కాలిబాటన కొండపైకి..

11 Jan, 2019 02:16 IST|Sakshi
మెట్ల మార్గం ద్వారా కాలినడకన కొండకు వెళ్తున్న ప్రతిపక్ష నేత

సామాన్య భక్తుడిలా దివ్యదర్శనం టోకెన్‌తో స్వామివారి దర్శనం

అలిపిరి మెట్ల మార్గం ద్వారాతిరుమల చేరుకున్న ప్రతిపక్ష నేత

తొలి మెట్టు వద్ద ప్రత్యేక పూజ అనంతరం నడక ప్రారంభం

ఎక్కడా విశ్రమించకుండా మూడుగంటల్లో కొండపైకి..

మార్గం మధ్యలో గోవింద నామస్మరణ

సంప్రదాయ బద్ధంగా స్వామి దర్శనం

ఆశీర్వదించిన వేదపండితులు నడకదారిలో జగన్‌ వెంటవచ్చిన వేలాది మంది..

సాక్షి, తిరుపతి, చిత్తూరు: ప్రజా సంకల్ప యాత్ర దిగ్విజయంగా ముగించిన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పాదయాత్ర ముగిసిన ఇచ్ఛాపురం నుంచి నేరుగా తిరుపతికి వచ్చిన ఆయన అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమల చేరుకున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు పాదాల మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. అశేష సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు అనుసరించగా.. తొలి మెట్టుకు మొక్కి వైఎస్‌ జగన్‌ నడక ప్రారంభించారు. పాదరక్షలు లేకుండా నడుస్తూ.. దారి పొడవునా శ్రీవారిని ధ్యానిస్తూ.. ‘గోవిందా.. గోవిందా.. శ్రీమన్నారాయణ’ అంటూ  నామస్మరణ చేస్తూ.. భక్తి ప్రపత్తులతో వడివడిగా మెట్లు ఎక్కారు. దారిలో ఎక్కడా విశ్రమించకుండా ముందుకు సాగారు. కాలినడకన వచ్చే భక్తులకు దర్శనం కోసం ఇచ్చే ‘దివ్యదర్శనం’ టోకెన్‌ను సామాన్య భక్తుడిగా వైఎస్‌ జగన్‌ తీసుకున్నారు. ఆయన వెంట వచ్చిన నాయకులు, కార్యకర్తలు కూడా దివ్యదర్శనం టోకెన్లు తీసుకుని ముందుకుసాగారు.

వైఎస్‌ జగన్, ఆయనతో నడిచినవారు చేసిన నామస్మరణతో మెట్ల మార్గం మొత్తం గోవింద నామంతో మార్మోగింది. ఏకబిగిన మెట్లు ఎక్కిన జగన్‌.. సాయంత్రం 4.30 గంటలకు తిరుమల చేరుకున్నారు. అనంతరం శ్రీకృష్ణ అతిథిగృహంలో కాసేపు ఆగారు. సంప్రదాయ దుస్తులు ధరించి సాయంత్రం 6 గంటలకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ ద్వారా దివ్యదర్శనం టోకెన్‌తో శ్రీవారి దర్శనానికి క్యూలైన్‌లో ప్రవేశించారు. ఆలయంలోకి వెళ్లిన తర్వాత ధ్వజస్తంభానికి మొక్కి శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లారు. స్వామివారి దర్శనం అనంతరం.. ఆనంద నిలయంపైన కొలువై ఉన్న విమాన వెంకటేశ్వరస్వామికి మొక్కారు. శ్రీవారి ఆలయం ప్రాంగణంలోని అన్నమయ్య భాండాగారాన్ని (అన్నమయ్య సంకీర్తనల ప్రతులను భద్రపరిచిన గది) సందర్శించారు. హుండీలో కానుకలు సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. అనంతరం యోగనరసింహస్వామిని దర్శించుకున్నారు. తర్వాత రంగనాయక మండపంలో వేదపండితులు వైఎస్‌ జగన్‌ను ఆశీర్వదించి ఆయనకు స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం అందించారు. దర్శనం అనంతరం రాత్రి 7 తర్వాత ఆయన బసచేసే శ్రీకృష్ణ అతిథి గృహానికి వెళ్లారు. 

రైల్లో రేణిగుంటకు..
పాదయాత్ర పూర్తయిన తర్వాత దురంతో ఎక్స్‌ప్రెస్‌లో నేరుగా రేణిగుంట స్టేషన్‌కు ఉదయం 10.10 గంటలకు వైఎస్‌ జగన్‌ చేరుకున్నారు. అక్కడ నుంచి తిరుపతి పద్మావతి అతిథిగృహానికి వెళ్లారు. దారి పొడవునా ఆయనకు ప్రజలు పెద్ద సంఖ్యలో స్వాగతం పలికారు. పద్మావతి అతిథి గృహం వద్దకు భారీగా ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు చేరుకోవడంతో అక్కడ కోలాహలం నెలకొంది. అతిథి గృహం నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు బయలుదేరి అలిపిరి మెట్లమార్గం వద్దకు చేరుకున్నారు. దారి పొడవునా కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో రోడ్డు మీదకు వచ్చి వైఎస్‌ జగన్‌పై  పూలు చల్లారు. అందిరికీ అభివాదం చేస్తూ ఆయన ముందుకు సాగారు.వైఎస్‌ జగన్‌.. అలిపిరి మెట్ల మార్గం మధ్యలో గాలిగోపురం వద్ద శ్రీకృష్ణుడి ఆలయంలోకి వెళ్లి దణ్ణం పెట్టుకున్నారు.


మెట్ల మార్గంలోని ఆంజనేయ స్వామి గుడి వద్ద కొబ్బరికాయ కొడుతున్న జగన్‌ 

ఏడోమైలు ఆంజనేయస్వామి ఆలయం వద్ద కొబ్బరికాయ కొట్టి పూజ చేశారు. కాలినడక ముగించే ముందు ఆఖరి మెట్టు వద్ద హారతి ఇచ్చి దణ్ణం పెట్టుకున్నారు. వైఎస్‌ జగన్‌ వెంట రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, మాజీ ఎంపీలు మిథున్‌రెడ్డి, వరప్రసాదరావు, పార్టీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఆర్కే రోజా, అనిల్‌కుమార్‌ యాదవ్, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, ముస్తఫా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, పలు నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్టీ నేతలు, కార్యకర్తలు నడిచారు.


స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి ఆశీస్సులు
శ్రీవారి దర్శనం అనంతరం శారదాపీఠానికి చెందిన మఠానికి జగన్‌ వెళ్లారు. ఆయనకు పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికి మఠంలోకి తీసుకెళ్లారు. అక్కడ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి ఆశీర్వచనం తీసుకున్నారు. 

టీటీడీ నిర్లక్ష్యం 
ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ తిరుమల శ్రీవారి దర్శనం కోసం వస్తున్నారని ముందస్తు సమాచారం ఉన్నా టీటీడీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. తిరుమల చేరుకున్న వైఎస్‌ జగన్‌కు టీటీడీ ముఖ్య అధికారులు ఎవరూ స్వాగతం పలకలేదు. దివ్యదర్శనం కోసం వైఎస్‌ జగన్‌తో 400 మందికి టోకెన్లు ఇచ్చినా ఆలయంలోకి వారిని అనుమతించలేదు. దీంతో క్యూలో తోపులాటలు చోటు చేసుకున్నాయి. అయినా టీటీడీ సెక్యూరిటీ విభాగం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తిరుమల దర్శనానికి వచ్చినపుడు ఆయనతో లోనికి వెళ్లే టీడీపీ నాయకులకు టికెట్లు లేకపోయినా అనుమతించే అధికారులు.. వైఎస్‌ జగన్‌ విషయంలో భిన్నంగా వ్యవహరించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. 


తిరుమల శ్రీవారి ఆలయంలో ధ్వజస్తంభానికి మొక్కుతున్న వైఎస్‌ జగన్‌ 

మరిన్ని వార్తలు