ప్రజాస్వామ్యాన్ని కాపాడండి

7 Apr, 2017 00:30 IST|Sakshi
ప్రజాస్వామ్యాన్ని కాపాడండి

ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ జోక్యం చేసుకోండి రాష్ట్రపతికి జగన్‌ వినతి
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు
అవినీతి డబ్బుతో ఫిరాయింపుల ప్రోత్సాహం
ఈ జాఢ్యం అన్ని రాష్ట్రాలకు పాకుతుంది..
స్పందించకుంటే వ్యవస్థ కుప్పకూలుతుంది..
చంద్రబాబు పాలనపై ప్రజలకు విశ్వాసం లేదు..
రాజీనామాలు, అనర్హతలపై జంకుతున్న బాబు
అన్ని పార్టీల నేతలనూ కలసి వివరిస్తాం..
రాష్ట్రపతి భవన్‌ ఆవరణలో మీడియాతో ప్రతిపక్షనేత


సాక్షి, న్యూఢిల్లీ: పార్టీ ఫిరాయింపులను అరికట్టలేనిపక్షంలో అన్ని రాష్ట్రాలు, అన్ని పార్టీల్లో ఇవే పరిణామాలు చోటుచేసుకుం టాయని, చివరకు ప్రజాస్వామ్య వ్యవస్థ కుప్పకూలుతుందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఫిరాయింపులు జరుగుతున్న తీరును, అనర్హత వేటు పిటిషన్లు పెండింగ్‌లో ఉండగానే ఫిరాయింపుదారులను మంత్రివర్గంలోకి తీసుకున్న తీరును భారత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి గురువారం ఇక్కడ వివరించారు.

వెంటనే జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ పార్లమెం టరీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, వి.విజయసాయిరెడ్డి, పి.వి. మిథున్‌రెడ్డి, వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి, బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి తదితరులతో కలసి రాష్ట్రపతిని కలుసుకుని ఒక వినతిపత్రం ఇచ్చారు. అనం తరం ఆయన రాష్ట్రపతి భవన్‌ ఆవరణలో మీడియాతో మాట్లాడారు.
ఆయనేమన్నారంటే...

ఇది ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమే..
‘‘రాష్ట్రంలో అనైతికంగా, అప్రజాస్వామికంగా ఫిరాయింపులు జరుగుతున్నాయి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌పై గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన వారిపై అనర్హత వేటు వేయా లని స్పీకర్‌కు పిటిషన్లు ఇచ్చాం. ఆ పిటిషన్లు పెండింగ్‌లో ఉండగానే మరో అడుగు ముందుకేసి ఫిరాయించిన వారిలో కొంత మందిని చంద్రబాబు తన మంత్రివర్గంలోకి తీసుకోవడాన్ని భారత రాష్ట్రపతికి వివరిం చాం.

 ఇది ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమే అవుతుందని చెప్పాం. ఇలాంటివి ఆపని పక్షంలో ఇప్పుడు ఈ రాష్ట్రంలో జరిగిన పరిణా మాలు ప్రతి రాష్ట్రంలో జరుగుతాయి.  అప్పు డు మంత్రులు ఏ పార్టీకి చెందిన వారన్నది ఎవరికీ అర్థం కాని పరిస్థితుల్లోకి వెళతాం. ఫిరాయింపులతో ప్రజాస్వామ్యం ఖూనీ అవు తోంది. ప్రజాస్వామాన్ని కాపాడాలని రాష్ట్రప తిని కోరాం. ఆయన సానుకూలంగా స్పందిం చారు. మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం..

బాబు పాలనపై ప్రజలకు విశ్వాసం లేదు..
21 మంది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను ప్రలోభాలు చూపి టీడీపీలోకి తీసుకున్నారు. వారు ఎమ్మెల్యేలుగా కొనసాగేందుకు అర్హత లేదు. కానీ ప్రభుత్వం, స్పీకర్‌ చేయూతతో వారు కొనసాగుతున్నారు. చంద్రబాబుకు అధికారం ఉంది. డబ్బు ఉంది. పోలీసు బలం ఉంది. పూర్తి మెజారిటీ ఉంది. అయినా ఆయ నకు మా పార్టీ టికెట్‌పై గెలిచిన ఎమ్మెల్యేలు కావాలి. వారిపై అనర్హత వేటు పడనీయరు. వారికి టికెట్‌ ఇచ్చి ప్రజల వద్దకు తీసుకువెళ్లి తీర్పు కోరరు. ఎందుకంటే ఆయనకు తెలుసు. ఎన్నికల్లో గెలవలేరని తెలుసు. ఎందుకంటే పరిపాలనలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.

ఆయనకు ఆయనపై గానీ, ఆయన పాలనపై గానీ విశ్వాసం లేదు. అందుకే ఆయన ప్రజల్లోకి వెళ్లరు. ఆయనకు ఎమ్మెల్యేలు కావాలి గానీ, వారిని టీడీపీ టికెట్‌తో గెలిపించుకోలేరు. అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లు పెండింగ్‌లో ఉండగా ప్రజాస్వామ్యాన్ని పరిహసించేలా చంద్రబాబు వీరిని తమ మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అందువల్ల గవర్నర్‌కు తగు ఆదేశాలు ఇచ్చి మంత్రివర్గంలో చేర్చుకున్న ఫిరాయింపుదారులను తొలగించాలని కోరాం..

బాబు అనైతికతను అన్నిపార్టీలకూ వివరిస్తాం..
వివిధ పార్టీల నేతలను కలుస్తాం. పార్టీలు స్పందించని పక్షంలో మీవరకూ వస్తుందని చెప్తాం.. మీ పార్టీ ఎమ్మెల్యేలు కూడా వేరే పార్టీలోకి వెళ్లే ప్రమాదం ఉంటుందని చెప్తాం. కాబట్టి పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడే పక్షంలో నాలుగడుగులు ముందుకు వేయాలని కోరతాం. మరీ ముఖ్యంగా బీజేపీ లో పార్టీ నిర్ణయాన్ని ప్రభావితం చేయగల నేతలను కూడా కలుస్తాం. బీజేపీ నేతలు కన్విన్స్‌ అయితే చంద్రబాబుపై మొట్టికాయ లు వేస్తారు.  స్పీకర్‌ వెంటనే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేస్తారు.

అపా యింట్‌మెంట్‌ ఇస్తే అన్ని పార్టీల నేతలను కలిసి చంద్రబాబు అనైతిక చర్యలను వివరి స్తాం. ఓటుకు కోట్లు ఇస్తూ ఆడియో టేపులు, వీడియో టేపులతో దొరికిపోయిన చంద్ర బాబు ఏరకంగా.. విచ్చలవిడిగా సంపాదిం చిన నల్లధనాన్ని ఫిరాయింపులకు ఎలా వెచ్చిస్తున్నారో వివరిస్తాం.  ఆంధ్రప్రదేశ్‌లో అవినీతిని కాగ్‌ తప్పుపట్టిన పరిస్థితిని ప్రస్తావిస్తాం. ఇసుక నుంచి మట్టి వరకు, మట్టి నుంచి మద్యం వరకు, మద్యం నుంచి బొగ్గు వరకు, బొగ్గు నుంచి కాంట్రాక్టర్ల వరకు,  చివరకు గుడి భూములను, గుడిలో లింగాన్ని సైతం మింగేలా అవినీతికి పాల్పడుతున్న తీరు, ఆ సంపాదించిన డబ్బుతో ఇలా ప్రజా స్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న తీరును ప్రతిచోట చెప్తాం.. ఈ వ్యవస్థలో మార్పు తేలేనిపక్షంలో వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోతుంది’’ అని జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు