మూడు కూరలతో రెండే పుల్కాలు

16 Nov, 2017 05:38 IST|Sakshi

పాదయాత్రలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ రోజువారీ ఆహారం 

ఉదయం అల్పాహారంగా గ్లాసు పండ్ల రసమే  

వ్యాయామం, పత్రికా పఠనంతో దినచర్య ఆరంభం 

పార్టీ నేతలతో భేటీ.. తర్వాత పాదయాత్రకు ఉపక్రమణ

ప్రజాసంకల్పం పాదయాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి  : విసుగు, విరామం లేకుండా.. అలుపెరగకుండా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్ర అప్రతిహతంగా కొనసాగుతోంది. దారిపొడవునా సామాన్యుల గుండె చప్పుళ్లు వింటూ.. జనంతో మమేకమవుతూ పేటలు, గ్రామాలు దాటుతున్నారు. పాదయాత్ర చేపట్టిన నాటి నుంచి జగన్‌ దినచర్య తెల్లవారు జాము 4.30 గంటల నుంచే ప్రారంభమవుతుంది. గంట వ్యాయామం తర్వాత.. పత్రికా పఠనం.. అనంతరం ముఖ్యులతో ఫోన్‌ సంభాషణ.. తర్వాత ఉదయం 6.00 – 6.30 గంటలకే సిద్ధమై పార్టీ ప్రముఖులు, ఇతర ముఖ్యులతో భేటీ అవుతారు. ఆ రోజు సాగే పాదయాత్ర మార్గం గురించి చర్చిస్తారు. నిర్ణయించిన కార్యక్రమం ప్రకారం పాదయాత్రను ప్రారంభిస్తున్నారు. క్షణం ఆలస్యం చేయకుండా ప్రజలతో మమేకం కావడమే లక్ష్యంగా ఆయన ముందుకు సాగుతున్నారు. ఉదయం అల్పాహారంగా కేవలం గ్లాస్‌ జ్యూస్‌ మాత్రమే తీసుకుంటున్నారు. రాత్రి ఎన్ని గంటలకు నిద్రకు ఉపక్రమించినా ఎట్టిపరిస్థితుల్లో ఉదయం 8 – 8.10 గంటలకల్లా ఆయన తన టెంట్‌ నుంచి బయటకు వస్తారు. అప్పటికే బయట గుమికూడిన ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడతారు. పాదయాత్రలో వివిధ వర్గాల ప్రజల సమస్యలను ఓపికగా వింటున్నారు. వారితో ఆత్మీయంగా మెలుగుతూ ఆదరాభిమానాలు చూపడంలో ఆయనకు ఆయనే సాటి. 

ముకుళిత హస్తాలు.. జన నేస్తాలు... 
తెల్లటి చొక్కా, క్రీమ్‌ కలర్‌ ప్యాంట్, కాళ్లకు బూట్లతో రహదారిపై నడుస్తూ ముకుళిత హస్తాలతో నమస్కరిస్తూ జగన్‌ యాత్ర సాగిస్తున్నారు. జనం ఎదురేగి చేసే అభివాదాలకు ప్రత్యాభివాదాలు, నమస్కారాలకు ప్రతి నమస్కారాలు, ప్రేమ, ఆప్యాయతలు పంచుతూ.. జనం చెప్పే సమస్యలు వింటూ.. సలహాలు తీసుకుంటూ యాత్రను కొనసాగిస్తున్నారు. అడుగడుగునా ఉప్పొంగే జనాభిమానం ఎదుట ఆకలిదప్పులు ఆయనకు ఓ లెక్కగా అనిపించవేమోననిపిస్తుంది. మధ్యాహ్న భోజన సమయం మించిపోతున్నా తన కోసం వచ్చిన వారందర్నీ ఓపిగ్గా పలకరించాకే ఆయన భోజనానికి వెళతారు. అంత చేసినా ఆయన మధ్యాహ్న భోజనంలో తీసుకునేది ఒకే ఒక పుల్కా, పప్పు, మూడు కూరలు మాత్రమే. నిర్వాహకులు భోజన విరామానికీ, విశ్రాంతికీ సమయం కేటాయించినా గత ఎనిమిది రోజుల్లో ఎన్నడూ ఆయన విశ్రమించిన దాఖలాల్లేవు. 

అలా నడుం వాల్చగానే  పదండి.. పదండి.. చాలా దూరం పోవాల్సి ఉంది.. అంటూ బయటకు వచ్చి సహాయకులను అప్రమత్తం చేయడం గమనార్హం. గమ్యం చేరే వరకూ విరామం లేదు మనకు.. అంటే ఇదేనేమో అనిపిస్తుంది. కదం తొక్కుతూ పదం పాడుతూ ముందడుగు వేస్తున్న జన వాహినితో మమేకానికే ఆయన అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆ రోజుకు యాత్ర ఎక్కడ ముగించాలో అక్కడికి చేరేలోగా సాధ్యమైనంత ఎక్కువ మందిని కలవడం, వాళ్ల సమస్యలు వినడమే లక్ష్యంగా యాత్ర కొనసాగుతోంది. రాత్రి 7.30 – 9 గంటల మధ్య ఎప్పుడు తన యాత్రను ముగించినా ఆ తర్వాత సైతం ముఖ్యులతో, పార్టీ సీనియర్‌ నేతలతో భేటీ అవుతున్నారు. ఇక రాత్రి పూట భోజనం ఒక పుల్కా, కొంచెం ఎగ్‌ బుర్జీ, పప్పు, మరో కూరతో ముగిస్తారు. నిద్రకు ఉపక్రమించే ముందు ఒక కప్పు పాలు తాగుతారు.   

>
మరిన్ని వార్తలు