మాట ఇస్తే.. మరచిపోడు

16 Jul, 2019 08:06 IST|Sakshi

మాట ఇస్తే మరచిపోనని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి నిరూపించుకున్నారు. ప్రజా సంకల్ప పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు గిరిజనులకు బాసటగా నిలిచేందుకు ముందడుగు వేశారు. అధికారం చేపట్టిన నెలన్నరలోపే అటవీహక్కుల పరిరక్షణ చట్టం పునరుజ్జీవానికి శ్రీకారం చుట్టారు. ఫలితంగా పశ్చిమ ఏజెన్సీలో హర్షం వ్యక్తమవుతోంది. 

సాక్షి, పశ్చిమ గోదావరి:  పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు తరతరాలుగా ప్రభుత్వ పథకాలు అందని పరిస్థితి నెలకొంది. ఆ భూములకు పట్టాలు ఉన్నా.. బ్యాంక్‌ రుణాలు పొందక వ్యవసాయ పనుల సీజన్‌లో ఆదివాసీలు అనేక అవస్థలు పడుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజాసంకల్ప పాదయాత్ర సమయంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అటవీ హక్కుల పరిరక్షణ చట్టానికి పునరుజ్జీవం తీసుకొస్తామని, పోడు భూములపై గిరిజనులకు హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అన్న మాట ప్రకారమే.. ముఖ్యమంత్రి అయిన వెంటనే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గిరిజన సంక్షేమ శాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆయన ఆదేశాల మేరకు చట్టానికి పునరుజ్జీవం తీసుకొచ్చేలా ఆ శాఖ ఓ ప్రణాళిక సిద్ధం చేసింది.

వెల్లువెత్తుతున్న ఆనందోత్సాహాలు 
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకుంటున్న చర్యలతో ప్రతి ఆదివాసీ గిరిజనుడు మైదాన ప్రాంతంలో ఉన్న రైతులతో సమానంగా పూర్తి హక్కులు పొందబోతున్నారు. ఎంతో కాలంగా పట్టాలున్నా ప్రయోజనం లేకుండా పోయిందంటూ ఆదివాసీలు అనేకమార్లు ఆందోళనకు దిగారు. ఇప్పుడు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఔదార్యంతో తమకు న్యాయం జరుగబోతుందని, ఇక తమ కష్టాలు కడతేరినట్టేనని, ఆనందంగా వ్యవసాయం చేసుకుంటామని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  జిల్లాలోని పోడు భూముల పరిస్థితిని పరిశీలిస్తే అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 23,058 ఎకరాలు ఉన్నాయి. అలాగే వీఎస్‌ఎస్, ఉమ్మడి భూములు సుమారు 61,000 ఎకరాలు ఉన్నాయి. వీటి పట్టాల కోసం 2005 తర్వాత 12,386 మంది దరఖాస్తులు చేసుకున్నారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో వీటిని పరిశీలించిన ప్రభుత్వం మొత్తం 1932 మంది అర్హులని నిర్ణయించి వారికి 63,961 ఎకరాల భూములకు పట్టాలు పంపిణీ చేసింది. అయితే పట్టాలు పంచినా.. ఆ భూములపై ఎలాంటి హక్కులూ లేకుండా గిరిజనులు సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో పాదయాత్ర సమయంలో వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ఇప్పుడు గిరిజన సంక్షేమ శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. సుమారు రెండువేల గిరిజన కుటుంబాలకు మేలు జరగనుంది.  

జగనన్నది మాట తప్పని నైజం 
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిది మాట తప్పని నైజం. ఆయన మాట ఇస్తే మరచి పోడు. ఇప్పుడు అటవీహక్కుల చట్టానికి పునరుజ్జీవం కల్పించే దిశగా ఆయన అడుగులు వేయడం ఆనందంగా ఉంది. సుమారు రెండువేల కుటుంబాలకు మేలు జరగబోతుంది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంచి సీఎంగా చరిత్రలో నిలిచిపోతారు.  
–  జువ్వల బాజీ, ఆదివాసీ హక్కుల కార్యకర్త, జీలుగుమిల్లి మండలం
గిరిజన అభివృద్ధే లక్ష్యం
గిరిజన అభివృద్దే వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ లక్ష్యం. నాడు దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి అటవీ హక్కుల చట్టంలో లక్షలాది మందికి భూములు పంచి చరిత్ర సృష్టించారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మరొక అడుగు ముందుకు వేసి పోడు భూమి వ్యవసాయదారులకు హక్కులు, పథకాలు పొందేలా ఏర్పాటు చేస్తున్నారు. ఆయన మాట ఇస్తే మరచిపోడు. గిరిజనుల అభివృద్దే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పనిచేస్తుంది.
– తెల్లం బాలరాజు, పోలవరం ఎమ్మెల్యే  

మరిన్ని వార్తలు