ఎర్రవరం.. ఎల్లలెరుగని సంబరం

16 Aug, 2018 06:58 IST|Sakshi
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం చేస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి, పార్టీ నాయకులు, తదితరులు

సాక్షాత్తు ప్రతిపక్ష నేత వై.ఎస్‌.జగన్‌ ఆధ్వర్యంలో జెండా వందనం

జోరువానలోనూ తరలివచ్చిన జనం

ఇది తమ గ్రామానికి గర్వకారణమని ఆనందం

డి.ఎర్రవరం.. జిల్లా సరిహద్దులోని నాతవరం మండలంలో ఒకానొక చిన్న గ్రామం.. నిన్నటివరకు ఆ ఊరి గురించి ఆ మండలంలో తప్ప పెద్దగా ఎవరికీ తెలియదు..అటువంటి ఆ ఊరి పేరు ఉన్న పళంగా రాష్ట్రస్థాయిలో వార్తలకెక్కింది.. కారణం.. వారు కలలోనైనా ఊహించని రీతిలో సాక్షాత్తు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి జాతీయ పండుగ అయిన స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఆ ఉరి ప్రజల మధ్య జరపడమే..సాదాసీదా నాయకులు సైతం ఎప్పుడోగానీ రాని తమ ఊరిలో ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా జగన్‌మోహన్‌రెడ్డి బస చేయడం.. ఆ శిబిరం వద్దే బుధవారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడంతో స్థానికులు ఆనందంతోఉబ్బితబ్బిబ్బవుతున్నారు.  జోరున వర్షం కురుస్తున్నా.. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు ఎర్రవరంతోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తరలివచ్చారు. ఒక ప్రతిపక్ష నేత ఆధ్వర్యంలో జెండా పండుగ జరగడం తమ గ్రామానికి లభించిన వరమని మురిసిపోయారు.

సాక్షి, విశాఖపట్నం:తమ అభిమాన జననేత తమ ప్రాంతంలో జాతీయ జెండాను ఆవిష్కరించడంతో వారంతా మురిసిపోయారు. విప్లవ జ్యోతి అల్లూరి నడయాడిన నేలపై అలుపెరగని పోరు సాగిస్తున్న వైఎస్‌ జగన్‌ స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనడంతో నాతవరం మండల ప్రజలు మాటల్లో చెప్పలేని ఆనందానుభూతికి లోనయ్యారు. జోరువానలోనూ మువ్వన్నెల పతాకాన్ని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఎగురవేసి దేశభక్తిని చాటుకున్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజా సంకల్పయాత్రకు విరామం ప్రకటించిన ఆయన విశాఖ జిల్లా డి.ఎర్రవరం సమీపంలో విడిది చేసిన శిబిరం వద్ద బుధవారం నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. తొలుత శిబిరం నుంచి బయటకొచ్చిన జననేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి.. ఆర్‌ఎస్‌ఐ సీహెచ్‌.వెంకటరావు ఆధ్వర్యంలో పోలీసుల నుంచి గార్డ్‌ ఆఫ్‌ ఆనర్‌ అందుకున్నారు. అనంతరం వేదిక వద్దకు వెళ్లి జాతిపిత మహాత్మా గాంధీజి, విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఉదయం 9 గంటలకు జోరుగా వర్షం పడుతున్నా ప్రతిపక్ష నేత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జెండా వందనం చేశారు. పార్టీ శ్రేణులు, ప్రజలతో కలిసి జననేత జాతీయ గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా జిల్లా వాసులతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం అక్కడికి వచ్చిన పార్టీ శ్రేణులు, ప్రజలకు మిఠాయిలు పంచి పెట్టారు. ఈ వేడుకల్లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి, శాసనసభా పక్ష ఉపనేత బూడి ముత్యాలనాయుడు, వైఎస్సార్‌ సీపీ అనకాపల్లి పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, అనకాపల్లి పార్లమెంట్‌ సమన్వయకర్త వరుదు కల్యాణి, విశాఖ పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు తైనాల విజయకుమార్, నియోజకవర్గాల సమన్వయకర్తలు పెట్ల ఉమాశంకర గణేష్, గొల్ల బాబూరావు, కరణం ధర్మశ్రీ, ప్రజాసంకల్ప యాత్ర ప్రోగ్రాం కో–ఆర్డినేటర్‌ తలశిల రఘురామ్, డీసీసీబీ అధ్యక్షుడు ఉప్పలపాటి సుకుమార్‌వర్మ, మాజీ ఎమ్మెల్యేలు ఉప్పలపాటి కన్నబాబు, కుంభా రవిబాబు, మాజీ ఎమ్మెల్సీ డి.వి.సూర్యనారా యణరాజు, సెంట్రల్‌ బ్యాంకు మాజీ చైర్మన్‌ రాజా సాగి రామచంద్రరాజు, ఏటికొప్పాక సుగర్‌ ఫ్యాక్టరీ చైర్మన్‌ రాజాసాగి రామభద్రరాజు, పార్టీ సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలు వంగపండు ఉష, ప్రముఖ వైద్యులు పి.ఎస్‌.వి.రాజశేఖర్, లక్ష్మీకాంత్, కేంద్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యులు కాకర్లపూడి శ్రీకాంత్, అంకింరెడ్డి జమీల్, ఐటీ విభాగం అధ్యక్షుడు చల్లా మధుసూదనరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి తాడి విజయభాస్కరరెడ్డి, తాడి జగన్నాథరెడ్డి, రుత్తల ఎర్రాపాత్రుడు, నగర యువజన విభాగం అధ్యక్షుడు కొండా రాజీవ్‌గాంధీ, పాయకరావుపేట కో–ఆర్డినేటర్‌ వీసం రామకృష్ణ, విశాఖ నగర నాయకులు సుధాకర్‌ సీతన్నరాజు, రవిరెడ్డి, పక్కి దివాకర్, కిరణ్‌రాజు, నర్సీపట్నం నియోజకవర్గ మండల పార్టీ అధ్యక్షులు శెట్టి నూకరాజు, సుర్ల సత్యనారాయణ, రుత్తల సత్యనారాయణ, కోనేటి రామకృష్ణ, చిటికెల భాస్కరనాయుడు, కిరణ్‌ రాజు పాల్గొన్నారు.

తరలివచ్చిన అభిమానం
బుధవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తుంది. పాదయాత్ర శిబిరం వద్ద నేలంతా చిత్తడిచిత్తడిగా మారిపోయింది. అయినా సరే పార్టీ రాష్ట్ర ప్రొగ్రామ్స్‌ కమిటీ కన్వీనర్‌ తలశిల రఘురాం ఆధ్వర్యంలో స్వాతంత్య్ర వేడుకల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శిబిరం వద్దే ప్రత్యేక స్థూపాన్ని ఏర్పాటు చేసి జెండాను అలంకరించారు. ప్రాంగణాన్ని పూలు, జాతీయ జెండాలతో తీర్చిదిద్దారు. జోరు వాన కురుస్తున్నా లెక్కచేయకుండా పార్టీ శ్రేణులతో పాటు ఎర్రవరం పరిసర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. తమ అభిమాన నేత జాతీయ జెండా ఆవిష్కరణ చేయడాన్ని చూసి మురిసిపోయారు.

అల్లూరి వారసులకు ఆత్మీయ సత్కారం
అల్లూరి సీతారామరాజు వారసులను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి ఘనంగా సత్కరించారు. వారికి పూల కిరీటం ధరింపచేసి జరీ కండువాలు కప్పి పట్టువస్త్రాలు అందించారు.

నేడు యథావిధిగా పాదయాత్ర
స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా బుధవారం ప్రజాసంకల్ప పాదయాత్రకు విరామం ఇచ్చామని పార్టీ ప్రోగ్రామ్‌ కమిటీ కన్వీనర్‌ తలశిల రఘురాం తెలిపారు. గురువారం యథావిధిగా పాదయాత్ర షెడ్యూల్‌ ప్రకారం కొనసాగుతుందని చెప్పారు. ఎర్రవరం నుంచి యరకంపేట మీదుగా ములపూడి వరకు పాదయాత్ర కొనసాగుతుందని చెప్పారు. పార్టీ శ్రేణులు, ప్రజలు, అభిమానులు పాల్గొని పాదయాత్రను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

బస ప్రాంగణం.. బురదమయం
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్‌ సీపీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా బస చేసిన శిబిరం బుధవారం కురిసిన భారీ వర్షానికి బురదమయమైంది. శిబిరం వద్దనే జెండా పండుగ నిర్వహించేందుకు వీలుగా ప్రాంగణాన్ని తీర్చిదిద్దేందుకు పార్టీ రాష్ట్ర ప్రోగ్రామ్‌ కమిటీ కన్వీనర్‌ తలశిల రఘురామ్‌ ఆధ్వర్యంలో సిబ్బంది ఉపక్రమించారు. తెల్లవారుజాము నుంచి కురుస్తున్న జోరు వానలోనూ తడుస్తూ ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. రఘురామ్‌తో పలువురు పార్టీ శ్రేణులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

నా భూమిలోనే జెండా వందనం
నాడు వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేసినప్పుడు ఇక్కడే నా భూమిలోనే ఒక రోజు రాత్రి బస చేశారు. ఇప్పుడు కూడా ఇక్కడే జగన్‌మోహన్‌రెడ్డి బస ఉండడం చాలా ఆనందంగా ఉంది. అందులోనే జెండా వందనం కూడా చేయడం మరిచిపోలేం. రాజశేఖర్‌రెడ్డితో పాటు నడిచాను. ఇప్పుడు జగన్‌ వెంట నడవాలని ఉంది. కానీ వయస్సు సహకరించలేదు. పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి కావాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నా.– లాలం సత్యనారాయణ, ఎర్రవరం, నాతవరం మండలం

జగనన్నతో మాట్లాడా..
జగనన్న అంటే నాకు చాలా ఇష్టం. ఆయన మా ఊరికి దగ్గర్లో జెండా పండగ చేస్తున్నారని తెలుసుకుని తెలుగుతల్లి వేషాధారణలో వచ్చాను. జగనన్న జెండా ఎగురవేస్తున్న కార్యక్రమంలో నేను పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. జగనన్న నాతో మాట్లాడారు. బాగా చదువుకోమన్నారు. తెలుగుతల్లి వేషాధారణ బాగుందని అభినందించారు.–ఎ.శ్రీజ, 4వ తరగతి విద్యార్థిని,నాతవరం

మరిన్ని వార్తలు