ఆటోవాలాకు రూ.10 వేలు 

10 Sep, 2019 09:31 IST|Sakshi

మాట నిలబెట్టుకున్న సీఎం జగన్‌ 

సాక్షి, అనంతపురం: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆటోడ్రైవర్లకు ప్రతి సంవత్సరం రూ.10 వేలు అందజేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఎన్నికలకు ముందు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన పాదయాత్రలో ఆటో కార్మికుల కష్టాలను చూసి చలించిపోయారు. తాము  అధికారంలోకి వస్తే సొంత ఆటో నడుపుతున్న కార్మికులకు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్, ఇతరత్రా వాటికోసం ప్రతి ఏటా రూ.10 వేలు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ప్రకటించారు. తాజాగా రూ.10 వేలు అందజేసేందుకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో జిల్లాలోని  దాదాపు 40వేల మంది ఆటో కార్మికులకు లబ్ధి కలగనుంది. లబ్ధిదారుల గుర్తింపు, నెలాఖరులోగా ఆర్థికసాయం అందజేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయంపై ఆటోడ్రైవర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే తమకిచ్చిన మాట నిలబెట్టుకున్నారని కొనియాడుతున్నారు.   

మరిన్ని వార్తలు