పనులు పరుగెత్తాలి

29 Feb, 2020 04:34 IST|Sakshi
పోలవరం ప్రాజెక్టు వద్ద పనులను పరిశీలిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌. చిత్రంలో మంత్రులు, అధికారులు

2021 జూన్‌లో ఆయకట్టుకు నీరిచ్చేలా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాల్సిందే

అధికారులకు సీఎం వైఎస్‌ జగన్‌ దిశా నిర్దేశం

గోదావరి వరద రోజుల్లోనూ ఈసీఆర్‌ఎఫ్‌ పనులు కొనసాగేలా కార్యాచరణ 

గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకూడదు 

జూన్‌ నాటికి స్పిల్‌ వే, స్పిల్‌ చానల్, అప్రోచ్‌ చానల్‌.. 

ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లు పూర్తి కావాలి 

వరదొచ్చేలోగా నిర్వాసితులకు పునరావాసం కల్పించాలి

ఆయకట్టుకు నీటిని మళ్లించేలా కనెక్టివిటీలు..

కుడి, ఎడమ కాలువల పనులు పూర్తి చేయాలి 

డిజైన్‌ల ఆమోదం, కేంద్రంతో సంప్రదింపులకు ఢిల్లీలో ప్రత్యేక అధికారి

పోలవరం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: పోలవరం ప్రాజెక్టు పనులను 2021 జూన్‌ నాటికి పూర్తి చేసి.. కుడి, ఎడమ కాలువల ద్వారా ఆయకట్టుకు నీళ్లందించాల్సిందేనని జల వనరుల శాఖ అధికారులు, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిశా నిర్దేశం చేశారు. ఈ ఏడాది గోదావరికి వరదలు వచ్చేలోగా అంటే జూన్‌ నాటికి స్పిల్‌ వే, స్పిల్‌ చానల్‌.. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ పనులతోపాటు 41.15 మీటర్ల కాంటూర్‌ పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పించే పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన పోలవరం ప్రాజెక్టు స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్‌.. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లు.. జలవిద్యుదుత్పత్తి కేంద్రం పునాది పనులను హెలికాఫ్టర్‌ నుంచి ఏరియల్‌ సర్వే ద్వారా, అనంతరం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఆ తర్వాత అక్కడే మంత్రులు, అధికారులు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.  
పోలవరం ప్రాజెక్టు పనుల ప్రగతిపై అధికారులు, మంత్రులతో సమీక్షిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ 
 
సీజన్‌ పూర్తయ్యాక ఏం ఉపయోగం?  
పోలవరం ప్రాజెక్టు జలాశయం, కుడి, ఎడమ అనుసంధానాలు, కాలువల పనులు 2021 డిసెంబర్‌ నాటికి పూర్తి చేయడానికి రూపొందించుకున్న యాక్షన్‌ ప్లాన్‌ (కార్యాచరణ ప్రణాళిక) మేరకు పనులు చేస్తున్నామని పోలవరం సీఈ సుధాకర్‌బాబు వివరిస్తుండగా సీఎం వైఎస్‌ జగన్‌ జోక్యం చేసుకుని.. వరద నిలిచిపోయాక ప్రాజెక్టును పూర్తి చేస్తే ఎవరికి ఉపయోగమని ప్రశ్నించారు. 2021 జూన్‌ నాటికే పనులు పూర్తి చేసేలా యాక్షన్‌ ప్లాన్‌ను సవరించుకుని.. ఆ మేరకు పనులు పూర్తి చేసి.. ఆయకట్టుకు నీళ్లందించాల్సిందేనని స్పష్టం చేశారు.  

పోలవరం ప్రాజెక్ట్‌ ఏరియల్‌ వ్యూ 

అప్రోచ్‌ చానల్‌ తవ్వి లైనింగ్‌ పూర్తి చేయాలి 
గతంలో గోదావరి వరదను స్పిల్‌ వే మీదుగా మళ్లించడానికి అప్రోచ్‌ చానల్‌ తవ్వకం పనులు చేయకపోవడం వల్ల స్పిల్‌ చానల్‌ను పూడిక ముంచెత్తిందని, దీని వల్ల స్పిల్‌ చానల్‌లో ఎక్కడ లైనింగ్‌ చేశారో ఎక్కడ చేయలేదో గుర్తించడం కష్టంగా మారిందని సీఎం పేర్కొన్నారు. జూన్‌ నాటికి గోదావరి వరద ప్రవాహాన్ని స్పిల్‌ వే మీదుగా మళ్లించడానికి అప్రోచ్‌ చానల్‌ తవ్వడంతోపాటు వాటికి లైనింగ్‌ పనులు పూర్తి చేయాలన్నారు. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లో ఖాళీగా ఉంచిన ప్రదేశాలను భర్తీ చేసి పనులు పూర్తి చేయాలని సూచించారు. కాఫర్‌ డ్యామ్‌ల మధ్యన ఈసీఆర్‌ఎఫ్‌ నిర్మాణానికి అవసరమైన వైబ్రో కంపాక్షన్‌ పనులు పూర్తి చేయాలన్నారు. జూన్‌లో వరద వచ్చినా స్పిల్‌ వే మీదుగా మళ్లించి.. వరద రోజుల్లోనూ అంటే జూలై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్‌ నిర్విఘ్నంగా ఈసీఆర్‌ఎఫ్‌ పనులు కొనసాగించి గడువులోగా పనులు పూర్తి చేయొచ్చని దిశా నిర్దేశం చేశారు.  
 
అనుమతుల కోసం ప్రత్యేక అధికారి 
డిజైన్‌లను సకాలంలో ఆమోదిస్తే 2021 జూన్‌ కంటే ముందుగానే పోలవరం జలాశయం పనులను పూర్తి చేస్తామని మేఘా సంస్థ ఎండీ కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) నుంచి డిజైన్‌లను వేగంగా ఆమోదింపజేయడంతోపాటు పోలవరం పనులకు అవసరమైన అన్ని అనుమతులు ఎప్పటికప్పుడు తెచ్చుకోవడానికి ఢిల్లీలో రిటైర్డు ఈఎన్‌సీ వెంకటేశ్వరరావును ప్రత్యేక అధికారిగా నియమించాలని జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ను ఆదేశించారు. మార్చి 8న డ్యామ్‌ డిజైన్‌ రివ్యూ ప్యానల్‌ (డీడీఆర్‌పీ) సమావేశం ఉందని, పెండింగ్‌లో ఉన్న డిజైన్‌ల ఆమోదం ప్రక్రియ కొలిక్కి వస్తుందని ఆదిత్యనాథ్‌ దాస్‌ సీఎం వైఎస్‌ జగన్‌కు వివరించారు.  

నిర్వాసితులకు పునరావాసంపై దృష్టి  
స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్‌.. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ల పనులు పూర్తయితే 41.15 మీటర్ల కాంటూర్‌ పరిధిలోని ముంపు గ్రామాలను వరద ముంచెత్తుతుందని.. జూన్‌లోగా ఆ గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించడంపై ఇప్పటి నుంచే దృష్టి పెట్టాలని సహాయ, పునరావాస విభాగం కమిషనర్‌ బాబూరావు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల కలెక్టర్లను సీఎం ఆదేశించారు. 17 వేల కుటుంబాలకు పునరావాసం కల్పించే పనులను వేగవంతం చేశామని అధికారులు వివరించారు. దేవీపట్నం మండలంలోని ఆరు గ్రామాలను సైతం వరద తాకిడి దృష్ట్యా 41.15 మీటర్ల కాంటూర్‌ పరిధిలోకి తీసుకొచ్చామని చెప్పారు. 41.15 మీటర్ల కాంటూర్‌ పరిధిలో పోలవరం హెడ్‌ వర్క్స్‌ పనులు, పునరావాసం కల్పించడానికి ఏ మేరకు నిధులు అవసరమో చెప్పాలని అధికారులను సీఎం వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు. రూ.5,000 కోట్లు అవసరం అని అధికారులు వివరించారు. పునరావాస కాలనీలు, ఇళ్ల పనులు చేసిన కాంట్రాక్టర్లకు తక్షణమే రూ.200 కోట్లు చెల్లిస్తే పనులు మరింత వేగవంతమవుతాయని చెప్పారు. ఇందుకు సీఎం సానుకూలంగా స్పందించారు.  

 
కనెక్టివిటీలు, కాలువల పనులు పూర్తి చేయాలి 

పోలవరం హెడ్‌ వర్క్స్‌ పనులను 41.15 మీటర్ల కాంటూర్‌ పరిధిలో పూర్తి చేశాక.. గోదావరి జలాలను ఆయకట్టుకు మళ్లించడానికి అవసరమైన కనెక్టివిటీలు (అనుసంధానాలు).. కుడి, ఎడమ కాలువల పనులను పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. జలాశయం నుంచి కుడి, ఎడమ కాలువలకు నీటిని సరఫరా చేసే టన్నెళ్ల తవ్వకం పనులపై ఆరా తీశారు. జూన్‌ నాటికి కుడి కాలువకు నీళ్లందించే కనెక్టివిటీ పనులు, ఒక టన్నెల్‌ లైనింగ్‌ కూడా పూర్తి చేస్తామని అధికారులు  వివరించారు. జలాశయం నుంచి ఎడమ కాలువకు నీటిని సరఫరా చేసే కనెక్టివిటీల పనులు వేగంగా చేస్తున్నామని చెప్పారు. ఎడమ కనెక్టివిటీలో టన్నెల్‌తోపాటు కాలువ పనులు వేగంతం చేయాలని సీఎం సూచించారు. కాలువలకు గండ్లు పడే పరిస్థితి రాకుండా ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. 
ప్రాజెక్టు మ్యాప్‌ను పరిశీలిస్తున్న సీఎం జగన్‌ 

వైఎస్సార్‌ గేట్‌ వే 
స్పిల్‌ వే, ఈసీఆర్‌ఎఫ్‌ను అనుసంధానం చేసేలా డిజైన్‌తో బ్రిడ్జి నిర్మించాలని, తద్వారా నాలుగు వరుసల రహదారి అందుబాటులోకి వస్తుందని సీఎం చెప్పారు. ఈ బ్రిడ్జికి ‘వైఎస్సార్‌ గేట్‌ వే’గా పేరుపెట్టాలని ప్రతిపాదించారు. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎంలు పిల్లి సుభాష్‌ చంద్రబోస్, ఆళ్ల నాని, జలవనరుల శాఖ, మహిళా శిశుసంక్షేమ శాఖ, రవాణా.. సమాచార శాఖ, గృహ నిర్మాణ శాఖల మంత్రులు అనిల్‌కుమార్‌ యాదవ్, తానేటి వనిత, పేర్ని నాని, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఉభయగోదావరి జిల్లాల ప్రజా ప్రతినిధులు, సహాయ పునరావాస విభాగం(ఆర్‌ అండ్‌ ఆర్‌) ఇంజనీర్లు, మేఘా ఎండీ కృష్ణారెడ్డి, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు