బీసీలకు 10 % అదనం

8 Mar, 2020 05:29 IST|Sakshi

సీఎం వైఎస్‌ జగన్‌ చరిత్రాత్మక నిర్ణయం

 బీసీలకు 34 శాతం సీట్లు దక్కేలా టికెట్లు

టీడీపీ కుయుక్తుల వల్ల 34 నుంచి 24 శాతానికి తగ్గిపోయిన రిజర్వేషన్లు

ఆ మేరకు తగ్గిపోయిన 10 శాతం పార్టీ ద్వారా భర్తీ చేయాలని సీఎం నిర్ణయం

సర్పంచ్‌ మొదలు జెడ్పీ చైర్‌పర్సన్‌ వరకు బీసీలకు లబ్ధి కలిగేలా కార్యాచరణ

సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 శాతం రిజర్వేషన్లు నష్టపోవడం వల్ల బీసీలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగకూడదని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గట్టి నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ కుయుక్తుల కారణంగా బీసీలు నష్టపోతున్న 10 శాతం రిజర్వేషన్లను పార్టీ పరంగా భర్తీ చేయాలని  చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. బీసీలకు కనీసం 34 శాతం మేర సీట్లు దక్కేలా జనరల్‌ స్థానాల్లోనూ బీసీ అభ్యర్థులను నిలపాలని మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులకు ఆదేశాలు జారీ చేశారు.

టీడీపీ కుయుక్తుల కారణంగా రిజర్వేషన్లు 59.85 శాతం నుంచి 50 శాతానికి తగ్గిన విషయం విదితమే. ఫలితంగా బీసీలు 9.85 శాతం రిజర్వేషన్లు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో.. బీసీల రిజర్వేషన్లు 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో పార్టీ పరంగా గ్రామ పంచాయతీ సర్పంచ్‌ మొదలు జెడ్పీ చైర్‌పర్సన్‌ స్థానం వరకు.. మున్సిపల్‌ వార్డు సభ్యుడి నుంచి కార్పొరేషన్‌ మేయర్‌ వరకు.. అన్ని స్థానాల్లోనూ బీసీలకు రిజర్వేషన్‌ పరంగా దక్కే సీట్ల కంటే.. కనీసం 10 శాతం అదనంగా పార్టీ టికెట్లు ఇచ్చి గెలిపించాలని ముఖ్యమంత్రి జగన్‌ సూచించారు. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయాన్ని పార్టీ బీసీ విభాగం అధ్యక్షుడు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ఎమ్మెల్యే జోగి రమేష్, పార్టీ నాయకుడు దాడి వీరభద్రరావు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వేర్వేరుగా వెల్లడించారు.

ఎవరీ ప్రతాప్‌రెడ్డి?
బిర్రు ప్రతాప్‌రెడ్డిని గత టీడీపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకం స్టేట్‌ కౌన్సిల్‌ సభ్యుడిగా నియమిస్తూ 2019 మార్చి 9న (పంచాయతీ రాజ్‌ శాఖ) ఉత్తర్వులు ఇచ్చింది. అప్పుడు పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిగా చంద్రబాబు కుమారుడు లోకేష్‌ ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌ అధ్యక్షుడిగా ఉన్న పంచాయతీరాజ్‌ చాంబర్‌కు ప్రతాపరెడ్డి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.

శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నం
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ప్రతిసారీ వివాదం కావడం.. గరిష్ట పరిమితిపై ప్రతిసారి న్యాయపరమైన అవరోధాలు ఎదురవుతుండటంతో ఈ అంశంపై శాశ్వత పరిష్కారం కనుక్కోవాలని వైఎస్‌ జగన్‌ దృష్టి సారించారు. రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా 2019 మార్చిలో వైఎస్‌ జగన్‌ సూచనతో స్థానిక సంస్థల్లో బీసీలకు గరిష్ట రిజర్వేషన్లు కల్పించే విధంగా పార్లమెంటులో వైఎస్సార్‌సీసీ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రయివేటు మెంబర్‌ బిల్లు ప్రవేశపెట్టడం తెలిసిందే. 

సాహసోపేత నిర్ణయం
- రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు 34 శాతం కంటే తగ్గకూడదనే ఉద్దేశంతో మొత్తం రిజర్వేషన్లు 59.85 శాతం ఉండాలని ముఖ్యమంత్రి జగన్‌ నిర్ణయించారు. ఈ మేరకు 2019 డిసెంబర్‌లో మంత్రివర్గం తీర్మానం చేసింది. 
- అందుకు అనుగుణంగా హైకోర్టు అనుమతితో ఎన్నికల నిర్వహణకు సిద్ధమైంది. సంక్రాంతి తర్వాత ఎన్నికల నోటిఫికేషన్‌కు ప్రభుత్వం సన్నద్ధమయింది.
- అదే సమయంలో టీడీపీ కుయుక్తులు మొదలుపెట్టింది. టీడీపీ నేత బిర్రు ప్రతాప్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై సుప్రీంకోర్టుకు వెళ్లారు. రిజర్వేషన్లపై హైకోర్టులో తేల్చుకోవాలని, నెల రోజుల్లో విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. టీడీపీ నేత పిటీషన్‌ కారణంగా సుప్రీంకోర్టు నుంచి వచ్చిన సూచన మేరకు.. 59.85 శాతం రిజర్వేషన్ల మీద హైకోర్టు విచారణ చేపట్టింది.
- సుప్రీం తీర్పు మేరకు రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదంటూ ఈ నెల 2న హైకోర్టు తీర్పిచ్చింది. దీంతో 9.85 శాతం మేర బీసీలు రిజర్వేషన్లు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. అన్ని రాష్ట్రాలు ఒక్కొక్కటిగా తమ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లు తగ్గించుకుంటూ పోతున్నా, రాష్ట్రంలో మాత్రం ఆ మేర పార్టీ పరంగా టికెట్లు కేటాయించాలని వైఎస్‌ జగన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

మరిన్ని వార్తలు