-

‘ఎస్సీ వర్గీకరణకు చంద్రబాబు ఎందుకు ప్రయత్నించలేదు’

27 Jul, 2019 15:51 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దేశంలో ఎక్కడా లేని విధంగా సుపరిపాలన అందిస్తున్నారని, వైఎస్సార్‌సీపీ విశాఖపట్నం జిల్లా అధికార ప్రతినిధి అజయ్ కుమార్ అన్నారు. ప్రజారాంజకమైన 12 బిల్లులను ప్రవేశపెట్టే క్రమంలో కొందరు రాజకీయంగా, సామాజికంగా విమర్శలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అయితే ఎస్సీ వర్గీకరణ విషయంలో వైఎస్ జగన్ చట్టబద్ధంగానే వ్యవహరిస్తున్నారని వెల్లడించారు. మాదిగలను విమర్శించడం గాని, వ్యతిరేకించడం గాని సీఎం చేయలేదని అజయ్‌ గుర్తుచేశారు. తన వ్యక్తిగత ఎజెండా కోసమే మందకృష్ణ మాదిగ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

మందకృష్ణ మాటలను వినే మాదిగలు రాష్ట్రంలో ఎవరు లేరని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరు ఎస్సీలకు మంత్రి పదవులు, ఒకరికి ఎంపీ పదవి ఇచ్చి గౌరవించిన ఘనత వైఎస్ జగన్‌కే చెందుతుందని అన్నారు. ఎస్సీ వర్గీకరణ అనేది కేంద్రం పరిధిలో ఉన్న అంశమని, రాష్ట్రంలో చిచ్చుపెట్టడానికే మందకృష్ణ అసెంబ్లీ ముట్టడి అంటున్నారని విమర్శించారు. నాలుగేళ్ళు  బీజేపీతో అంటకాగిన చంద్రబాబు, వర్గీకరణ కోసం ఎందుకు ప్రయత్నించలేదని ఆయన ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు