జగనన్న పాలనలో.. ఆమె.. శక్తి!

8 Mar, 2020 08:21 IST|Sakshi

నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం

ఆర్థిక స్వావలంబన.. సామాజిక స్థితిగతుల్లో మార్పు.. రాజకీయంగా ఎదిగేందుకు తగిన ప్రోద్బలం.. మహిళల జీవితాల్లో మార్పునకు ఇవే ప్రబల సంకేతాలు మహిళా సాధికారతకు స్పష్టమైన ఆనవాళ్లు.. తొమ్మిదినెలల పాలనలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ మార్పు కోసమే తపించారు. అక్కచెల్లెమ్మలకు అండగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి బామ్మ వరకు అందరికీ ఈ సంక్షేమ ఫలాలు అందుతున్నాయి.

పేదల ఇళ్లల్లో ‘అమ్మ ఒడి’ వెలుగులు నింపింది. బిడ్డలను చదివించుకోడానికి అడ్డుగా ఉన్న పేదరికం గోడ కూలిపోయింది. పెద్ద చదువులను చదివించుకునేందుకు ‘జగనన్న వసతి దీవెన’ అమ్మలకు ఆసరాగా మారింది. అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు, ఆశావర్కర్లకు జీతాలు పెరిగాయి. అన్ని వయసులు, వర్గాల మహిళలకు పింఛన్లు అందుతున్నాయి. వీటన్నిటికి తోడు ఈ ఉగాది నాడు 26.6 లక్షల మంది మహిళల చేతికి స్వంత ఇంటి స్థలమనే ఆస్తి అందబోతోంది. ఆ తర్వాత ఇళ్లకూ సహాయం సమకూరనున్నది.. ఆర్థికస్వావలంబనకు ఇవన్నీ బాటలు పరిచాయి.

రాజకీయంగానూ మహిళలకు సింహభాగం దక్కింది. మంత్రివర్గంలోనూ, మంచి పదవుల్లోనూ మహిళలకు స్థానం లభించింది. నామినేటెడ్‌ పదవుల్లోనూ, నామినేటెడ్‌ పనుల్లోనూ మహిళలకు 50శాతం రిజర్వేషన్‌ కల్పించారు. ఇందుకోసం ఏకంగా చట్టమే చేశారు. ఆలయాల పాలకమండళ్లనుంచి మార్కెట్‌ కమిటీల వరకు అన్నింటిలోనూ మహిళలు ముందువరుసలో కనిపిస్తున్నారు. సాధికారతకు ఇంతకన్నా సూచిక ఏముంటుంది.. 

‘దిశ’ చట్టం మహిళలకు భద్రతనిచ్చింది. ఒక్క బటన్‌ నొక్కి దుండగుల భరతం పడుతున్నారు. దేశమంతా ఇపుడు మన ‘దిశ’ వైపే చూస్తోంది. కుటుంబాలను ఛిద్రం చేసిన మద్యం మహమ్మారి ప్రభావం క్రమంగా తగ్గుతోంది. బెల్టుషాపులు పోయాయి. బార్లు తగ్గాయి. మద్యం తాగేవారు తగ్గుతున్నారు. తాగడమూ తగ్గుతోంది. కుటుంబాలలో ప్రశాంతత నెలకొంటోంది. సామాజికంగా చోటుచేసుకుంటున్న పెనుమార్పునకు ఇదో సంకేతం. 

మరిన్ని వార్తలు