మాట ఇచ్చిన చోటే.. మరో చరిత్రకు శ్రీకారం

4 Oct, 2019 04:07 IST|Sakshi

నేడు ఏలూరులో ‘వైఎస్సార్‌ వాహనమిత్ర’ పథకాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి జగన్‌

పథకం లబ్ధిదారులు 1,73,531 మంది.. బీసీలే అత్యధికం

నాడు పాదయాత్రలో మాట ఇచ్చిన చోటే పథకాన్ని ప్రారంభించనున్న వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: మాట ఇచ్చిన చోటే మరో చరిత్రకు శ్రీకారం చుడుతూ ‘వైఎస్సార్‌ వాహనమిత్ర’ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ఏలూరులో ప్రారంభించనున్నారు. ప్రజా సంకల్ప పాదయాత్ర సమయంలో ఆటోడ్రైవర్ల కష్టాలు చూసి చలించిన వైఎస్‌ జగన్‌ ఆటోలు, ట్యాక్సీలు, మ్యాక్సీ క్యాబ్‌ల ఫిట్‌నెస్, బీమా, మరమ్మతుల కోసం ఏటా  రూ.10 వేల చొప్పున ఆర్ధిక సాయం అందచేస్తామని నాడు ఏలూరులో జరిగిన బహిరంగ సభలో హామీ ఇచ్చారు. ఆ ప్రకారమే నేడు  వైఎస్సార్‌ వాహనమిత్ర పథకాన్ని ప్రారంభించనున్నారు. మాట ఇచ్చిన చోటు నుంచే పథకానికి శ్రీకారం చుట్టడం అరుదైన విషయమని, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమని ఆటో డ్రైవర్ల సంఘాలు పేర్కొంటున్నాయి. ఈ పథకం ద్వారా మొత్తం 1,73,531 మంది లబ్ధి పొందనున్నారు.

లబ్ధిదారుల్లో అత్యధికులు బీసీలే..
వైఎస్సార్‌ వాహనమిత్ర పథకం దరఖాస్తుదారులు 1,75,352 మంది కాగా అర్హులైన లబ్ధిదారులు 1,73,531 మంది అని గ్రామ వలంటీర్లు, ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు తమ పరిశీలనలో తేల్చారు. కలెక్టర్ల ఆమోదముద్రతో అర్హులను రవాణా శాఖ అధికారులు నిర్థారించారు. లబ్ధిదారుల్లో అత్యధికంగా బీసీలే ఉన్నారు. 1,73,531 మంది లబ్ధిదారుల్లో 79,021 మంది బీసీలే కావడం గమనార్హం. విశాఖపట్టణం, కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాల్లో అధిక సంఖ్యలో దరఖాస్తులు అందాయి.

మరిన్ని వార్తలు