నేడు అంబాజీపేటకు జగన్‌ రాక

17 Mar, 2019 10:16 IST|Sakshi

అంబాజీపేటలో ఎన్నికల ప్రచారం

బ్రహ్మరథం పట్టేందుకు పార్టీ శ్రేణుల ఎదురుచూపులు

పూర్తయిన ఏర్పాట్లు

సాక్షి, అంబాజీపేట (పి.గన్నవరం): వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోనసీమలోని అంబాజీపేటకు విచ్చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ఇక్కడి నుంచే ప్రారంభించనున్నారు. గతంలో సుదీర్ఘంగా నిర్వహించిన ప్రజాసంకల్ప పాదయాత్ర నిర్వహించిన ఆయన.. పి.గన్నవరం నియోజకవర్గ పరిధిలోని అంబాజీపేటలో రోడ్‌షో నిర్వహించనున్నారు. దీంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు నూతనోత్సాహంతో ఉన్నారు. తాను అధికారంలోకి వస్తే వివిధ వర్గాల వారికి అమలు చేయబోయే పథకాలను ‘నవరత్నాలు’ పేరుతో ఆయన ప్రకటించారు.

ఈ నేపథ్యంలో ఆయా వర్గాల ప్రజలు జగన్‌కు అడుగడుగునా నీరాజనాలు పట్టేందుకు సిద్ధమవుతున్నారు. తమ అభిమాన నేత జగన్‌ను చూసేందుకు అన్ని వర్గాల ప్రజలూ స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జిల్లాకు సంబంధించి కోనసీమలో ప్రచారం ఆరంభిస్తే ఆ పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందన్న సెంటిమెంట్‌ ఉంది. ఈ నేపథ్యంలో అంబాజీపేటలో రోడ్‌ షో నిర్వహించడం ద్వారా ఈ సెంటిమెంట్‌ తప్పనిసరిగా నెరవేరుతుందని పలువురు నాయకులు, అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. వైఎస్సార్‌ సీపీ పి.గన్నవరం నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ కొండేటి చిట్టిబాబు, రాష్ట్ర కార్యదర్శి మిండగుదిటి మోహన్‌తో పాటు పలువురు నాయకులు ఇప్పటికే రోడ్‌షో ఏర్పాట్లు పూర్తి చేశారు.


జగన్‌ టూర్‌ సాగనుందిలా..
వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 1.30 గంటలకు భోగాపురం నుంచి బయలుదేరి 2.30 గంటలకు పి.గన్నవరం మండలం పోతవరం వస్తారు. అక్కడి నుంచి రోడ్‌షోగా అంబాజీపేట సెంటర్‌కు చేరుకుంటారు. అక్కడ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం సాయంత్రం 4.10 గంటలకు రాజమహేంద్రవరం విమానాశ్రయానికి వెళ్తారని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రోగ్రాం కో ఆర్డినేటర్‌ తలశిల రఘురాం, ఎమ్మెల్సీ, అమలాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ తెలిపారు.


విజయవంతం చేయాలి
జగన్‌ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తలశిల రఘురాం, పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జగన్‌ వచ్చే రహదారిని, రోడ్‌షో నిర్వహించే ప్రాంతాన్ని వారు పరిశీలించారు. జనసమీకరణపై నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ కొండేటి చిట్టిబాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి మిండగుదిటి మోహన్, నాయకులు మంతెన రవిరాజు, పి.కె.రావు, చెల్లుబోయిన శ్రీనివాసరావు, కుడుపూడి బాబులకు పలు సూచనలు చేశారు. పార్టీ మండల శాఖ అధ్యక్ష, కార్యదర్శులు వాసంశెట్టి చినబాబు, నాగవరపు నాగరాజు, నాయకులు దొమ్మేటి వెంకటేశ్వరరావు, కోట సత్తిబాబు, దొమ్మేటి సత్యమోహన్, మైపాల నానాజీ, మట్టపర్తి వెంకటేశ్వరరావు, దొమ్మేటి రాము తదితరులు వారి వెంట ఉన్నారు.


హెలిప్యాడ్‌ పరిశీలన
పి.గన్నవరం: జగన్‌ రాక సందర్భంగా పి.గన్నవరం శివారు పోతవరంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ను వైఎస్సార్‌ సీపీ అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ చింతా అనురాధ, కొండేటి చిట్టిబాబు, తలశిల రఘురామ్, పిల్లి సుభాష్‌చంద్రబో‹స్, మిండగుదిటి మోహనరావు, జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు మంతెన రవిరాజు, రాజానగరం అబ్జర్వర్‌ కుడుపూడి బాబు, నక్కా వెంకటేశ్వరరావు తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా అనురాధ మాట్లాడుతూ, జగన్‌ ఎన్నికల ప్రచార సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. నాయకులు మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో జగన్‌ అధికారం చేపడతారని అన్నారు. హెలీప్యాడ్‌ను అమలాపురం డీఎస్పీ రమణ, రావులపాలెం, అమలాపురం సీఐలు బి.పెద్దిరాజు, జి.సురేష్‌ బాబు, ఎస్సైలు ఎస్‌.రాము, కేవీ నాగార్జున తదితరులు పరిశీలించారు.


 

మరిన్ని వార్తలు