వలస కూలీలపై మానవతా దృక్పథం

14 May, 2020 17:07 IST|Sakshi

‘లాక్‌డౌన్‌ ఎగ్జిట్’ వ్యూహంపై కీలక నిర్ణయాలు

వలస కూలీలపై మానవతా దృక్పథం

ఈ నెల 30న రైతు భరోసా కేంద్రాలు ప్రారంభం 

సాక్షి, అమరావతి : లాక్‌డౌన్‌ ఎగ్జిట్ ప్రక్రియలో అనుసరించాల్సిన వ్యూహంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కోవిడ్‌ –19 నివారణా చర్యలు, రైతు భరోసా కేంద్రాలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మంత్రి మోపిదేవి వెంకటరమణ సహా సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి హాజరు అయ్యారు. ఈ సందర్భంగా కంటైన్‌మెంట్‌ క్లస్టర్లలో అనుసరించాల్సిన ఎగ్జిట్‌ వ్యూహంపై సీఎంకు...అధికారులు ప్రతిపాదనలు వివరించారు. వలస కూలీలకు ఆకలి బాధలు లేకుండా భోజనం, తాగునీరు సదుపాయాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని, నడుచుకుంటూ వెళ్తున్న వారిని గుర్తించి స్వస్థలాలకు పంపించడంపై ఆలోచన చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఇక లాక్‌డౌన్‌ ఎగ్జిట్‌ ప్లాన్‌లో భాగంగా థియేటర్లు, సినిమా హాళ్లు, రెస్టారెంట్లు, ప్రజా రవాణా, విద్యా సంస్థలు..వీటిలో కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ కార్యకలాపాలు ఎలా కొనసాగించాలో నిర్దిష్ట విధానాలు (ఎస్‌ఓపీ) సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. వీటిపై ప్రణాళికను అందించాలని సూచించారు. (కరోనా నివారణ చర్యలపై వైఎస్ జగన్ సమీక్ష)

ఆంక్షలు కఠినంగా కొనసాగింపు..
ఇప్పటి వరకూ రాష్ట్రంలో 290 కంటైన్‌మెంట్‌ క్లస్టర్లు ఉండగా, వీటిలో 75 క్లస్టర్లలో 28 రోజులుగా కొత్త కేసులు నమోదు కాలేదు. వాటిని డీ నోటిఫై చేసి సాధారణ కార్యకలాపాలకు అనుమతివ్వాలని సమావేశంలో నిర్ణయించారు. కేసుల సంఖ్య, విస్తరణ అధికంగా ఉన్న 22 క్లస్టర్లలో 500 మీటర్లుల కంటైన్‌మెంట్‌ ఏరియా, 500 మీటర్ల బఫర్‌ కలుపుకుని 1 కిలోమీటర్‌ పరిధిలో కంటైన్‌మెంట్‌ ఆపరేషన్స్‌తో పాటు ఇక్కడ ఆంక్షలు కఠినంగా కొనసాగించాలని సీఎం​ జగన్‌ ఆదేశించారు. (ప్రతి మూడు వారాలకు ఆరోగ్య శ్రీ బిల్లులు)

మరొక 103 క్లస్టర్లలో (10, అంత కంటే తక్కువ కేసులు నమోదైన ప్రాంతాలు) 200 మీటర్లు మేర కంటైన్‌మెంట్, 200 మీటర్ల బఫర్‌ ఏరియాలు ఉండగా, ఇక్కడ కూడా ఆపరేషన్స్‌ కొనసాగనున్నాయి. 90 డార్మంట్‌ క్లస్టర్లలో (గడచిన 14 రోజుల్లో కేసులు నమోదు కాని ప్రాంతాలు) 200 మీటర్ల కంటైన్‌మెంట్‌ ఏరియా అమలు కానుంది. కొత్తగా కేసులు రాని పక్షంలో మే 31 తర్వాత ఆ క్లస్టర్లలో సాధారణ కార్యకలాపాలకు అనుమతిస్తారు. (అప్పుడే సాధారణ పరిస్థితులు: ప్రధానితో సీఎం జగన్)

36 పాజిటివ్‌ కేసులు నమోదు
రాష్ట్రంలో ఉదయం 9 గంటలవరకూ 36 పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. ఇవే కాకుండా వివిధ రాష్ట్రాలనుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో మరో 32 కేసులు నమోదు అయ్యాయన్నారు. ముంబై నుంచి వచ్చిన వారికి 29, ఒడిశా–2, బెంగాల్‌ –1 కేసులుగా నమోదు అయ్యాయన్నారు. ముంబై నుంచి అనంతపురం వచ్చిన వారికి అలాగే, మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్లలో పాజిటివ్‌ కేసులు అధికంగా ఉంటున్నాయన్నారు.

వలస కూలీలపై మానవతా దృక్పథం
ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించి, రాష్ట్రం మీదుగా ఒడిశా, జార్ఖండ్, బిహార్‌ లాంటి రాష్ట్రాలకు సుదీర్ఘ దూరం నడుచుకుంటూ వెళ్తున్న కూలీలు, ఘటనలపై సమీక్షా సమావేశంలో సీఎం జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. చాలామంది అవగాహన లేక శ్రామిక రైళ్ల కోసం నిరీక్షించలేక నడుచుకుంటూ వెళ్తున్నారని, వ్యవస్థీకృతంగా ఉంటే కనుక ఆయా రాష్ట్రాలతో మాట్లాడి పంపించడానికి అవకాశం ఉంటుందని అధికారులు వెల్లడించారు. చెక్‌ పోస్టుల వద్ద గుర్తించిన పక్కనే ఉన్న సహాయ కేంద్రాలకు పంపిస్తున్నట్లు తెలిపారు. అయినా సరే.. కొంతమంది రోడ్ల వెంట నడుచుకుంటూ వచ్చేస్తున్నారని సీఎం దృష్టికి తెచ్చారు. అయితే అలాంటి వారిని వాళ్ల స్వస్థలాలకు పంపడంపై ఆలోచన చేయాలని ముఖ్యమంత్రి జగన్‌ అధికారులను ఆదేశించారు. వారికి ఆకలి బాధలు లేకుండా భోజనం, తాగునీరు సదుపాయాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని సూచించారు. నిర్దిష్ట దూరంలో భోజనం, తాగునీరు వారికి అందించేలా చూడాలన్నారు. (వలస వెతలు: కంటతడి పెట్టించే వీడియోలు)

జూలై 1 నాటికి ప్రతి పీహెచ్‌సీకీ ఒక బైక్‌
టెలీ మెడిడిసిన్‌ను మరింత పటిష్టంచేసే చర్యల్లో భాగంగా ప్రతి పీహెచ్‌సీకి ఒక బైక్‌ను జులై 1 నాటికి అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. అదే రోజు 108,104 అంబులెన్స్‌లు 1060 ప్రారంభంతో పాటుగా  బైక్‌ సర్వీసులు కూడా ప్రారంభం కానున్నాయి. టెలిమెడిసిన్‌ ద్వారా ప్రిస్కిప్షన్‌ ప్రకారం మందులు డోర్‌ డెలివరీ చేయడానికే బైక్‌ల వినియోగించనున్నారు.

సీఎం యాప్‌
ఈనెల 30వ తేదీన రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించే నాటికి మార్కెట్‌ ఇంటెలిజెన్స్, ప్రొక్యూర్‌మెంట్‌ కోసం ఉద్దేశించిన యాప్‌ అందుబాటులోకి రావాలని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. దీనిపై కొత్తగా నియమించిన జేసీలకు శిక్షణ ఇస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. (వైరల్ వీడియో: ఇదీ మన ఆకలి భారతం)

మరిన్ని వార్తలు