వడివడిగా వెలిగొండ!

20 Nov, 2019 04:45 IST|Sakshi

జూన్‌ నాటికి తొలిదశ పూర్తి చేయాలని నిర్దేశించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

మొదటి సొరంగంలో మిగిలిపోయిన 1.34 కి.మీ. పనుల పూర్తికి చర్యలు

నల్లమలసాగర్‌ నిర్వాసితులకు గండికోట, పోలవరం తరహాలో పునరావాసం

రెండోదశ పనులను 2021 నాటికి పూర్తి చేసేలా ప్రణాళిక

ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్‌ జిల్లాలు సస్యశ్యామలం

ప్రాజెక్ట్‌ పూర్తి చేసేందుకు అవసరమైన మొత్తం రూ.3,480.16 కోట్లు 

సాక్షి, అమరావతి: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ పనులను వచ్చే జూన్‌ నాటికి పూర్తి చేసి దుర్భిక్ష ప్రాంతాలను సస్యశ్యామలం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వెలిగొండ మొదటి సొరంగంలో మిగిలిపోయిన 1.34 కి.మీ. పనులను శరవేగంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టింది. సొరంగ మార్గంలో కఠిన శిలలు (అబ్రాసివ్‌ రాక్‌) ఉండటంతో రోజుకు తొమ్మిది మీటర్లకు బదులుగా సగటున ఐదు నుంచి ఆరు మీటర్లు తవ్వుతున్నారు. టన్నెల్‌ బోరింగ్‌ మెషీన్‌ (టీబీఎం)కు కొత్త బుష్‌లు, కన్వేయర్‌ బెల్ట్‌లు అమర్చడం ద్వారా సొరంగం తవ్వకం పనులను వేగవంతం చేసి మే నాటికి పూర్తి చేయాలని జలవనరుల శాఖను ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. సొరంగం ద్వారా తరలించే నీటిని నల్లమల సాగర్‌లో నిల్వ చేయాలంటే 11 ముంపు గ్రామాలకు చెందిన 4,617 కుటుంబాలకు పునరావాసం కల్పించాలి. ఈ నేపథ్యంలో మే లోగా పునరావాస పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వచ్చే సీజన్‌లో కృష్ణా వరద ప్రవాహం శ్రీశైలం ప్రాజెక్టులో 840 అడుగులకు చేరుకోగానే మొదటి సొరంగం ద్వారా రోజుకు 85 క్యూమెక్కులు(3001.35 క్యూసెక్కులు) చొప్పున తరలించి నల్లమలసాగర్‌లో నిల్వ చేసి ఆయకట్టుకు నీళ్లందించాలని నిర్ణయించింది. 

వైఎస్సార్‌ హయాంలో సింహభాగం పనులు పూర్తి
శ్రీశైలానికి వరద వచ్చే 45 రోజుల్లో రోజుకు 11,581.68 క్యూసెక్కుల చొప్పున 43.50 టీఎంసీలను తరలించి ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్‌ జిల్లాల్లో 4.47 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడంతోపాటు 14,800 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించి 15.25 లక్షల మంది దాహార్తి తీర్చే వెలిగొండ ప్రాజెక్టును దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2004లో చేపట్టారు. 2009 నాటికే సింహభాగం పనులను పూర్తి చేశారు. అప్పటి నుంచి రెండు సొరంగాల్లో మిగిలిన పనులు, పునరావాసం, 2884.13 ఎకరాల భూసేకరణ చేయకపోవడంతో ప్రాజెక్టు పూర్తి కాలేదు.

ప్రాధాన్య ప్రాజెక్టుల్లో చోటు
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించగానే వెలిగొండ ప్రాజెక్టును ప్రాధాన్య ప్రాజెక్టుగా ప్రకటించారు. శ్రీశైలం నుంచి వెలిగొండకు నీటిని తరలించేందుకు 85 క్యూమెక్కుల సామర్థ్యంతో మొదటి సొరంగాన్ని, 243 క్యూమెక్కుల సామర్థ్యంతో రెండో సొరంగం పనులను చేపట్టారు. మొదటి సొరంగం పనులను జూన్‌నాటికి పూర్తి చేస్తామని ప్రకటించారు. రెండో సొరంగం పనులను రివర్స్‌ టెండర్ల ద్వారా తక్కువ ధరకే కొత్త కాంట్రాక్టర్‌కు అప్పగించి రూ.61.76 కోట్లను ఖజానాకు మిగిల్చారు. రెండో సొరంగంలో మిగిలిన 7.575 కి.మీ. పనులను 2021 నాటికి పూర్తి చేయాలని నిర్దేశించారు. 

మరో రూ.3,480.16 కోట్లు అవసరం
– వెలిగొండ పనులకు ఇప్పటివరకు రూ.5,107 కోట్లు ఖర్చు చేశారు. 
– ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ఇంకా రూ.3,480.16 కోట్లు అవసరమని జలవనరుల శాఖ అధికారులు నివేదిక ఇచ్చారు. ఇందులో తొలి దశ పనుల పూర్తికి అవసరమైన రూ.1,600 కోట్లను విడుదల చేయాలని ఆర్థిక శాఖకు ముఖ్యమంత్రి సూచించారు. 
– రెండో దశ పనుల కోసం రూ.1,880.16 కోట్లను 2020–21, 2021–22 బడ్జెట్‌లలో కేటాయించి ప్రాజెక్టు పూర్తి చేయాలని నిర్ణయించారు.
– మొదటి సొరంగం పనులు వేగంగా జరుగుతుండగా, రెండో సొరంగం పనులను తక్షణమే ప్రారంభించాలని కొత్త కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. 
– హెడ్‌ రెగ్యులేటర్‌తోపాటు నల్లమలసాగర్‌లో మిగిలిన పనులు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. 
– నల్లమలసాగర్‌లో 11 గ్రామాల ప్రజలకు పునరావాస పనులను ప్రకాశం  కలెక్టర్‌ పోలా భాస్కర్‌ పర్యవేక్షిస్తున్నారు. 
– ఇప్పటికే పునరావాస కాలనీల్లో మౌలిక సదుపాయాల పనులకు టెండర్లు నిర్వహించి కాంట్రాక్టర్లకు అప్పగించారు. 
– గండికోట, పోలవరం ప్రాజెక్టుల తరహాలో నల్లమలసాగర్‌ నిర్వాసితులకు సహాయ, పునరావాస ప్యాకేజీ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

మరిన్ని వార్తలు