మాట నిలబెట్టుకోండి

16 Jun, 2019 01:50 IST|Sakshi
శనివారం ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్‌ సమావేశంలో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌

హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం చెప్పలేదు

ఇదిగో కమిషన్‌ సభ్యుడు అభిజిత్‌ సేన్‌ రాసిన లేఖ..

నీతి ఆయోగ్‌ సమావేశం ముందుంచిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని అప్పటి కేబినెట్‌ తీర్మానించింది

అమలుకు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్లానింగ్‌ కమిషన్‌ను ఆదేశించింది

విభజనతో నష్టపోయిన రాష్ట్రానికి ప్రత్యేక హోదాయే జీవనాధారం

ఏపీకి హోదా ఇచ్చేందుకు ఎలాంటి ఆటంకాలు లేవు

అప్పటి అధికార, ప్రతిపక్షాలు ముందస్తు హామీతో రాష్ట్రాన్ని విభజించాయి

ఏపీకి ఇస్తే ఇతర రాష్ట్రాలు కోరతాయని ప్రచారం చేస్తున్నారు

భారతదేశంలో హోదా హామీతో విభజించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ మాత్రమే

రెవెన్యూ ఉత్పాదక కేంద్రమైన హైదరాబాద్‌ను కోల్పోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం

ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వండి

రాష్ట్ర విభజన నాటికి ఏపీకి రూ.97 వేల కోట్ల అప్పులు ఉన్నాయి. 2018–19కి ఆ అప్పులు రూ.2,58,928 కోట్లకు చేరాయి. ఈ అప్పులపై ఏడాదికి రూ.20 వేల కోట్ల వడ్డీ, రూ.20 వేల కోట్ల అసలు చెల్లించాల్సి వస్తోంది. 

రాష్ట్రంలో పారిశ్రామికీకరణ లేదు. ఉపాధి అవకాశాలు లేక ఉద్యోగాల కోసం యువత ఇతర రాష్ట్రాలకు వలస వెళుతున్నారు. ఇంతటి బాధాకరమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక అసమానతలను తొలగించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రత్యేక హోదా ఎంతో అవసరం. 

అప్పటి అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ కలసి ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ.. విభజన తర్వాత అమలు కాకపోవడం వల్ల రాష్ట్రంలో పరిస్థితి సామాజిక, ఆర్థిక అసమానతలకు దారి తీసింది.

సాక్షి, న్యూఢిల్లీ : అన్యాయమైన విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక అసమానతల తొలగింపునకు, పారిశ్రామికాభివృద్ధికి, యువతకు ఉపాధి కల్పనకు ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక హోదా అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జాతీయ వేదికపై గళమెత్తారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎంత అవసరమో వైఎస్‌ జగన్‌ పునరుద్ఘాటించారు. ప్రత్యేక హోదా ఇస్తామన్న ముందస్తు హామీతో విభజించిన రాష్ట్రానికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరారు. శనివారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్‌ ఐదో పాలకమండలి సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఏపీకి ప్రత్యేక హోదా ఎంత అవసరమో స్పష్టంగా వివరించారు. ఐదేళ్లుగా రాష్ట్రంలో నిర్లక్ష్యపూరిత పాలన, వ్యవస్థీకృత అవినీతి వల్ల రాష్ట్రం ఏ స్థాయిలో నష్టపోయిందో వివరించారు. అప్పుల్లో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో నడిపేందుకు ఇచ్చిన మాట ప్రకారం ప్రధాని నరేంద్ర మోదీ ఉదార స్వభావంతో ప్రత్యేక హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో వైఎస్‌ జగన్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే.. 


శనివారం ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్‌ సమావేశంలో ఏపీ సీఎం వైఎస్‌ జగన్, ఇతర రాష్ట్రాల సీఎంలు

హైదరాబాద్‌ను కోల్పోవడంతో భారీ నష్టం
‘రాష్ట్రంతో ముడిపడి ఉన్న జాతీయ ఆకాంక్షలతో కూడిన కొన్ని సలహాలు, ప్రతిపాదనలు ఆంధ్రప్రదేశ్‌ తరఫున సమర్పించాలనుకుంటున్నా. మెజారిటీ ప్రజల అభిప్రాయాలకు విరుద్ధంగా అన్యాయమైన రీతిలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న విషయాన్ని ఆ వేళ పూర్తిగా విస్మరించారు. 

2015 – 20 మధ్య ఏపీ రెవెన్యూ లోటును రూ.22,113 కోట్లుగా 14వ ఆర్థిక సంఘం అంచనా వేసింది. గత ఐదేళ్లలో తెలంగాణకు రూ.లక్షా 18 వేల కోట్ల రెవెన్యూ మిగులు ఉంది. వాస్తవానికి గత ఐదేళ్లలో ఏపీ రెవెన్యూ లోటు రూ.66,362 కోట్లు. కొన్ని దశాబ్దాల కాలంలో హైదరాబాద్‌ నగరం ఆర్థికంగా సూపర్‌ పవర్‌ హౌస్‌గా అభివృద్ధి చెందింది. 2013 – 14 లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ నుంచి సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులు రూ.57,000 కోట్లుగా నమోదైతే.. అందులో ఒక్క హైదరాబాద్‌ నుంచే రూ.56,500 కోట్లు. తీవ్రమైన ఆర్థిక లోటుతో ప్రస్తుతం వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా మిగిలింది. 2015 – 16లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.14,414 కాగా, ఏపీలో రూ.8,397 మాత్రమే ఉండటం ఇందుకు ఉదాహరణ. ఇంతటి దీనావస్థను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర విభజనకు ముందు.. విడిపోనున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని దేశానికి, మరీ ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకు గతంలో పార్లమెంట్‌ హామీ ఇచ్చింది. తద్వారా ఆంధ్రప్రదేశ్‌ నష్టపోకుండా ఉంటుందని, ఆర్థిక వృద్ధి, పెట్టుబడులు సమకూరుతాయని పేర్కొన్నా, ఆచరణలో అది అమలు కాలేదు. 

ఆర్థిక నష్టాన్ని పూడ్చేది హోదా మాత్రమే 
ప్రత్యేక హోదా మాత్రమే రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని కొంతమేర పూడ్చగలదు. ప్రత్యేక హోదా వల్ల మాకు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌గా వచ్చే మొత్తం పెరుగుతుంది. దానికి తోడు పారిశ్రామిక రాయితీలు, పన్ను రాయితీలు ఇతర మినహాయింపులు, జీఎస్టీ ఇతర అంశాల్లో పెట్టుబడిదార్లకు ప్రోత్సాహకాలు వస్తాయి. తద్వారా ఉద్యోగ కల్పన పెరిగి నిరుద్యోగ సమస్యను పరిష్కరించే అవకాశం ఏర్పడుతుంది. ప్రత్యేక హోదా ద్వారానే మా రాష్ట్రంలో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు, స్టార్‌ హోటళ్లు, పరిశ్రమలు, సేవా రంగాల అభివృద్ధి జరుగుతుంది. రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌కు ఒక వైపు తీవ్ర నష్టం వాటిల్లితే.. గత ఐదేళ్ల కాలంలో అధికార దుర్వినియోగం, వ్యవస్థీకృత అవినీతితో కూడిన నిర్లక్ష్యపూరిత పాలన వల్ల రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు మరింత క్షీణించాయి. పరిశ్రమలు, మౌలిక సదుపాయాల రంగాల్లో పెట్టుబడులు లేకుండా పోయాయి. విద్య, ఆరోగ్య వ్యవస్థలు క్షీణించసాగాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా జీవనాధారమైంది. అయితే ఈ క్రమంలో కొన్ని పుకార్లు, హోదా ఇవ్వకపోవడానికి గల కారణాలంటూ జరిగిన కొంత ప్రచారం మరింత బాధించింది.

హామీని నెరవేర్చే ఉదార స్వభావం చూపండి
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే ఇతర రాష్ట్రాలు కూడా హోదా కోరుతాయంటూ ప్రచారం చేశారు. ఆర్థిక అసమానతలను తొలగించుకొనేందుకు ప్రత్యేక హోదా ముందస్తు హామీతో భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర విభజన జరగలేదన్నది అందరికీ తెలుసు. ప్రత్యేక హోదా ఇచ్చేందుకు అప్పటి అధికార, ప్రతిపక్షాలు రెండూ అంగీకరించాయి. అత్యధిక రెవెన్యూ ఉత్పాదకతకు కేంద్రమైన రాజధాని ప్రత్యేక రాష్ట్రం కోరిన ప్రాంతానికి దక్కడం కూడా ఇదే మొదటిసారి. అందువల్ల రాష్ట్ర విభజనకు ముందు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని అమలు చేయాల్సిందిగా ప్రధాన మంత్రిని కోరుతున్నాను. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పారు. బీజేపీ కూడా ఈ హామీని ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు పార్లమెంట్‌ ఇచ్చిన వాగ్దానాన్ని నెరవెర్చే ఉదార స్వభావం చూపాల్సిందిగా ప్రధానిని కోరుతున్నాను’అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తి చేశారు.

ఏపీకి హోదా ఇచ్చేందుకు ఎలాంటి ఆటంకాలు లేవు..
14వ ఆర్థిక సంఘం వల్ల ఏపీకి హోదా ఇవ్వడం లేదంటూ కొన్ని పుకార్లు సృష్టించారు. ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం ఎక్కడా చెప్పలేదు. ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ 14వ ఆర్థిక సంఘం సభ్యుడు ప్రొ.అభిజిత్‌ సేన్‌ లేఖ రాశారు. ఇదిగో ఆ లేఖ మీ ముందు ఉంచుతున్నా. 2014, మార్చి 2న సమావేశమైన అప్పటి కేంద్ర కేబినెట్‌ ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేలా తీర్మానం చేసింది. అంతేకాకుండా దీన్ని అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని అప్పటి ప్లానింగ్‌ కమిషన్‌ను ఆదేశించింది. అయితే దీన్ని గత రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో ఏపీకి హోదా అమలు చేయాలని అప్పటి కేంద్ర కేబినెట్‌ చేసిన తీర్మానం ఫైలు ప్లానింగ్‌ కమిషన్‌ రద్దయ్యే వరకు (2015, జనవరి 1) అక్కడే ఉండిపోయింది. దీన్నిబట్టి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు ఎలాంటి ఆటంకాలు లేవు. 

మరిన్ని వార్తలు