మహానేత వైఎస్సార్‌కు నివాళులర్పించిన వైఎస్‌ జగన్‌

12 Jan, 2019 15:04 IST|Sakshi

సాక్షి, పులివెందుల : ఇడుపులపాయలోని మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఘాట్‌ వద్ద ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించారు. 3,648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రను విజయవంతంగా ముగించుకుని వైఎస్‌ జగన్‌ శుక్రవారం పులివెందులలోని స్వగృహానికి చేరుకున్న విషయం తెలిసిందే. ఇక శనివారం పర్యటనలో భాగంగా తొలుత పులివెందుల సీఎస్‌ఐ చర్చిలో కుటుంబ సమేతంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన వైఎస్‌ జగన్‌.. అనంతరం చక్రయ్యపేట మండలంలోని వీరన్నగట్టుపల్లిలో గల గండి వీరాంజనేయస్వామి క్షేత్రాన్ని దర్శించుకున్నారు.

ప్రజాసంకల్పయాత్ర ప్రారంభానికి ముందు వైఎస్‌ జగన్‌ తిరుమల శ్రీవారిని, అమీన్‌ పీర్‌ దర్గాను దర్శించిన సంగతి తెలిసిందే. అయితే 14 నెలల పాటు కొనసాగిన పాదయాత్ర విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో ఆయన మొక్కులు చెల్లించుకునేందుకు సంకల్పించుకున్నారు. గురువారం అలిపిరి నుంచి తిరుమలకు కాలినడకన వెళ్లిన వైఎస్‌ జగన్‌.. సామాన్య భక్తునిలా క్యూ లైన్‌లో వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకున్న విషయం తెలిసిందే. శుక్రవారం అమీన్‌ పీర్‌ దర్గాను దర్శించుకున్న ఆయన.. శనివారం వీరంజనేయస్వామి క్షేత్రం, సీఎస్‌ఐ చర్చిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చివరగా ఇడుపులపాయలోని తన తండ్రి, మహానేత వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద వైఎస్‌ విజయమ్మ, సోదరి షర్మిల, సతీమణి భారతి రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్‌ జగన్‌ నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా పులివెందులలో దారిపొడవునా వైఎస్‌ జగన్‌కు అభిమానులు ఘనస్వాగతం పలికారు. వైఎస్సార్‌ కడప జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా అభిమానులు భారీగా తరలిరావడంతో పరిసర ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. జై జగన్‌.. జోహార్‌ వైఎస్సార్‌ నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు