నడిసంద్రంలో నావకు.. చిక్కింది ఓ చుక్కాని!

11 Apr, 2014 05:11 IST|Sakshi
నడిసంద్రంలో నావకు.. చిక్కింది ఓ చుక్కాని!

 వైపరీత్యాలే తప్ప.. ఓదార్పులు వారికి తెలియవు. శుష్క వాగ్దానాలిచ్చి.. వారి ఓట్లు దండుకోవడమే తప్ప వరాలమూట విప్పిన పార్టీలే లేవు. ఇక రాజకీయాధికారం ఎండమావే. ఎన్ని పార్టీలు వచ్చినా.. నేతలెందరు మారినా.. వారి బతుకుచిత్రం మారలేదు. అపార జలధిలో చుక్కాని లేని నావలా సాగుతున్న గంగపుత్రుల జీవితాలకు ఎట్టకేలకు జగన్ రూపంలో ఓ చుక్కాని లభించింది.
 
 రాజకీయాధికారంలో సముచిత స్థానంతోపాటు ఆ వర్గాన్ని ఎస్టీల్లో చేర్చడం ద్వారా బతుకు భద్రత కల్పిస్తామని భరోసా ఇచ్చింది.  తడారిపోయిన ఆ వర్గంలో ఆశల వెలుగు నింపుతోంది.

 
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : అట్టడుగున్న ఉన్న మత్స్యకార సామాజిక వర్గానికి వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పెద్దపీట వేశారు. జిల్లాతోపాటు ఉత్తరాంధ్రలో అత్యధిక జనాభా ఉన్న ఆ సామాజికవర్గానికి చట్టసభల్లో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు జిల్లాకు చెందిన మత్స్యకార ప్రతినిధికి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని స్పష్టం చేశారు. పలాస సిటింగ్ ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులకే ఆ అవకాశం కల్పిస్తామని కూడా నిర్ధారించారు. తనను కలిసిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుతో జిల్లా రాజకీయాలపై చర్చిస్తూ జగన్‌మోహన్‌రెడ్డి ఈ మేరకు స్పష్టమైన హామీ ఇచ్చారు.
 
 తొలి నుంచీ ఆ వర్గానికి పెద్దపీట

 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి జగన్‌మోహన్‌రెడ్డి మత్స్యకార సామాజికవర్గానికి ప్రాధాన్యం కల్పిస్తూనే ఉన్నారు.  కాకినాడకు చెందిన మత్స్యకార నేత వెంకటరమణను పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయక కమిటీ అయిన  కేంద్ర పాలకమండలి సభ్యుడిగా నియమించారు. 2012లో నరసన్నపేట, విశాఖ జిల్లా పాయకరావు పేట ఉప ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లా నుంచి మత్స్యకారుడిని అసెంబ్లీకి పంపిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారమే ఆ వర్గానికి చెందిన కోలా గురువులును విశాఖ దక్షిణ నియోజకవర్గ అభ్యర్థిగా నిర్ణయించారు.
 
అదే రీతిలో శ్రీకాకుళం జిల్లా నుంచి మరో మత్స్యకార నేతను చట్టసభకు పంపాలని భావించారు. రాష్ట్రంలోనే పొడవైన తీరప్రాంతం ఈ జిల్లాలో ఉండటమే దీనికి కారణం.  కాగా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఖరారు సమయానికి తగిన మత్స్యకార నేత అందుబాటులో లేకపోయారు. దాంతో పలాస నియోజకవర్గం సమన్వయకర్తగా పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్న  వజ్జ బాబూరావుకు అవకాశం కల్పించారు. కానీ మత్స్యకార వర్గానికి చెందిన నేతను చట్టసభకు పంపించాలన్న ఆలోచనను మాత్రం ఆయన వీడలేదు.
 
జగన్నాయకులుకు ఎమ్మెల్సీ హామీ

జిల్లాలో తాజా రాజకీయ పరిణామాల్లో భాగంగా మత్స్యకార వర్గానికి చెందిన పలాస ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు వైఎస్సార్ సీపీలో చేరారు. అయితే అప్పటికే వజ్జ బాబురావును సమన్వయకర్తగా నియమించినందున జగన్నాయకులుకు అవకాశం లేకుండాపోయింది. కానీ ఆ వర్గానికి గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశంతో  జగన్నాయకులు విషయాన్ని జగన్ సానుకూల దృక్పథంతో పరిశీలించారు. చివరికి పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయ న్ను ఎమ్మెల్సీగా నియమించాలని నిర్ణయించారు.
 
తనను కలిసిన  మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుతో జిల్లా రాజకీయాలపై చర్చ సందర్భంగా ఈ మేరకు హామీ కూడా ఇచ్చారు. జగన్నాయకులు పార్టీ బాధ్యతలు తీసుకొని రానున్న ఎన్నికల్లో  పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని సూచించారు. ఎన్నికల తరువాత ఆయన్ను ఎమ్మెల్సీగా నియమిస్తామని ధర్మానతో చెప్పారు.
 
వరాల  మీద వరాలు

మత్స్యకార సామాజిక వర్గంపై జగన్ వరాల మీద వరాలు కురిపిస్తున్నారు. ఇప్పటికే విశాఖ జిల్లా నుంచి ఒకర్ని ఎమ్మెల్యే అభ్యర్థిగా నిర్ణయించారు. తాజాగా జిల్లాకు చెందిన జగన్నాయకులును ఎమ్మెల్సీగా నియమిస్తామని హామీ ఇచ్చారు. అంతే కాకుండా ఇటీవల జిల్లా లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ పార్టీ అధికారంలోకి వస్తే మత్స్యకారులను ఎస్టీలలో చేరుస్తామని జగన్ ప్రకటించారు.
 
పార్టీ టెక్కలి నియోజకవర్గ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ విజ్ఞప్తి మేరకు అక్కడ బహిరంగ సభా వేదిక మీద నుంచే మత్స్యకారులను ఎస్టీలలో  చేరుస్తామని ప్రజల హర్ష్వాధ్వానాల మధ్య ప్రకటించారు. దాంతో జిల్లాలో ఉన్న 3 లక్షలమంది మత్స్యకారులకు విద్య, ఉద్యోగ, ఇతర అవకాశాలు బాగా పెరగనున్నాయి. రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో మత్స్యకారులకు జగన్ పెద్ద పీట వేస్తుండటం పట్ల ఆ సామాజికవర్గంలో ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతున్నాయి.

>
మరిన్ని వార్తలు