ఆరోగ్య కేంద్రాలు, 108 పనితీరుపై జగన్‌ ఆరా

3 Jun, 2019 14:32 IST|Sakshi

మౌలిక వసతులు, సౌకర్యాలపై చర్చించిన సీఎం  

సాక్షి, తాడేపల్లి : రాష్ట్రంలో ఆరోగ్య కేంద్రాలు, 108 సర్వీసుల పనితీరుపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీశారు. వైద్య విధాన పరిషత్, వైద్య విభాగాల పని తీరును ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. వైద్య ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. సుమారు రెండు గంటల పాటు సుదీర్ఘమైన సమీక్షలో..  వైద్య రంగాన్ని మెరుగుపరచి ప్రతి పేదవారికి కూడా వైద్యం అందించే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వైద్య, ఆరోగ్య శాఖలో అవినీతిని సహించేది లేదని, వైద్యశాఖను తానే ప్రత్యక్షంగా పర్యవేక్షించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అధికారులు అంతా బాధ్యతతో పనిచేసి ఇందుకు సంబంధించి 45 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. 

అన్ని వ్యవస్థలను సమూలంగా మార్పు తీసుకురావాలని ఆయన ఈ సందర్భంగా అధికారులకు సూచనలు చేశారు. ప్రధానంగా వ్యవస్థీకృతంగా ఉన్న లోపాలను సరిదిద్దాలని సూచించారు. అలాగే దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 108 వాహనాల నిర్వహణ గందరగోళంగా ఉన్న నేపథ్యంలో 108కు మళ్లీ పూర్వ వైభవం తీసుకురావాలని అధికారులతో చర్చించారు. ఎన‍్టీఆర్‌ వైద్యసేవ పేరును వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీగా అమలు చేయాలని సూచించారు. వైఎస్సార్ స్పూర్తికి అనుగుణంగా ఈ సర్వీసులు పనిచేయాలన్నారు. ప్రయివేట్‌ ఆస్పత్రులు కన్నా ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరు మెరుగ్గా ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
వైద్య ఆరోగ్య శాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష

వైద్య ఆరోగ్య శాఖ ప్రక్షాళనకు ఆరోగ్య రంగ నిపుణల కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు.. దీనిని ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి పీవీ రమేశ్‌ సీఎం కార్యాలయం తరఫున సమన్వయ పరుస్తారని ముఖ్యమంత్రి తెలిపారు. వైఎస్సార్‌ అప్పట్లో అమలు చేసిన ఆరోగ్యశ్రీ, 108 సర్వీసులు వంటి అనేక విధానాలను పలు రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయని గుర్తుచేశారు. ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, ఇతర పోస్టుల భర్తీపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి.. పోస్టుల భర్తీ, ఆర్థిక అవసరాలు, మౌలిక అభివృద్ధిపై తక్షణమే నివేదిక రూపొందించాల్సిందిగా సూచించారు.. గతంలో రోగులను ఎలకలు కోరికేయడం, సెల్‌ ఫోన్‌ లైట్లతో శస్త్ర చికిత్స చేయడం వంటి ఘటనలపై ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ మందులు, నాణ్యత లేని ఔషధాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు.

అలాగే 104 వాహనాలౖ నిర్వహణపై కూడా ముఖ్యమంత్రి చర్చ జరిపారు. రాష్ట్రంలో మారుమూల గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సౌకర్యాలు, మౌలిక వసతులు, సిబ్బంది కొరత, ఆరోగ్యశ్రీ పథకంలో తీసుకురావాల్సిన మార్పులపై కూడా దృష్టి సారించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, రిటైర్డ్‌ సీఎస్‌ అజయ్‌ కల్లాం, వైద్య శాఖ ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మరి  కాసేపట్లో జల వనరుల శాఖపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించనున్నారు.

మరిన్ని వార్తలు