పులివెందుల అభివృద్ధిపై సీఎం జగన్‌ సమీక్ష

30 Oct, 2019 21:21 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి : పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు కడప పార్లమెంట్‌ సభ్యులు వైఎస్‌ అవినాష్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పులివెందులలో ప్రభుత్వ మెడికల్‌ కాలేజ్‌ ఏర్పాటుకు సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. డిసెంబర్‌లో ప్రభుత్వ మెడికల్‌ కాలేజ్‌ ఏర్పాటుకు శంకుస్థాపన చేయనున్నారు. 

అలాగే వేముల మండలం నల్లచెరువుపల్లిలో 132 కేవీ సబ్‌స్టేషన్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పులివెందుల నియోజకవర్గంలో 11 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పులివెందులు ఏరియా ఆస్పత్రి, వేంపల్లి సీహెచ్‌సీకి రూ. 30 కోట్లతో మౌలిక సౌకర్యాలు కల్పించాలని అన్నారు. అలాగే పులివెందుల మున్సిపాలిటీ అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, ఎస్టీపీకి రూ. 50 కోట్లతో డీపీఆర్‌ సిద్ధం చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. పులివెందులలో కొత్త ఫైర్‌ స్టేషన్‌ బిల్డింగ్‌, వేంపల్లిలో కొత్త ఫైర్‌ స్టేషన్‌ మంజూరు చేశారు. పులివెందులలో రూ. 17.65 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం డీపీఆర్‌ సిద్ధం చేయాలని ఆదేశించారు. నాడు-నేడు పథకం కింద పులివెందులలోని స్కూళ్ల  అభివృద్ది చేపట్టాలన్నారు. 

వేంపల్లిలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్‌ ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలు జారీ చేశారు. జేఎన్‌టీయూ కొత్త లెక్చరర్‌ కాంప్లెక్స్‌, నైపుణ్యాభివృద్ధి కేంద్రానికి రూ. 10 కోట్ల నిధులు విడుదల చేశారు. సింహాద్రిపురం, వేంపల్లి పాలిటెక్నిక్‌ కాలేజ్‌లకు రూ. 15 కోట్లతో మౌలిక వసతులు కల్పించాలని నిర్ణయించారు. పులివెందుల నియోజకవర్గంలో కొత్తగా 7 గోడౌన్లు, కోల్డ్‌ స్టోరేజ్‌ ఏర్పాటు చేయాలన్నారు. పులివెందుల శిల్పరామానికి అభివృద్ధి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. 

ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘూట్‌, గండి క్షేత్రం, గండికోట, ఒంటిమిట్ట, ఇతర పర్యాటక ప్రాంతాలను కలుపుతూ టూరిజం సర్క్యూట్‌ ఏర్పాటుకు ఆదేశాలు జారీచేశారు.  వేంపల్లిలో బీసీ బాలురు, బాలికల వసతి గృహం, ఎస్సీ బాలిక వసతి గృహం ఏర్పాటుపై అనుమతులు ఇవ్వాలన్నారు. జాతీయస్థాయి ప్రమాణాలతో కూడిన విద్యాసంస్థను ఏర్పాటుకు ఆదేశించిన సీఎం వైఎస్‌ జగన్‌.. ఇందుకోసం ప్రముఖ విద్యా సంస్థలను సంప్రదించాలని సూచించారు. పులివెందుల పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మాల్‌ కమ్‌ మల్టీప్లెక్స్‌ ఏర్పాటుపై పరిశీలన చేయాలన్నారు. 

మరిన్ని వార్తలు