30 ఏళ్లపాటు జగనే సీఎం

17 Jan, 2020 04:56 IST|Sakshi

తాళ్లపూడిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన విజయసాయిరెడ్డి  

ముత్తుకూరు: రాష్ట్రంలో ఏడునెలల పాలనలో విప్లవాత్మకమైన పథకాలను అమలు చేయడం ద్వారా దేశంలోనే ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేరు తెచ్చుకొన్నారని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి అన్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని స్వగ్రామమైన తాళ్లపూడిలో రూ.12.58 కోట్లతో చేపట్టనున్న 76 అభివృద్ధి పనులు, మండలంలో రూ.8కోట్ల సీఎస్సార్, ఇతర నిధులతో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.

25 నుంచి 30 ఏళ్లపాటు వైఎస్‌ జగనే సీఎంగా రాష్ట్రాన్ని పాలిస్తారన్నారు. పల్లెల్లో మౌలిక సదుపాయాలు లేక పట్టణాలకు వలస వెళ్లాలనే భావన పెరుగుతోందన్నారు. ఈ నేపథ్యంలోనే కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌పై సీఎం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారన్నారు.  రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని ప్రతీ గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి పి.అనిల్‌కుమార్‌యాదవ్, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, తిరుపతి పార్లమెంటు సభ్యుడు బల్లి దుర్గాప్రసాదరావు, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, కలెక్టర్‌ శేషగిరిబాబు తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు