వామపక్ష నేతల అరెస్టును ఖండించిన వైఎస్‌ జగన్‌

11 Oct, 2017 19:01 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : వంశధార ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలపై ఉద్యమిస్తున్న వామపక్ష నేతలను అరెస్టు చేయడాన్ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఛలో వంశధార కార్యక్రమంలో పాల్గొంటున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రీకాకుళం జిల్లా నేత ధర్మాన కృష్ణదాస్‌ను గృహ నిర్బంధంలో ఉంచడాన్ని, మళ్లీ ఈ రోజు వెంటాడినట్లుగా వామపక్ష నేతలను మరోసారి అరెస్టు చేయడాన్ని వైఎస్‌ జగన్‌ బుధవారం ఒక ప్రకటనలో ఖండించారు.

కాంట్రాక్టర్ల నుంచి కమీషన్ల రూపంలో ఎంత దండుకోవాలన్నదే ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ విధానంగా మారింది తప్ప, నిర్వాసితులకు ఎంత ఇవ్వాలన్నది ఈ ప్రభుత్వం తలకెక్కడం లేదని జగన్‌ పేర్కొన్నారు. సీపీఎం నేత పి.మధును, సీపీఐ నేత కె.రామకృష్ణతో సహా వామపక్ష నేతలను కూడా ఈ ప్రభుత్వం అరెస్టులు చేసి బెదిరింపులకు గురి చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపారు. వంశధారకు సంబంధించిన నిర్వాసితులకు న్యాయం జరిగేలా అన్ని చర్యలూ తీసుకోవాల్సిందేనని జగన్‌ ఉద్ఘాటించారు. లేని పక్షంలో ప్రజాగ్రహానికి గురికాక తప్పదని ఆయన హెచ్చరించారు. వంశధార నిర్వాసితులకు తప్పనిసరిగా న్యాయం చేస్తామని గతంలోనే తాము మాట ఇచ్చామని ఈ ప్రభుత్వం ముందుకు కదలని పక్షంలో అధికారంలోకి రాగానే వారంతా సంతోషించేలా న్యాయం చేస్తామని జగన్‌ తన ప్రకటనలో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు