ఆక్వా ఉత్పత్తులకు ముందే ధరల నిర్ణయం

29 Mar, 2020 04:17 IST|Sakshi
అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న మంత్రి మోపిదేవి వెంకటరమణారావు

మంత్రి మోపిదేవి వెల్లడి

దేశంలో మొదటిసారి ఈ తరహా నిర్ణయం తీసుకున్న సీఎం జగన్‌

పాడి, ఆక్వా, పౌల్ట్రీ రైతులకు గిట్టుబాటు ధరలు

రైతులకు నష్టం కలిగించే దళారులపై క్రిమినల్‌ కేసులు

సాక్షి, అమరావతి: ఆక్వా రైతులకు ఎటువంటి నష్టం కలగకుండా ఆ ఉత్పత్తులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందుగానే కొనుగోలు ధరలను నిర్ణయించారని రాష్ట్ర పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు తెలిపారు. వీటి ధరల్లో హెచ్చుతగ్గులున్నప్పటికీ రైతులకు లబ్ధి చేకూర్చేందుకు ముఖ్యమంత్రి వీటి ధరలను ప్రకటించారని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఈ తరహా నిర్ణయం తీసుకోలేదని, ఇదే మొదటిసారని వెల్లడించారు. ఆక్వా, పౌల్ట్రీ, పాడి రంగాలపై తీసుకున్న నిర్ణయాలను శనివారం సచివాలయంలో విలేకరులకు వెల్లడించారు. సమీక్షలో వ్యవసాయశాఖ చీఫ్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య, మత్స్యశాఖ కమిషనర్‌ సోమశేఖర్, ఎంపెడా జాయింట్‌ డైరెక్టర్‌ విజయకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

మంత్రి మోపిదేవి తెలిపిన వివరాలివీ.. 
- ఈనెల 14 వరకు ఆక్వా ఉత్పత్తుల ధరలు స్థిరంగా ఉండేలా చర్యలు తీసుకున్నాం. 
- కరోనా వైరస్‌ కారణంగా ఆక్వా, పౌల్ట్రీ రైతులు ఇబ్బందులు పడుతున్నారు.  
- రాష్ట్రంలోని మొత్తం ఆక్వా ఉత్పత్తుల్లో 90 శాతం అమెరికా, చైనా, యూరోపియన్‌ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. 
- రాష్ట్రానికి అధిక ఆదాయాన్ని కలిగిస్తున్న ఈ రంగ రైతులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకున్నాం. 
- ఎగుమతులకు ఆటంకం కలగకుండా చూస్తాం. ఐదారు రోజులుగా ఆక్వా రైతులు, వ్యాపారులు, ఎగుమతిదారులతో సమీక్షిస్తున్నాం. 
- కరోనాతో సంబంధం లేకుండా ఆక్వా ఉత్పత్తుల కొనుగోలుకు ముందుకు వచ్చిన ఎగుమతిదారులను సీఎం అభినందించారు. 
- కరోనా పేరు చెప్పి దళారులు రైతుల్ని మోసం చేసేందుకు ప్రయత్నిస్తే వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం. దుకాణాల లైసెన్సులు రద్దు చేస్తాం. వీరిపై చర్యలు తీసుకునే అధికారాన్ని ఎంపెడాకు అప్పగిస్తున్నాం. 
- ఆక్వా, మత్స్య ఉత్పత్తులకు సంబంధించిన ఎక్స్‌పోర్టు ఇన్‌స్పెక్షన్‌ అథారిటీ నుంచి క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ అందించే ఏర్పాటు చేస్తున్నాం. 
- మత్స్యశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ను ప్రతీ జిల్లాకు నోడల్‌ అధికారిగా నియమించాం. 
- విదేశాల నుంచి మేత తయారీకి సంబంధించిన ముడిపదార్థాల దిగుమతికి వీరు సహకరిస్తారు. 
- చికెన్, గుడ్లు మార్కెట్‌ల్లో అమ్ముకోడానికి రవాణాకు అన్ని చర్యలు తీసుకున్నాం. 
- సీఎం సహాయ నిధికి పౌల్ట్రీ రంగం రూ.60 లక్షలు అందజేసింది. 

మరిన్ని వార్తలు