింది. ఇక ప్రజలు తమ సమస్యలను జననేతకు విన్నవించుకుంటున్నారు. వారి సమస్యలను విన్న వైఎస్‌ జగన్ భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు.

మరిన్ని వార్తలు