కాలువల ఆధునికీకరణపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష

19 Feb, 2020 21:01 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: కాలుష్యంతో నిండిన కాలువలను కాలుష్య రహితంగా తీర్చిదిద్ది ఆధునీకరించడమే ప్రధాన ఉద్దేశమని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. సాగుకు, తాగుకు స్వచ్ఛమైన నీటిని అందించడంతో పాటు కృష్ణా, గోదావరి నదులపై ఉన్న అన్ని నగర, గ్రామీణ ప్రాంతాల్లోని కాలువలను శుద్ధిచేయడమే తమ లక్ష్యమని తెలిపారు. కాలువలు, కాలువగట్లు ఇకపై ప్రజలకు ఉపయోగపడే వాకింగ్‌ ట్రాక్‌లుగా, పార్క్‌లుగా మార్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని సీఎం  వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. మిషన్‌ ఫర్‌ క్లీన్‌ కృష్ణా అండ్‌ గోదావరి కెనాల్స్‌పై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో బుధవారం సమీక్ష నిర్వహించారు. దీనికి సంబంధించిన వైబ్‌సైట్‌ను ఆయన ప్రారంభించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. కెనాల్స్‌ పొల్యూషన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. గోదావరి డెల్టా పరిధిలో 10 వేల కిలో మీటర్ల కాలువలు, కృష్ణా డెల్టా పరిధిలో 9,800 కాలువలు ఉన్నాయని అధికారులు సీఎం జగన్‌కు తెలియజేశారు. ముందుగా 1344 కిలోమీటర్లు, 36 మేజర్‌ కెనాల్స్‌లో పనులు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కెనాల్స్‌ బ్యూటిఫికేషన్‌ విషయంలో లైనింగ్‌ లేనిచోట గ్రీనింగ్‌ చేయాలని.. కాలువ కట్టలపై సిమెంట్, కాంక్రీట్‌ వినియోగించకుండా పాత్‌వేలు రాళ్లతో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. అన్ని మున్సిపాలిటీలు కవర్‌ అయ్యేలా చర్యలుండాని సీఎం జగన్‌ ఆదేశించారు.

టాస్క్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేసి ఇరిగేషన్, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు, పంచాయితీ రాజ్, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్, ఎన్‌జీవోలను భాగస్వాములు చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపడతామన్నారు. ఒక్కో కాలువలో ఎంత మురికినీరు కలుస్తుంది, దాన్ని నివారించేందుకు ఎంత ఖర్చవుతుంది, ఎస్టీపీల నిర్మాణం, మెయింటెనెన్స్‌ వివరాలను సీఎం జగన్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఔట్‌లెట్‌ పాయింట్‌ వద్ద అకౌంటబిలిటీ ఉండాలని అందుకవసరమైన చర్యలు ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారును ఆయన ఆదేశించారు. 

ప్రత్యామ్నాయ స్ధలాలు కేటాయించాలి
విజయవాడ, విశాఖలో ముందుగా కాల్వల ఆధునికీకరణ పనులు చేయాలని సీఎం ఆదేశించారు. 18 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో ఈ కార్యక్రమం చేపట్టాలన్నారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు నాలుగు జిల్లాల్లో కాలువలు ఏర్పాటు చేయాలన్నారు. పులివెందులను కూడా కార్యక్రమంలో చేర్చాలని సీఎం జగన్‌ పేర్కొన్నారు. ముందు కాలువ కట్టలపై ఉంటున్న వారికి ప్రత్యామ్నాయ స్ధలాలు కేటాయించి వారే ముందు ఇళ్లు కట్టుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. వాళ్లు ఇళ్లు కట్టుకోగానే అక్కడి నుంచి తరలించాలని సీఎం తెలిపారు.

తాడేపల్లి మున్సిపాలిటిలో ముందుగా పనులు ప్రారంభించాలని సీఎం జగన్‌ తెలిపారు. ఇళ్లు తరలించేటప్పుడు మానవత్వంతో వ్యవహరించాలని, ఎక్కడా వారిని ఇబ్బంది పెట్టకూడదని అన్నారు. వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన తర్వాతే తరలించాలన్నారు. ఒక్కసారి పూర్తి చేసిన తర్వాత మళ్లీ ఎవరూ ఆక్రమించుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. కృష్ణా జిల్లాలో రైవస్‌ కెనాల్, గుంటూరు జిల్లాలో కృష్ణా వెస్ట్రన్‌ కెనాల్, పశ్చిమగోదావరి జిల్లాలో ఏలూరు కెనాల్, తూర్పుగోదావరి జిల్లాలో జీఈ మెయిన్‌ కెనాల్, పులివెందుల, విశాఖపట్నం పైలెట్‌ ప్రాజెక్ట్‌లుగా చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులకు తెలిపారు. నాడు నేడు కార్యక్రమం తరహాలో చేయాలన్నారు.

దాతల పేర్లతో ఏర్పాటు
ప్రజలకు తెలిసేలా ఫోటోలు తీసి ఇప్పుడున్న పరిస్ధితి, భవిష్యత్‌లో ఏలా తీర్చిదిద్దుతామో చూపాలని సీఎం జగన్‌ తెలిపారు. కాలువలపై ఏర్పాటు చేసే పార్క్‌లకు, వాకింగ్‌ ట్రాక్‌ల నిర్మాణానికి ముందుకొచ్చే దాతల పేర్లతో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన సూచించారు. మిషన్‌కు అవసరమైన సహాయ సహకారాలను ముఖ్యమంత్రి కార్యాలయ అధికారి నిరంతరం పర్యవేక్షిస్తారని ఆయన తెలిపారు. సాలిడ్‌వేస్ట్‌ కలెక్షన్, డిస్పోజల్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన ఆదేశించారు. ప్లాస్టిక్‌ కవర్ల వినియోగంపై ఇందుకు అవసరమైన యాక్షన్‌ ప్లాన్‌తో రావాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశానికి మిషన్‌ ఫర్‌ క్లీన్‌ కృష్ణా అండ్‌ గోదావరి కెనాల్స్‌  డైరెక్టర్‌ కాటమనేని భాస్కర్, ఆర్దిక, జలవనరులశాఖ, మున్సిపల్‌శాఖ, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు