అగ్రిగోల్డ్‌ బాధితులకు.. నేడు డిపాజిట్ల పంపిణీ

7 Nov, 2019 04:44 IST|Sakshi

తొలి విడతలో రూ.10వేల లోపు డిపాజిటర్లకు..

రాష్ట్రంలో 3,69,655 మందికి రూ.263.99 కోట్లు చెల్లింపు

గుంటూరులో సీఎం జగన్‌ చేతుల మీదుగా అందజేత

త్వరలో రూ.20 వేలలోపు డిపాజిటర్లకు కూడా..

నాటి హామీని నేడు కార్యరూపంలోకి తెచ్చిన సీఎం

తొలి మంత్రివర్గ సమావేశంలోనే అగ్రిగోల్డ్‌ సమస్యపై నిర్ణయం

బడ్జెట్‌లో ఇప్పటికే రూ.1,150 కోట్లు కేటాయింపు

మొదటి విడత కింద గత నెల 18న రూ.263.99 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు

సాక్షి, అమరావతి/సాక్షి, అమరావతి బ్యూరో: మరికొద్ది గంటల్లో అగ్రిగోల్డ్‌ బాధితుల కల సాకారమవుతోంది. ఐదేళ్ల వారి పోరాటం ఫలించే రోజు రానే వచ్చింది. ప్రతిపక్ష నేత హోదాలో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆచరణలోకి తీసుకువచ్చారు. తొలివిడతలో 3,69,655 మందికి సంబంధించిన డిపాజిట్లు తిరిగి చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఇందులో భాగంగా.. గుంటూరులోని పోలీసు పరేడ్‌ గ్రౌండ్స్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా గురువారం అగ్రిగోల్డ్‌ బాధితులకు డబ్బుల పంపిణీ కార్యక్రమం జరగనుంది.

ముందుగా రూ.10వేలలోపు డిపాజిటర్లకు..
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే జరిగిన తొలి మంత్రివర్గ సమావేశంలోనే ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అగ్రిగోల్డ్‌ బాధితులకు చెల్లింపులు చేసే నిర్ణయంపై తీర్మానం చేశారు. మొదటి బడ్జెట్లోనే వారికి రూ.1,150 కోట్లు కేటాయించారు. మరోవైపు.. అగ్రిగోల్డ్‌ ఆస్తుల విక్రయ ప్రక్రియకు సంబంధించిన వివాదాలు కొనసాగున్నా, నిబంధనలకు లోబడి ప్రభుత్వం బాధితులకు చెల్లింపులు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా.. ముందుగా రూ.10 వేలలోపు డిపాజిట్‌ చేసిన బాధితులకు చెల్లింపులు చేసేందుకు గతనెల 18న రాష్ట్ర ప్రభుత్వం రూ.263.99 కోట్లను విడుదల చేసింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కెఆర్‌ఎం కిశోర్‌కుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు. సర్కారు నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 13జిల్లాల్లో ఒకేసారి చెల్లింపుల ద్వారా 3,69,655 మందికి సాంత్వన కలుగుతుంది. దీంతో అగ్రిగోల్డ్‌ బాధితుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. కాగా, డిస్ట్రిక్ట్‌ లీగల్‌ సెల్‌ అథారిటీ (డీసీఎల్‌) ప్రతిపాదనల ప్రకారం జిల్లాల వారీగా ఈ సొమ్మును అందజేయనున్నారు. అలాగే, రూ.20 వేలలోపు వున్న మరో 4 లక్షల మంది డిపాజిటర్లకు కూడా త్వరలో చెల్లింపులు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా వున్నట్లు అధికారులు తెలిపారు.

అధిక వడ్డీల ఆశచూపి..
విజయవాడ కేంద్రంగా అవ్వా వెంకటరామారావు, మరికొందరు డైరెక్టర్లతో కలిసి 1995లో ఏర్పడిన ‘అగ్రిగోల్డ్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌’.. అనతి కాలంలోనే రోజువారీ కష్టం చేసుకునే వారితోపాటు.. చిన్నా, మధ్య తరగతి వర్గాలకు ఆకర్షణీయమైన వడ్డీ రేట్ల ఆశచూపి వేల కోట్ల రూపాయల మేర డిపాజిట్లను సేకరించింది. వీటి ద్వారా పెద్దఎత్తున ఆస్తులను కొనుగోలు చేసింది. వివిధ రకాల స్కీంల ద్వారా సేకరించిన డిపాజిట్లకు నగదును, భూములను ఇస్తామని చెప్పి వాటిని నిర్ణీత గడువులోగా అందించలేకపోయింది. చివరికి మోసపోయామని గ్రహించిన డిపాజిటర్లు పోలీసులను ఆశ్రయించడంతో ఏపీతో పాటు పలుచోట్ల అగ్రిగోల్డ్‌ యాజమాన్యంపై పెద్దఎత్తున కేసులు నమోదయ్యాయి. 

అగ్రిగోల్డ్‌ ఆస్తులపై గద్దల కన్ను
ఈ నేపథ్యంలో.. అగ్రిగోల్డ్‌ బాధితులు తమకు న్యాయం చేయాలంటూ గత ఐదేళ్లుగా చంద్రబాబు ప్రభుత్వానికి పదేపదే విన్నవించుకున్నారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం నుంచి వారికి స్పందన కరువైంది. మరోవైపు.. గత ప్రభుత్వంలోని కొందరు పెద్దలే బినామీ పేర్లతో వున్న అగ్రిగోల్డ్‌ ఆస్తులను కాజేసేందుకు ప్రయత్నించారు. దీనిని గ్రహించిన అగ్రిగోల్డ్‌ బాధితులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. ప్రతిపక్షంలో వున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వారికి అండగా నిలిచింది. అగ్రిగోల్డ్‌ బాధితుల బాసట కమిటీని ఏర్పాటుచేసి అప్పటి చంద్రబాబు సర్కార్‌ కుట్రలను అడ్డుకుంది. ఇదే క్రమంలో ప్రజాసంకల్ప పాదయాత్రలోనూ బాధితులు అడుగడుగునా వైఎస్‌ జగన్‌ను కలిసి తమ కష్టాలను వివరించారు. న్యాయం చేయాల్సి ప్రభుత్వమే తమ కష్టాన్ని దోచుకోవాలని చూస్తోందని మొరపెట్టుకున్నారు. దీంతో తమ ప్రభుత్వం రాగానే ప్రాధాన్యతా క్రమంలో అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేస్తానంటూ నాడు వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీని నేడు నెరవేరుస్తున్నారు.

సీఎం సభకు ఏర్పాట్లు పరిశీలన
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఉ.11 గంటలకు  గుంటూరు నగరానికి రానున్నారు. పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో రూ.10వేల లోపు అగ్రిగోల్డ్‌ డిపాజిటర్లకు చెక్కులు పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను జిల్లా ఇన్‌చార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, జిల్లా మంత్రులు మోపిదేవి వెంకటరమణారావు, మేకతోటి సుచరిత, ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, మొహ్మద్‌ ముస్తఫా, విడదల రజని, అగ్రిగోల్డ్‌ బాధితుల బాసట కమిటీ రాష్ట్ర కోఆర్డినేటర్‌ లేళ్ల అప్పిరెడ్డి, వైఎస్సార్‌సీపీ నేతలు మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, చంద్రగిరి ఏసురత్నం, పాదర్తి రమేష్‌ తదితరులు పరిశీలించారు. సీఎం సభకు బుధవారం సాయంత్రానికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు జిల్లా కలెక్టర్‌ ఐ. శామ్యూల్‌ ఆనందకుమార్, అర్బన్‌ ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ, జేసీ దినేష్‌కుమార్, ట్రైనీ కలెక్టర్‌ మౌర్య నారపురెడ్డి మంత్రులకు వివరించారు.

చరిత్రలోనే తొలిసారి..
ఓ ప్రైవేటు కంపెనీ మోసం చేసి ఎగ్గొట్టిన డబ్బును ప్రపంచంలో ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చెల్లించిన దాఖలాలు ఎక్కడా లేవని.. పేద ప్రజలను ప్రభుత్వపరంగా ఆదుకోవాలన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారని జిల్లా ఇన్‌చార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఈ సందర్భంగా చెప్పారు. కార్యక్రమానికి పెద్దఎత్తున అగ్రిగోల్డ్‌ బాధితులు, పార్లమెంట్‌ సభ్యులు, మంత్రులు, శాసనసభ్యులు, వైఎస్సార్‌సీపీ అన్ని విభాగాల నాయకులు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. 

మరిన్ని వార్తలు