రైతు బజార్లను వికేంద్రీకరించాలి : సీఎం జగన్‌

25 Mar, 2020 13:33 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి : రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమలుపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, ప్రభుత్వ సలహాదారులు అజేయ కల్లాం, సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, వైద్య ఆరోగ్యశాఖ, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సామాజిక దూరం పాటిస్తూ ఈ సమావేశం సాగింది. ఈ సందర్భంగా లాక్‌డౌన్‌ వల్ల నిత్యావసరాల కోసం ప్రజలు ఒకే సమయంలో పెద్ద ఎత్తున గుమిగూడటంపై చర్చించారు. కరోనా నివారణకు సామాజిక దూరం పాటించాలన్న ఉద్దేశం దీనివల్ల దెబ్బతింటోందని అభిప్రాయపడ్డారు.

ఈ నేపథ్యంలో నగరాలు, పట్టణాల్లో రైతు బజార్లను పెద్ద ఎత్తున వికేంద్రీకరించాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. ఒకేచోట కాకుండా నగరాలు, పట్టణాల్లో ప్రాంతాల వారీగా కూరగాయలు అమ్మేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే నిత్యావసరాల దుకాణాల వద్ద కూడా ప్రజలు దూరం దూరంగా నిలబడేలా మార్కింగ్‌ చేయాలని అధికారులకు సూచించారు. ప్రజలు నిత్యావసరాలకోసమే బయటకు రావాలని కోరారు. ఎవరూ కూడా 2 నుంచి 3 కి.మీ పరిధిదాటి రాకూడదని సూచించారు. ప్రజలు కూరగాయలు, నిత్యావసరాలు వీలైనంత త్వరగా తీసుకోవాలన్నారు. అంతవరకు ఉదయం 6 గంటలనుంచి మధ్యాహ్నం 1 గంటవరకూ షాప్‌లను అనుమతించాలని నిర్ణయించారు. 

ఎక్కువ ధరలకు అమ్మితే ఫిర్యాదు చేయండి.. 
పాలు లాంటి నిత్యావసరాలను వీలైనంత ఎక్కువ ప్రాంతాల్లో అందుబాటులో ఉంచాలని సీఎం వైఎస్‌ జగన్‌ చెప్పారు. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. 144 సెక్షన్‌ రోజంతా అమల్లో ఉంచాలన్నారు. సప్లై చైన్‌ దెబ్బతినకుండా గూడ్స్‌ వాహనాలు, నిత్యావసరాలు తీసుకొచ్చే వాహనాల రాకపోకలకు అనుమతివ్వాలని నిర్ణయించారు. కూరగాయలు, నిత్యావసర వస్తువుల రేట్లను కలెక్టర్లు ఆయా జిల్లాల వారీగా టీవీలు, పేపర్లలో ప్రకటించాలని ఆదేశించారు. ఎవరైనా ఎక్కువ ధరలకు విక్రయిస్తే... 1902 కాల్‌ సెంటర్‌కు కాల్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. కాల్‌సెంటర్‌లో ఒక సీనియర్‌ అధికారిని పెట్టి.. ఫిర్యాదు వచ్చిన వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే నిల్వచేయలేని పంటల ఉత్పత్తుల విషయంలో అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలకు నిత్యావసరాలు అందించడంలో కీలక పాత్ర పోసిస్తున్న హమాలీలకు రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూడాలని సీఎం అధికారులకు సూచించారు. 

మరిన్ని వార్తలు