ఓటు హక్కు వినియోగించుకున్న వైఎస్‌ జగన్‌

17 Mar, 2017 11:12 IST|Sakshi
ఓటు హక్కు వినియోగించుకున్న వైఎస్‌ జగన్‌

జమ్మలమడుగు: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శుక్రవారం ఓటు హక్కును వినియోగించుకున్నారు. జమ్ములమడుగు పోలింగ్‌ కేంద్రంలో ఆయన ఓటు వేశారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ కూడా సాధారణ ఓటరులాగానే క్యూలో నిలబడి ఓటు వేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలు జరుగుతున్న మూడు జిల్లాల్లోనూ (వైఎస్‌ఆర్‌ జిల్లా, నెల్లూరు, కర్నూలు) వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి మెజార్టీ ఉందన్నారు. తమకు మెజార్టీ ఉన్న స్థానాల్లో టీడీపీ నేతలు పోటీ చేయడం సిగ్గుచేటు అని వైఎస్‌ జగన్‌ వ్యాఖ్యానించారు.

టీడీపీకి బలం లేకపోయినా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే పరిస్థితి కల్పించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సిగ్గుపడాలన్నారు. పార్టీ గుర్తుల మీద గెలిచిన తర్వాత కూడా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వ్యక్తి... అవహేళన చేయడం దారుణమన్నారు. జిల్లాలో 841మంది ఓటర్లు ఉంటే వారిలో 521మంది ఓటర్లు వైఎస్‌ఆర్‌ సీపీ గుర్తుపై గెలిచారన్నారు. ప్రలోభపెట్టి, భయపెట్టి ఓటు వేయించుకోవాలని చూడటం సరికాదన్నారు. పైన దేవుడు ఉన్నాడని, ప్రజల్లో ఇంకా అభిమానం, మంచితనం మిగిలే ఉందని వైఎస్‌ జగన్‌ అన్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్ని కుయుక్తులు పన్నినా చివరకు న్యాయమే గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.