ప్రజాహితానికి నాంది పలకాలి 

22 Dec, 2018 09:33 IST|Sakshi
వైఎస్‌ జగన్‌ జన్మదిన వేడుకల్లో పార్టీ సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు

వైఎస్‌ జగన్‌ను సీఎం చేస్తే తండ్రిని మించిన తనయుడు అవుతారు

జననేత జన్మదిన వేడుకల్లో ప్రజల ఆకాంక్ష

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా సంబరాలు 

వాడవాడలా సేవా కార్యక్రమాల నిర్వహణ

సాక్షి, హైదరాబాద్‌/సాక్షి, అమరావతి/నెట్‌వర్క్‌: ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని రానున్న ఎన్నికల్లో గద్దెనెక్కించడం ద్వారా ప్రజాహితానికి నాంది పలకాలని ఆ పార్టీ సీనియర్‌ నేతలు పిలుపునిచ్చారు. జగన్‌ను ప్రజలు ఆశీర్వదించి ఈ దఫా ముఖ్యమంత్రిని చేస్తే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలుచేయడంలో తన తండ్రి దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డిని మించిపోతారని వారు విజ్ఞప్తి చేశారు. జగన్‌ పుట్టినరోజు పురస్కరించుకుని హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం జరిగిన వేడుకల్లో భారీ కేక్‌ను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ మాజీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి కట్‌ చేశారు. అలాగే, విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయం, ఏపీ అసెంబ్లీలోనూ వైఎస్‌ జగన్‌ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. 

జగన్‌ను ఒక్కసారి ఆశీర్వదించాలి 
కేంద్ర కార్యాలయంలో మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్రంలో దివంగత వైఎస్‌ ప్రజాహితం కోరి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రజల హృదయాల్లో నిలిచిపోయారన్నారు. అలాగే, జగన్‌ కూడా ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహించడంలో ఆయన తండ్రిని మించిపోతారని విశ్వాసం వ్యక్తంచేశారు. అందుకే ప్రజలు ఒక్కసారి జగన్‌ను ఆశీర్వదించాలని కోరుతున్నానని మేకపాటి విజ్ఞప్తి చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. పాదయాత్ర ద్వారా వైఎస్‌ జగన్‌ రోజురోజుకూ ప్రజల హృదయాల్లో తన స్థానం పదిలం చేసుకుంటున్నారన్నారు. మరో మూడు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి కనుక పార్టీ నేతలు, కార్యకర్తలు అందరూ కలిసి జగన్‌కు ఓ అవకాశం ఇవ్వండి అని ఏపీ ఓటర్లకు సవినయంగా విజ్ఞప్తి చేద్దామని ఆయన కోరారు.

పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. జగన్‌పై ఎన్ని కుట్రలు జరిగినా ఆయన అన్నింటినీ ఛేదించుకుని జనం హృదయాల్లో నిలిచిపోతారన్నారు. మంచి నాయకత్వ లక్షణాలున్న జగన్‌ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలని సాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. వచ్చే జన్మదిన వేడుకలను జగన్‌ ముఖ్యమంత్రి హోదాలో జరుపుకుంటారని ఐపీఏస్‌ మాజీ అధికారి, విజయవాడ పార్లమెంటు జిల్లా సమన్వయకర్త మహ్మద్‌ ఇక్బాల్‌ ఆకాంక్షించారు. ఏపీలో జగన్‌ ముఖ్యమంత్రి కావాలని అందరూ కోరుకుంటున్నారని పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు వాసిరెడ్డి పద్మ, ఎన్‌. పద్మజ, కొండా రాఘవరెడ్డి, బి.రాజశేఖరరెడ్డి, చల్లా మధుసూదనరెడ్డి, పుత్తా ప్రతాప్‌రెడ్డి, డాక్టర్‌ ప్రపుల్ల తదితరులు పాల్గొన్నారు. 

వచ్చే ఏడాది సీఎం హోదాలో.. 
కాగా, విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నందమూరి లక్ష్మీపార్వతి  కొలుసు పార్థసారథి, మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్, యలమంచిలి రవి తదితర పార్టీ నేతలు భారీ కేక్‌ కట్‌ చేశారు. పార్టీ డాక్టర్స్‌ సెల్‌ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ మెహబూబ్‌ షేక్‌ ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని శాసన మండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉమ్మారెడ్డి మాట్లాడుతూ, వచ్చే ఏడాది సీఎం హోదాలో వైఎస్‌ జగన్‌ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటారని ఆకాంక్షించారు. పార్థసారథి, లక్ష్మీపార్వతి, సినీనటుడు పృథ్వీ, వెలంపల్లి, మల్లాది విష్ణు కూడా మాట్లాడారు. కార్యక్రమంలో విజయ్‌చందర్, గౌతంరెడ్డి, కాలే పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.

మరోవైపు.. ఏపీ అసెంబ్లీలోని వైఎస్‌ జగన్‌ చాంబర్‌లోనూ పార్టీ సీనియర్‌ నేత, శాసనమండలి ప్రతిపక్ష నేత అయిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేష్‌రెడ్డి కేక్‌ కట్‌చేశారు. పలువురు కార్యాలయ ఉద్యోగులు కూడా పాల్గొన్నారు. ఇక తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్‌ వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో వైఎస్‌ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ పాల్గొని కేక్‌ కట్‌చేసి రక్తదాన శిబిరం నిర్వహించారు. ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ పాల్గొన్నారు. కొత్తపేటలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పార్టీ స్థూపాన్ని ప్రారంభించి పతాకాన్ని ఆవిష్కరించారు. అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీ సమన్వయకర్తలు వేడుకల్లో పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా పుత్తూరులో జరిగిన వేడుకల్లో పార్టీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోజా పాల్గొన్నారు. వైఎస్సార్‌ క్యాంటీన్‌ను ప్రారంభించారు.

వైఎస్సార్‌ జిల్లాలో మెగా జాబ్‌మేళా 
వైఎస్సార్‌ జిల్లాలోనూ జగన్‌ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కడప, పులివెందులలో మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి పాల్గొన్నారు. కడపలో మెగా జాబ్‌మేళా నిర్వహించారు. 72 కంపెనీలు ఇందులో పాల్గొన్నాయి. రాష్ట్రంలో ఉద్యోగాల విప్లవం రావాలంటే వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలని అవినాష్‌రెడ్డి అన్నారు. పులివెందులలో మాజీమంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జిల్లా ఎమ్మెల్యేలు అంజద్‌బాషా, రవీంద్రనాథ్‌రెడ్డి, రఘురామిరెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, రాచమల్లు ప్రసాద్‌రెడ్డిలు కూడా వేడుకలు నిర్వహించారు. రాజంపేటలో పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి సేవా కార్యక్రమాలు చేపట్టారు. మరోవైపు.. గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, గుంటూరు పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి, తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా పాల్గొన్నారు. అనేకచోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యేలు గోపిరెడ్డి, కోన రఘుపతి, సత్తెనపల్లి సమన్వయకర్త అంబటి రాంబాబు, ఇతర నియోజకవర్గ సమన్వయకర్తలు కూడా ఘనంగా వైఎస్‌ జగన్‌ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. వేమూరుకు చెందిన షేక్‌ సలీమ్‌ శుక్రవారం మక్కాలో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు.
కడపలో జరిగిన జాబ్‌మేళాలో రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటున్న నిరుద్యోగ అభ్యర్థులు 

విశాఖ జిల్లాలో గీతం, ఏయూ వర్సిటీలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో బైకులు, కారుల్లో యూనివర్సిటీ నుంచి భారీ ర్యాలీలు నిర్వహించారు. పార్టీ నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్, పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు తైనాల విజయకుమార్‌ నేతృత్వంలో 20 కేజీల భారీ కేక్‌ కట్‌ చేశారు. ఎమ్మెల్యే బూడి ముత్యానాయుడు కేక్‌ కట్‌చేశారు. జిల్లాలోని ఆయా నియోజకవర్గాల సమన్వయకర్తలు హుషారుగా వేడుకలు నిర్వహించారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యేలు అనిల్‌కుమార్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి రక్తదాన శిబిరాల్లో పాల్గొన్నారు. అనిల్‌కుమార్‌ రాజన్న పారిశుద్ధ్య చేయూత కార్యక్రమాన్ని ప్రారంభించి ఆటోలను సమకూర్చారు. తడలో తిరుపతి మాజీ ఎంపీ వరప్రసాదరావు  జగన్‌ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు.

ఎమ్మెల్యేలు కిలివేటి సంజీవయ్య, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతపురం జిల్లా పార్టీ కార్యాలయంలో పార్లమెంట్‌ అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి భారీ కేక్‌ కట్‌ చేశారు. ఉరవకొండ, మడకశిరలో ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, తిప్పేస్వామి కేక్‌కట్‌ చేశారు. శింగనమలలో భారీఎత్తున క్రికెట్‌ టోర్నీ ప్రారంభించారు. ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్యేలు జంకె వెంకటరెడ్డి, ఆదిమూలపు సురేష్‌ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఒంగోలులోని పార్టీ జిల్లా కార్యాలయంతోపాటు జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో పార్టీ సమన్వయకర్తలు ఘనంగా వైఎస్‌ జగన్‌ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఇక విజయనగరం జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ, పార్టీ  ఉత్తరాంధ్ర జిల్లాల కన్వీనర్‌ కోలగట్ల వీరభద్రస్వామి కేకు కట్‌ చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.

సాలూరులో ఎమ్మెల్యే రాజన్నదొర కేక్‌ కట్‌చేశారు. కర్నూలు జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలు బీవై రామయ్య, శిల్పా చక్రపాణిరెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి కేక్‌ కట్‌చేశారు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యేలు ఐజయ్య, గౌరు చరితారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా వైఎస్‌ జగన్‌ కోసం సర్వమత ప్రార్థనలతోపాటు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఏలూరులో ఎమ్మెల్సీ ఆళ్ల నాని కేక్‌ కట్‌చేశారు. అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీ సమన్వయకర్తలు ఇతర నేతలు ఘనంగా జగన్‌ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు.

మరిన్ని వార్తలు