దయనీయ స్థితిలో అక్కాచెల్లెళ్లు: వైఎస్ జగన్

25 Sep, 2014 18:03 IST|Sakshi
దయనీయ స్థితిలో అక్కాచెల్లెళ్లు: వైఎస్ జగన్

వేల్పుల(వైఎస్ఆర్ జిల్లా): డ్వాక్రా అక్కాచెల్లెళ్లు దయనీయ స్థితిలో ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి అన్నారు. పులివెందుల నియోజకవర్గం వేల్పులలో డ్వాక్రా మహిళలు తమ బాధలను జగన్కు చెప్పుకున్నారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తారని మూడు, నాలుగు నెలలుగా బకాయిలు చెల్లించలేదని తెలిపారు. ఇప్పుడు వడ్డీల భారం మోయలేకపోతున్నామన్నారు. ఇప్పటివరకు చేసిన చెల్లింపులన్నీ వడ్డీలకే పోతున్నాయని మహిళలు వాపోయారు. ఇప్పుడు ఒకేసారి ఆరు కంతులు కట్టమని చెబుతున్నారని వారు చెప్పారు. ఓట్ల కోసం వచ్చినప్పుడు డ్వాక్రా రుణాలు కట్టక్కరలేదని టిడిపి నాయకులు చెప్పారన్నారు. ఎన్నికల్లో కట్టుకథలు చెప్పారని వాపోయారు. చంద్రబాబు నాయుడు తమకు అన్యాయం చేశారని చెప్పారు. వృద్ధులు పింఛన్లు పోతాయన్న ఆందోళన వ్యక్తం చేశారు. తమ తరపున పోరాడాలని డ్వాక్రా మహిళలు జగన్ను కోరారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ అధికారంలోకి రావడానికి అడ్డమైన హామీలు ఇచ్చిన చంద్రబాబు డ్వాక్రా మహిళల బకాయిలు రద్దు చేయలేదన్నారు. దాంతో వారి పరిస్థితి దయనీయంగా ఉందని చెప్పారు.  రైతుల పరిస్థితి కూడా అలాగే ఉందన్నారు. వృద్ధులకు మూడు పూటలా భోజనం పెట్టే ఆలోచన కూడా చంద్రబాబు చేయడంలేదన్నారు. రేషన్ కార్డులు ఇవ్వడం అలా ఉంచితే, ఇప్పుడు అన్నీ బోగస్ అంటున్నారన్నారు. 17లక్షల రేషన్ కార్డులు కత్తిరించడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.  ఇక రేషన్ కార్డు కావాలంటే గగనమే అన్నారు. గ్రామాలలో కమిటీలన్నిటిలో టిడిపి కార్యకర్తలే ఉన్నారని విమర్శించారు.

43 లక్షల మంది పెన్షనర్లకు వెయ్యి రూపాయల చొప్పున నెలకు 430 కోట్ల రూపాయలు కావాలి. సంవత్సరానికి 3,600 కోట్ల రూపాయలు కావాలి. కానీ బడ్జెట్లో 1300 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకున్నారని జగన్ వివరించారు. దీని అర్ధం బడ్జెట్లోనే పింఛన్ల కోతకు చంద్రబాబు శ్రీకారం చుట్టినట్లని అన్నారు. డ్వాక్రా మహిళలు, రైతులు, పెన్షన్దారుల కోసం వచ్చే నెల 16న వైఎస్ఆర్ సిపి జరుప తలపెట్టిన ధర్నాను జయప్రదం చేయమని జగన్ పిలుపు ఇచ్చారు.
**
 

మరిన్ని వార్తలు