ఆశావర్కర్ల వేతనాల పెంపు ఫైల్‌పై ముఖ్యమంత్రి తొలి సంతకం

9 Jun, 2019 04:26 IST|Sakshi

అనంతపురం–అమరావతి ఎక్స్‌ప్రెస్‌వే ఫైల్‌పై రెండో సంతకం

జర్నలిస్టుల ఇన్సూరెన్స్‌ రెన్యువల్‌ ఫైల్‌పై మూడో సంతకం

వేద పండితుల ఆశీర్వచనాల మధ్య ఉదయం 8.39 గంటలకు ముఖ్యమంత్రి కుర్చీలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సీఎంకు సీఎస్‌తోపాటు పలువురు ఉద్యోగుల ఘన స్వాగతం

నిజాయితీగా ఉంటే సీబీఐ అంటే భయమెందుకు?

సుపరిపాలనకు సూచనలు అందించాలని అధికార యంత్రాంగానికి సీఎం విజ్ఞప్తి

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం శనివారం తొలిసారిగా సచివాలయంలో అడుగుపెట్టిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అధికార యంత్రాంగం ఘన స్వాగతం పలికింది. వేద పండితుల ఆశీర్వచనాల మధ్య ఉదయం 8.39 గంటలకు సచివాలయం తొలి బ్లాక్‌ మొదటి అంతస్తులోని తన కార్యాలయంలోకి ప్రవేశించిన వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు. అంతకుముందు ఆయన తన కార్యాలయంలో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. దేవుడి పటాల వద్ద కొబ్బరికాయ కొట్టారు. అనంతరం దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

42 వేల మంది ఆశా వర్కర్లకు ప్రయోజనం
ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు ఆశా వర్కర్ల వేతనాలు రూ.3,000 నుంచి రూ.10 వేలకు పెంచిన ఫైలుపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొలి సంతకం చేశారు. రాష్ట్రంలో 42 వేల మంది ఆశా వర్కర్లు ఉండగా వారి వేతనాలను ఒకేసారి పది వేల రూపాయలకు పెంచడంతో ఏటా రూ.504 కోట్ల మేరకు వారికి ప్రయోజనం కలగనుంది. అనంతపురం–అమరావతి ఎక్స్‌ప్రెస్‌ వేకి  సంబంధించి నిరభ్యంతర సర్టిఫికెట్‌ ఫైల్‌పై ముఖ్యమంత్రి రెండో సంతకం చేశారు. జర్నలిస్టుల ఇన్సూ్యరెన్స్‌ రెన్యువల్‌కు సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి మూడో సంతకం చేశారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం, డీజీపీ గౌతం సవాంగ్,  వైఎస్సార్‌సీపీ  పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి వైవీ సుబ్బారెడ్డితోపాటు పలువురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కార్యాలయ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలిసారిగా సచివాలయానికి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంతోపాటు పలువురు ఐఏఎస్‌లు, సచివాలయ ఉద్యోగ సంఘాల నేతలు, ఉద్యోగులు ఘనస్వాగతం పలికారు.

ప్రజల ఆశలకు అనుగుణంగా పనిచేద్దాం
పరిపాలనలో పారదర్శకత పెంచడంతో పాటు అవినీతి సమూలంగా నిర్మూలించేందుకు అధికార యంత్రాంగం అంతా సహకరించాలని సీఎం వైఎస్‌ జగన్‌ కోరారు. తన కార్యాలయంలోకి ప్రవేశించిన అనంతరం వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులనుద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడారు. పరిపాలనలో మార్పు, కొత్తదనం తేవాలని ప్రజలు తమకు అఖండ మెజారిటీ ఇచ్చారని, వారి ఆశలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేయాల్సి ఉందన్నారు. రాజకీయ పార్టీలే కాకుండా అధికార యంత్రాంగం కూడా ప్రజలకు జవాబుదారీగా, బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. వృథా ఖర్చులను తగ్గించి డబ్బులు ఆదా చేసేందుకు అధికార యంత్రాంగం సహకరించాలని కోరారు.

అనవసరమైన వ్యయాలను తగ్గిస్తూ నిధులు ఆదా చేసే ప్రతిపాదనలను తెచ్చేవారిని సన్మానిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో పరిపాలన దేశానికే ఆదర్శవంతమయ్యే స్థాయికి తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి కోరారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలనే రెండే రెండు పేజీల్లో పార్టీ ఎన్నికల ప్రణాళికలో పొందుపరిచామని, వాటిని తు.చ. తప్పకుండా అమలు చేయడానికి అధికార యంత్రాంగం సహకరించాలని కోరారు. త్వరలో గ్రామ వలంటీర్లను నియమిస్తామని, వారి ద్వారా అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందిస్తామని చెప్పారు. సుపరిపాలనకు సూచనలు అందచేయాలని అధికారులను ముఖ్యమంత్రి కోరారు.

కాలుష్యాన్ని అరికట్టేందుకు ఎలక్ట్రికల్‌ బస్సులను ప్రవేశపెట్టాలన్న అధికారుల సూచనను సీఎం స్వాగతించారు. ఘన వ్యర్ధాల నిర్వహణ, గ్రీన్‌ టాక్స్‌ విధించడం ద్వారా కాలుష్యాన్ని నివారించవచ్చని సీఎం అభిప్రాయపడ్డారు. అంతకు ముందు సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా పనిచేయడానికి అధికారులంతా సిద్ధంగా ఉన్నారని చెప్పారు. సవాళ్లను ధీటుగా ఎదుర్కొని మంచి పనితీరు కనబరిచే ప్రతిభ అధికార యంత్రాంగానికి ఉందన్నారు. ప్రభుత్వ విధానాలు, లక్ష్యాలకు అనుగుణంగా పనిచేసే గొప్ప సామర్థ్యం కలిగిన అధికారులు రాష్ట్రంలో ఉన్నారని చెప్పారు.

నిజాయితీగా ఉంటే భయమెందుకు?: సీఎం
గత ప్రభుత్వ హయాంలో టెండర్ల విధానాన్ని అపహాస్యం చేశారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. అంచనా వ్యయాలను భారీగా పెంచేసి కమీషన్లు చెల్లించే కాంట్రాక్టర్లకు అధిక ధరలకు పనులు అప్పగించి ఖజానాకు గండి కొట్టారని చెప్పారు. తమ ప్రభుత్వం టెండర్ల విధానాన్ని ప్రక్షాళన చేస్తుందని, ఇందులో భాగంగానే హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ను కలిసి జ్యుడీషియల్‌ కమిషన్‌ నేతృత్వంలో టెండర్లు నిర్వహించాలని కోరామన్నారు.

ఎక్కువ మంది కాంట్రాక్టర్లు పోటీ పడేలా నిబంధనలు రూపొందించి పారదర్శకంగా టెండర్లను నిర్వహిస్తామన్నారు. దీనివల్ల తక్కువ ధరలకే  పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు వస్తారని, ప్రభుత్వ ధనం భారీగా ఆదా అవుతుందని వివరించారు. అక్రమాలకు పాల్పడకుండా నిజాయితీగా ఉంటే సీబీఐ అంటే భయం ఎందుకని ప్రశ్నించారు. అందుకే రాష్ట్రంలో ఎక్కడైనా దర్యాప్తు నిర్వహించేలా సీబీఐకి అనుమతి ఇచ్చామని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు