అడుగడుగునా ఆవేదన

17 Nov, 2017 06:12 IST|Sakshi

సీపీఎస్‌ ఉద్యోగి మరణంపై ద్రవించిన జగన్‌ హృదయం

కేసీ కెనాల్‌కు నీళ్లు రావడం లేదని రైతుల ఆక్రందన

జననేతను చూసేందుకు భారీగా తరలివచ్చిన కూలీలు

ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ముగిసిన పాదయాత్ర

మూడు రోజులు... 44.1 కిలోమీటర్లు

పోషణ భారం కావడంతో ముగ్గురు కుమార్తెలను అనాథఆశ్రమంలో వదిలేశానని చింతకుంటకు చెందిన లీలావతి..తన కుమారుడికి వైద్యం చేయించలేకపోతున్నానని శిలువక్క..ఇల్లు లేక అవస్థలు పడుతున్నామని రాజమ్మ..‘ఉపాధి’ పనులు లేవంటూ దస్తగిరమ్మ, పక్కీరమ్మ..ఆరోగ్యశ్రీ అమలు కావడం లేదంటూ ఓబులేష్, రాణెమ్మ..ఇలా ఒక్కొక్కరిదీ ఒక్కో వ్యథ..గురువారం ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టినప్రజా సంకల్ప యాత్రలో అడుగడుగునా ఆవేదనలే..సంక్షేమ పథకాలు అందక..సమస్యలు పరిష్కారం కాక.. సామాన్యుడి ఆక్రందనలు పల్లె పల్లెనా వినిపించాయి.

సాక్షి ప్రతినిధి, కర్నూలు:   పీఈటీగా ఉన్న టీచర్‌ సురేష్‌... పట్టుమని ఆరు నెలలు కాలేదు ఉద్యోగంలో చేరి. అంతలోనే మరణించాడు. ఆయనపై ఆధారపడిన కుటుంబానికి పెన్షన్‌ లేదు. రోడ్డునపడ్డ ఆ కుటుంబీకులు ఆయన ఫొటో పట్టుకుని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని కలిశారు. కాంట్రీబ్యూటరీ పెన్షన్‌ విధానం(సీపీఎస్‌) వల్ల తమ కుటుంబానికి పెన్షన్‌ రాలేదని, తామెలా బతకాలని ఆయన వద్ద విలపించారు. వారి పరిస్థితిని చూసి జగన్‌ చలించిపోయారు. ఈ కుటుంబానికి దిక్కేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులకు తాము అండగా ఉంటామని, సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేస్తామని భరోసానిచ్చారు. ఉద్యోగులు తమ కుటుంబ సభ్యుల్లాంటి వారని, వారికి ఇబ్బందులు రాకుండా చూస్తామని ధైర్యం చెప్పారు.

కర్నూలు జిల్లాలో వైఎస్‌ జగన్‌ ప్రజా సంకల్ప పాదయాత్ర మూడోరోజు గురువారం ఆళ్లగడ్డ పట్టణం నుంచి ఉదయం 8.30 గంటలకు ప్రారంభమైంది. అనంతరం పెద్ద చింతకుంట, భాగ్యనగరం, రామచంద్రాపురం క్రాస్‌రోడ్, కొండాపురం మీదుగా దొర్నిపాడు వరకూ సాగింది. సాయంత్రం 5.20 గంటలకు 13.2 కిలోమీటర్లు పూర్తయ్యాయి. ఇప్పటివరకు మూడు రోజులుగా కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ నియోజకవర్గంలో మొత్తం 44.1 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది. తిరిగి శనివారం ఉదయం దొర్నిపాడు నుంచి ప్రారంభమై బనగానపల్లె నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది.

భరోసానిస్తూ..
జగన్‌ పాదయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి వివిధ వర్గాల ప్రజలు ఆయనను కలుసుకుని తమ బాధలు పంచుకున్నారు. సీపీఎస్‌ ఉద్యోగి కుటుంబం తమ ఆవేదనను తెలపగా, ఆ తర్వాత రిజర్వేషన్లు కల్పించాలని ముస్లింలు, పంటలకు గిట్టుబాటు ధర లభించలేదని రైతులు విన్నవించారు. అదేవిధంగా కేసీ కెనాల్‌ కింద వరి పంట వేసుకునే పరిస్థితి లేదని, రోజురోజుకూ ఆయకట్టు తగ్గిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత నేత రాజశేఖర్‌రెడ్డి హయాంలో ప్రతియేటా రెండుకార్ల పంటలకూ నీళ్లు ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. తిరిగి జగన్‌ ముఖ్యమంత్రి అయితేనే కేసీ కెనాల్‌ ఆయకట్టుకు నీరొస్తుందని, రైతుల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తుందని అభిప్రాయపడ్డారు. ఇక సీడు పత్తి తీసేందుకు వచ్చిన కూలీలు తమ పనులను నిలిపి వచ్చి మరీ జగన్‌ను కలిశారు. అవసరమైతే సాయంత్రం ఎక్కువసేపు పని చేస్తామని యజమానులకు చెప్పారు. అదేవిధంగా దారి పొడుగునా అనేక మంది వృద్ధులు తమకు పింఛన్‌ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మీ పెద్ద కొడుకుగా వచ్చి అందరి సమస్యలు తీరుస్తానని జగన్‌ భరోసానిచ్చారు.

సంఘీభావం
మూడో రోజు పాదయాత్రలో నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణి రెడ్డి, కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే గౌరు చరిత, మాజీ మంత్రి శిల్పా మోహన్‌ రెడ్డి, జిల్లా మాజీ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, పార్టీ నేతలు శిల్పా రవిచంద్ర కిషోర్‌ రెడ్డి, రాష్ట్ర మార్క్‌ఫెడ్‌ ఉపాధ్యక్షుడు పీపీ నాగిరెడ్డి, సీఈసీ సభ్యుడు రాజగోపాల్‌ రెడ్డి, నంద్యాల మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ దేశం సులోచన, ఎర్రబోతుల వెంకటరెడ్డి, హబీబుల్లా, వంగాల భరత్‌కుమార్‌రెడ్డి, గుండం సూర్యప్రకాష్‌ రెడ్డి, రాజగోçపాల్‌రెడ్డి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. 

స్వచ్ఛందంగా..
జిల్లాలో సాగుతున్న మూడోరోజు పాదయాత్రలో అధిక భాగం భూమా కుటుంబం సొంత మండలమైన దొర్నిపాడులో సాగింది. అయినప్పటికీ జనం స్వచ్ఛందంగా తరలివచ్చి పాదయాత్రకు మద్దతు పలికారు.

మరిన్ని వార్తలు