ఇంటి దీపానికి ఇం‘ధనం’

28 Mar, 2019 12:11 IST|Sakshi

సాక్షి, గుంటూరు :  ఇంటి బాధ్యత భర్తదైనా భారం మోసేది మాత్రం ఇల్లాలే.. కుటుంబ అవసరాలకు ప్రణాళిక వేసుకుంటూ .. వచ్చే ఆదాయానికి లెక్కలు కట్టుకుంటూ బతుకు నావ నడిపిస్తుంది. పిల్లల చదువులు, వారి ఫీజులు.. ఇవిగాక అనుకోకుండా వచ్చే అనారోగ్య సమస్యలు..ఇలా అనేక రకాల ఖర్చులను ఎదుర్కొంటూ.. అందరి బాధలను తన కన్నీటి పొర మాటున దాచేదే ఇల్లాలు. ఇలాంటి ఆడపడుచుల చేతిలో కాస్తంత ఆర్థిక ఆసరా ఉంటే ఆ కుటుంబానికి ఇంధనం దొరికినట్టే. ఆ ఇల్లాలి మోములో చిరునవ్వు పూసినట్టే.. తెలుగుదేశం ప్రభుత్వంలో డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేశారు.

వితంతు, వృద్ధాప్య పింఛన్లను పచ్చ చొక్కాల బాట పట్టించారు. అర్హులకు మాత్రం ఒట్టి చేతులు చూపారు. ఇవన్నీ తన పాదయాత్రలో కళ్లారా చూసిన వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చలించిపోయారు. అక్కాచెల్లెమ్మలకు చేయూతనిచ్చేందుకు నిశ్చయించుకున్నారు. 45 ఏళ్లు నిండిన మహిళలకు నాలుగేళ్లలో 75 వేల రూపాయలు అందిస్తానని ప్రకటించారు. జగన్‌ నిర్ణయం పట్ల మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ చేతిలో ఆర్థిక వెసులుబాటు ఉంటే కుటుంబం లోగిళ్లలో సంతోషాలు నిండుతాయని చెబుతున్నారు.   

ఆత్మస్థైర్యం పెరిగింది
పొదుపు గ్రూపు మహిళలను చంద్రబాబు నిలువునా మోసం చేశారు. రుణాలను మాఫీ చేస్తామని చెప్పి వడ్డీలను కూడా మాఫీ చేయలేదు. దీంతో బ్యాంకుల్లో వడ్డీలు పెరిగి తిరిగి రుణాలివ్వడం లేదు. బయట అధిక వడ్డీలకు తెచ్చి అప్పుల్లో కూరుకుపోతున్నాం. ఈ క్రమంలో 45 ఏళ్లు నిండిన వెనుకబడిన వర్గాల మహిళలకు రూ.75 వేలు సాయం అందిస్తామనడం సంతోషంగా ఉంది.
–మేకల అమరకుమారి, త్యాళ్లూరు

ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి
గడిచిన ఐదేళ్లుగా ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఎన్నికలకు ముందు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని ప్రకటించడంతో మాఫీ అవుతాయని ఆశపడ్డాం. ఆ తర్వాత తెలిసింది.. మోసపోయామని. ప్రస్తుత తరుణంలో మహిళలకు ఆర్థిక భరోసా అవసరం. వైఎస్సార్‌ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించినట్లు రూ.75 వేలు అందితే మాకెంతో ఉపయోగపడతాయి.
– వేల్పుల మీరాభి, బాపట్లటౌన్‌

>
మరిన్ని వార్తలు