బెల్టు షాపులపై కొరడా ఝుళిపించాలి : ఏపీ సీఎం

17 Jun, 2019 23:10 IST|Sakshi

దశల వారీగా మద్య నిషేధం అమలు చేయాల్సిందే 

కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో మద్యం విధానంపై అధ్యయనం 

ఎక్సైజ్‌ అధికారులకు సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశం

సాక్షి, అమరావతి: మద్యం బెల్టు షాపుల్ని నూటికి నూరు శాతం తొలగించాలని, అవసరమైతే కొరడా ఝళిపించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం బెల్టు షాపుల తొలగింపుపై ఎక్సైజ్‌ అధికారులతో సీఎం సమీక్షించారు. బెల్టు షాపులు నిర్వహించే మద్యం దుకాణదారుల లైసెన్సులు వెంటనే రద్దు చేయాలని ఆదేశాలిచ్చారు.

బెల్టు షాపుల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకునే దిశగా టాస్క్‌ఫోర్స్‌ రంగంలోకి దిగాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగానికి స్పష్టమైన ఆదేశాలిచ్చారు. కేరళ, తమిళనాడులో ప్రభుత్వాలే మద్యం షాపుల్ని నిర్వహించడం ద్వారా బెల్టు షాపుల్ని నియంత్రిస్తున్న విధానాన్ని అధ్యయనం చేసి త్వరితగతిన నివేదిక అందించాలని సూచించారు. మద్యం విధానం సమగ్రంగా, సమర్థవంతంగా అమలు చేయడానికి మిగతా రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలనూ క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు.

మద్య నిషేధం దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో బెల్టు షాపుల సమూల నిర్మూలన తొలి అడుగు అని, దశల వారీగా మద్య నిషేధం అమల్లోకి రావాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. అక్రమ మద్యం తయారు చేస్తున్న 190 గ్రామాలపై ఎక్సైజ్‌ అధికారులంతా దృష్టి సారించాలని, ఆ గ్రామాల్లో తయారీదారులు ప్రత్యామ్నాయ ఉపాధి వైపు దృష్టి సారించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.   

మరిన్ని వార్తలు