ఆశావర్కర్ల జీతాలు భారీగా పెంచిన ఏపీ సీఎం

3 Jun, 2019 15:44 IST|Sakshi

పదివేల రూపాయలకు పెంచుతూ నిర్ణయం

వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో వెల్లడి

పాదయాత్రలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం

సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని ఆశావర్కర్లకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీపి కబురు చెప్పారు. పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ వారి జీతాలను భారీగా పెంచారు. ఆశావర్కర్ల జీతాలను పదివేల రూపాయలకు పెంచుతున్నట్టు వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. వైద్య ఆరోగ్య శాఖపై  సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష చేపట్టిన వైఎస్‌ జగన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి నిర్ణయంతో ఆశావర్కర్ల జీతాలు భారీగా పెరిగినట్టయింది. ప్రస్తుతం మూడు వేల రూపాయల వేతనం అందుకుంటున్న ఆశావర్కర్లు.. ఇకపై పదివేల రూపాయల వేతనం అందుకోనున్నారు. గ్రామీణ స్థాయిలో ఆశావర్కర్ల ప్రాధాన్యతను గుర్తించిన ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రజాసంకల్పయాత్ర చేస్తున్నప్పుడు వైఎస్‌ జగన్‌ను కలిసిన ఆశావర్కర్లు తమ సమస్యలను వైఎస్‌ జగన్‌కు దృష్టికి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వారికి ఇచ్చిన హామీ మేరకు వైఎస్‌ జగన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు.

మరోవైపు రెండు గంటలపాటు సాగిన వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వైద్య రంగాన్ని మెరుగుపరచి ప్రతి పేదవారికి కూడా వైద్యం అందించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వైద్య, ఆరోగ్య శాఖలో అవినీతిని సహించేది లేదని, వైద్యశాఖను తానే ప్రత్యక్షంగా పర్యవేక్షించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అధికారులు అంతా బాధ్యతతో పనిచేసి ఇందుకు సంబంధించి 45 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. 

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
ఆశా వర్కర్లకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం జగన్

చదవండి : వైద్య శాఖను ప్రత్యక్షంగా పర్యవేక్షించనున్న సీఎం జగన్

మరిన్ని వార్తలు