కృష్ణా డెల్టాకు గోదావరి జలాలు

23 Oct, 2019 03:33 IST|Sakshi

అప్పుడే తాగు, సాగు నీటి కొరత తీరుతుంది 

ఈ ప్రాజెక్టును కేంద్రం చేపట్టాలి 

కేంద్ర హోం మంత్రిని కోరిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌  

కేంద్రం దృష్టికి పలు అంశాలు, సమస్యలు 

ప్రత్యేక హోదాతోనే కీలక సమస్యల పరిష్కారం 

పోలవరం ప్రాజెక్టుకు త్వరితగతిన నిధులివ్వాలి 

విభజన హామీలన్నీ నెరవేర్చాలి 

వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు పెంచాలి

ఏపీ అభివృద్ధికి సహకరిస్తామన్న అమిత్‌షా 

సాక్షి, న్యూఢిల్లీ:  నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు గోదావరి వరద జలాలను తరలించి కృష్ణా డెల్టాలో తాగు, సాగు నీటి కొరత తీర్చే ప్రాజెక్టును చేపట్టాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కోరారు. మంగళవారం కేంద్ర హోం మంత్రి నివాసంలో దాదాపు 45 నిమిషాల పాటు  వైఎస్‌ జగన్‌ ఆయనతో సమావేశమయ్యారు. ఇదే రోజు అమిత్‌ షా పుట్టిన రోజు కావడంతో కేంద్ర మంత్రులు, ఎంపీలు, పార్టీ నేతలు, సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉన్నప్పటికీ వీరిద్దరి మధ్య సుదీర్ఘంగా చర్చ జరగడం విశేషం. రాజకీయాలకు అతీతంగా ఏపీ సమస్యలపై సానుకూల చర్చ జరిగిందని అధికార వర్గాలు తెలిపాయి.  

కృష్ణాలో తగ్గిన నీటి లభ్యత 
గోదావరి జలాల తరలింపు అంశం గురించి అమిత్‌ షాతో వైఎస్‌ జగన్‌ కీలకంగా చర్చించారు. కృష్ణానదిలో గత 52 ఏళ్లలో నీటి లభ్యత సగటున ఏడాదికి 1,230 టీఎంసీల నుంచి 456 టీఎంసీలకు పడిపోయిందని వివరించారు. మరోవైపు గోదావరిలో గత 30 ఏళ్లుగా సగటున ఏడాదికి 2,780 టీఎంసీల జలాలు సముద్రంలోకి పోతున్నాయని చెప్పారు. ఈ దృష్ట్యా కృష్ణా జలాలపై ఆధారపడ్డ రాయలసీమ, కృష్ణా డెల్టాల్లో తాగు, సాగునీటి కొరత ఉన్న ప్రాంతాలకు ఉపయోగపడేలా గోదావరి వరద జలాలను నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు తరలించే ప్రాజెక్టును చేపట్టాల్సిందిగా సంబంధిత శాఖలకు సూచించాలని ముఖ్యమంత్రి కోరారు. దీంతో రాష్ట్రంలో సాగు, తాగునీటి కొరత ఉన్న ప్రాంతాల రూపురేఖలు మారిపోతాయని, ఆ ప్రాంతాల్లో ఆరి్థక పరిస్థితులు అనూహ్యంగా మారతాయని సీఎం వివరించారు.  
 
సవరించిన అంచనాను ఆమోదించండి 
కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు ఈ భేటీలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పలు విన్నపాలు చేశారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో రివర్స్‌ టెండరింగ్‌ ప్రక్రియ ద్వారా హెడ్‌ వర్క్స్, హైడ్రోఎలక్ట్రిక్‌ ప్రాజెక్టులో రూ.780 కోట్లు, టన్నెల్‌ పనుల్లో రూ.58 కోట్లు ఆదా అయిన విషయాన్ని స్పష్టంగా వివరించారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం రూ.55,548.87 కోట్లుగా ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. ఇందులో భూ సేకరణ, ఆర్‌ అండ్‌ ఆర్‌ పనులకే రూ.33 వేల కోట్లు వ్యయం అవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.5,073 కోట్లను వెంటనే విడుదల చేయాలని, ఈ ఆరి్థక సంవత్సరంలో భూసేకరణ, ఆర్‌ అండ్‌ ఆర్‌ పనుల కోసం రూ.16 వేల కోట్లు ఇవ్వాలని కోరారు. వీలైనంత త్వరలో నిధులు ఇచ్చేలా సంబంధిత మంత్రిత్వ శాఖతో మాట్లాడాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.  
 
రెవిన్యూ లోటును సవరించండి 
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు మరోసారి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. పరిశ్రమలు, సేవారంగాలపై రాష్ట్ర విభజన ప్రతికూల ప్రభావం చూపిందని వివరించారు. వీటి వాటా 76.2 శాతం నుంచి 68.2 శాతానికి తగ్గిందన్నారు. ప్రత్యేక హోదా ద్వారానే ఈ సమస్యలను అధిగమించగలమని, పొరుగు రాష్ట్రాల రాజధానులతో సమానంగా పారిశ్రామిక వర్గాలను, పెట్టుబడిదారులను ఆకట్టుకోవాలంటే హోదా అవసరమని వివరించారు. 2014 – 2015లో రెవిన్యూ లోటును కాగ్‌తో సంప్రదించి సవరిస్తామని గతంలో హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆ మేరకు సంబంధిత శాఖలకు తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర విభజన సమయంలో రూ.22,948.76 కోట్లు రెవిన్యూ లోటుగా ప్రకటించినప్పటికీ ఇంకా రూ.18,969.26 కోట్ల మేర కేంద్రం నుంచి రావాల్సి ఉందని చెప్పారు. ఈ నిధులు తక్షణమే విడుదలయ్యేలా చొరవ చూపాలని కోరారు.  
 
మౌలిక వసతుల కల్పనకు నిధులివ్వండి 
ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన మేరకు మౌలిక వసతుల కల్పనకు చొరవ చూపాలని సీఎం విజ్ఞప్తి చేశారు.  పారిశ్రామిక అభివృద్ధికి వీలుగా కడపలో స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణానికి చేయూత ఇవ్వాలని కోరారు. ప్రకాశం జిల్లా రామాయపట్నంలో పోర్టు నిర్మాణ అంశాన్ని కూడా ప్రస్తావించారు. విశాఖపట్నం – చెన్నై ఇండ్రస్టియల్‌ కారిడార్, కాకినాడలో పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ ప్రాజెక్టుల పూర్తికి అవసరమైన నిధులను సమకూర్చాలని విన్నవించారు. వెనకబడిన జిల్లాలకు ప్రస్తుతం కేటాయిస్తున్న నిధులు చాలా స్వల్పమని, రాష్ట్ర విభజన హామీ మేరకు.. కలహండి – బొలంగిర్‌ – కోరాపుట్‌ (కేబీకే ), బుందేల్‌ఖండ్‌ తరహాలో రాష్ట్రానికి ప్రత్యేక సాయం చేయాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.

ఏపీలో వెనకబడిన జిల్లాల్లో తలసరి రూ.400 ఇస్తే, బుందేల్‌ఖండ్, కలహండి ప్రాంతాలకు తలసరి రూ.4,000 ఇస్తున్నారని వివరించారు. ఏడు జిల్లాలకు ఏడాదికి రూ.350 కోట్లు చొప్పున ఇప్పటి వరకు రూ.2,100 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, రూ.1,050 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. మిగిలిన మొత్తాన్ని కూడా వెంటనే విడుదల చేయాలని కోరారు. సీఎం వెంట వైఎస్సార్‌పీపీ నేత వి.విజయసాయిరెడ్డి, లోక్‌సభా పక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి, ఎంపీలు వైఎస్‌ అవినాష్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, రఘురామకృష్ణం రాజు, రెడ్డప్ప మార్గాని భరత్, నందిగం సురేష్‌ తదితరులు ఉన్నారు.  
 

రివర్స్‌ టెండరింగ్‌పై అమిత్‌ షా అభినందనలు 
పోలవరం ప్రాజెక్టులో రివర్స్‌ టెండరింగ్‌ ప్రక్రియ వల్ల రూ.838 కోట్లు ఆదా అయ్యాయని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వివరించారు. దీంతో వైఎస్‌ జగన్‌ను అమిత్‌ షా అభినందించినట్టు సమాచారం. పోలవరంపై ఇలాగే ముందుకు వెళ్లాలని అమిత్‌ షా ప్రోత్సహించారని, ఏపీ అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహకరిస్తానని భరోసా ఇచ్చారని తెలిసింది.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా