దేశంలోనే ఆదర్శ ముఖ్యమంత్రి జగన్‌

22 Oct, 2019 05:01 IST|Sakshi

బీసీలకు అన్నింటా ప్రాధాన్యత కల్పించింది ఆయన ఒక్కరే

ఆంధ్రప్రదేశ్‌ ఉన్నతవిద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ ఈశ్వరయ్య

సాక్షి, తిరుపతి: దేశంలో ఏ ప్రభుత్వం.. ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా బీసీలకు అన్నింటా ప్రాధాన్యత కల్పించిన నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని ఆంధ్రప్రదేశ్‌ ఉన్నతవిద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ ఈశ్వరయ్య కొనియాడారు. దేశంలోనే ఆయన ఆదర్శ ముఖ్యమంత్రి అని ప్రశంసించారు. తిరుపతిలో ఆదివారం జస్టిస్‌ ఈశ్వరయ్య, బీసీ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ ఎ.శంకర్‌ నారాయణ, ప్రాథమిక విద్య, నియంత్రణ పర్యవేక్షణ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ రెడ్డి కాంతారావుకు ప్రశంస, అభినందన సన్మాన సభ జరిగింది. ఈ సందర్భంగా జస్టిస్‌ ఈశ్వరయ్య మాట్లాడుతూ దేశంలో అత్యధిక జనాభా కలిగిన బీసీలు ఏళ్ల తరబడి కులవృత్తులతో సామాజిక సేవ చేశారని.. వీరికి హక్కులు కల్పించడంలో మాత్రం ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే.. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కరే స్పందించారన్నారు.

ఎన్నికలకు ముందు బీసీలకు జరుగుతున్న అన్యాయాల గురించి ఆయనకు నివేదిక సమర్పించామన్నారు. దళితులు, బడుగు, బలహీనవర్గాల అభివృద్ధికి కృషి చేయడంతోపాటు వారికి హక్కులతోపాటు రాజకీయ అధికారంలో భాగస్వామ్యం కలి్పస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. అధికారం చేపట్టిన మూడు నెలలకే చరిత్రలో ఎవరూ చేయని విధంగా బీసీలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి వాటికి చట్టబద్ధత కూడా కల్పించిన ఏకైక సీఎం వైఎస్‌ జగన్‌ మాత్రమేనన్నారు. నామినేటెడ్‌ పనులు, పదవుల్లో 50 శాతం రిజర్వేషన్‌తోపాటు చట్టసభల్లో సముచిత స్థానం కల్పించి గౌరవించారన్నారు. పేద బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి ప్రాథమిక విద్య, వైద్యం అందించిన మహనీయుడు వైఎస్‌ జగన్‌ అని పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు