రాష్ట్రానికి భారీ పెట్టుబడి!

6 Mar, 2020 02:42 IST|Sakshi
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

వైఎస్సార్‌ జిల్లాలో మరో స్టీల్‌ ప్లాంట్‌

జమ్మలమడుగులో ఏర్పాటయ్యే అవకాశం

ప్రభుత్వానికి ప్రముఖ అంతర్జాతీయ కంపెనీ

ఐఎంఆర్‌ ప్రతిపాదన రూ.12 వేల కోట్లకు పైగా పెట్టుబడి

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తో కంపెనీ ప్రతినిధుల చర్చలు

సాక్షి, అమరావతి, జమ్మలమడుగు: రాష్ట్రంలో మరో భారీ పరిశ్రమను నెలకొల్పి పెద్ద ఎత్తున ఉద్యోగాలు సృష్టించే దిశగా కసరత్తు ప్రారంభమైంది. స్విడ్జర్లాండ్‌కు చెందిన ప్రముఖ కంపెనీ ‘ఐఎంఆర్‌ ఏజీ’ సుమారు రూ.12 వేల కోట్లకు పైగా పెట్టుబడి, 10 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యంతో వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగులో భారీ స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. కంపెనీ ప్రతినిధులు గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో సమావేశమై వైఎస్సార్‌ జిల్లాలో ప్లాంట్‌ ఏర్పాటుపై ఆసక్తి వ్యక్తం చేశారు. పరిశ్రమల రాకతో పెద్ద సంఖ్యలో ఉద్యోగాల కల్పన జరుగుతుందని, రానున్న రోజుల్లో వైఎస్సార్‌ జిల్లా స్టీల్‌ సిటీగా రూపుదిద్దుకునేందుకు పూర్తి అవకాశాలున్నాయని ఐఎంఆర్‌ కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు.

తాము ఇప్పటికే  ఇండోనేషియా, దక్షిణాఫ్రికా, మెక్సికో, కొలంబియా, ఇటలీ, ఉక్రెయిన్, భారత్‌ సహా పలు దేశాల్లో బొగ్గు, ఇనుప ఖనిజం, బంగారం గనుల తవ్వకాలతోపాటు విద్యుత్, ఉక్కు కర్మారాగాలను నిర్వహిస్తున్నట్లు సీఎంకు వివరించారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ, ఐఎంఆర్‌ ఏజీ ఛైర్మన్‌ హాన్స్‌ రడాల్ఫ్‌ వైల్డ్, కంపెనీ డైరెక్టర్‌ అనిరుధ్‌ మిశ్రా, సెడిబెంగ్‌ ఐరన్‌ ఓర్‌ కంపెనీ సీఈవో అనీష్‌ మిశ్రా, గ్రూప్‌ సీఎఫ్‌వో కార్ల్‌ డిల్నెర్, టెక్నికల్‌ డైరెక్టర్‌ సురేష్‌ తవానీ, ప్రాజెక్టŠస్‌ ప్రెసిడెంట్‌ అరిందమ్‌ దే, ఫైనాన్స్‌ డైరెక్టర్‌ సంజయ్‌సిన్హా , ఏపీ ఇంటిగ్రేటెడ్‌ స్టీల్స్‌ ఎండీ పి.మధుసూదన్‌ తదితరులు పాల్గొన్నారు. (అక్రమ మద్యం, ఇసుక అక్రమ తవ్వకాలపై సీఎం కీలక ఆదేశాలు)

ఐఎంఆర్‌ఏజీ కంపెనీ ప్రతినిధులు, ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

బ్రహ్మణిని సందర్శించిన ఐఎంఆర్‌ బృందం
రాష్ట్రంలో పర్యటిస్తున్న ఐఎంఆర్‌ ఏజీ ప్రతినిధి బృందం బ్రహ్మణి స్టీల్‌ప్లాంట్‌ను సందర్శించింది. ఇప్పటికే ఈ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్‌ హైగ్రేడ్‌ స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. స్టీల్‌ ప్లాంట్‌కు కేటాయించిన భూములు, నీటి వసతి, రైల్వే, విమానాశ్రయం తదితర అంశాల గురించి స్థానిక ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఐఎంఆర్‌ బృందానికి వివరించారు. రెండు స్టీల్‌ ప్లాంట్‌ల ఏర్పాటుతో రాయలసీమ ప్రాంతంలో నిరుద్యోగులకు ఎంతో మేలు జరుగుతుందని సుధీర్‌రెడ్డి పేర్కొన్నారు.

ఏ సహకారం కావాలన్నా అందిస్తాం: ముఖ్యమంత్రి జగన్‌

  • వైఎస్సార్‌ జిల్లాలో ఇప్పటికే స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ప్రభుత్వం తరఫున ప్రయత్నాలు వేగవంతం చేశాం.
  • ఇనుప ఖనిజం సరఫరాకు ఎన్‌ఎండీసీతో ఒప్పందం చేసుకున్నాం.
  • ఐఎంఆర్‌ కూడా మరో స్టీల్‌ప్లాంట్‌ నెలకొల్పితే చక్కటి పారిశ్రామిక వాతావరణం ఏర్పడుతుంది. 
  • కృష్ణపట్నం పోర్టుతోపాటు రైల్వే మార్గం, జాతీయ రహదారులతో మెరుగైన రవాణా సదుపాయం ఉంది. 
  • నీరు, విద్యుత్తు లాంటి మౌలిక సదుపాయాలతోపాటు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నాం.

మరిన్ని వార్తలు