ఇక జలకళ

19 Dec, 2019 11:09 IST|Sakshi

జిల్లాకు రెండు కొత్త ప్రాజెక్టులు మంజూరు

సిద్ధమైన రాజోలి ఆనకట్ట, కుందూ–తెలుగుగంగ లిఫ్ట్‌ ఇరిగేషన్‌

23, 24 తేదీల్లో శంకుస్థాపన చేయనున్న సీఎం వైఎస్‌ జగన్‌

హర్షం వ్యక్తం చేస్తున్న జిల్లా వాసులు

ఆరు నెలల పాలనలో ప్రభుత్వం జిల్లాకు రెండు కొత్త సాగునీటి ప్రాజెక్టులను మంజూరు చేసింది. ఈ మేరకు మంగళవారంఉత్తర్వులు వెలువడ్డాయి. రూ. 1921.70 కోట్లతో కుందూ నదిపై నిర్మించనున్న ఈ ప్రాజెక్టులకు డిసెంబరు 23, 24 తేదీల్లో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. వీటి ద్వారా 2.69 లక్షల ఎకరాలకు సాగునీరు, లక్షలాది మందికి తాగునీరుఅందనున్నాయి.

సాక్షి ప్రతినిధి కడప : జిల్లాలో తెలుగుగంగ ప్రాజెక్టు పరిధిలోని మైదుకూరు, బద్వేలు నియోజకవర్గాల్లో రూ. 1.77 లక్షల ఆయకట్టును స్థిరీకరించేందుకు ప్రభుత్వం కుందూ–తెలుగుగంగ ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేసింది. రూ. 564.60 కోట్లతో దీనిని చేపడుతోంది. కుందూ నదిపై దువ్వూరు మండలం జొన్నవరం వద్ద ఆనకట్టను నిర్మించనున్నారు. కుందూ వరద సమయంలో రోజుకు 1,425 క్యూసెక్కుల చొప్పున ఎనిమిది టీఎంసీలు దువ్వూరు చెరువులోకి ఎత్తి పోస్తారు. అక్కడి నుంచి తెలుగుగంగ ప్రధాన కాలువ 107 కిలోమీటరు వద్ద సబ్సిడరీ రిజర్వాయర్‌–1లోకి నీటిని ఎత్తిపోస్తారు. ఈ జలాశయాన్ని నింపి అక్కడి నుంచి బ్రహ్మంసాగర్‌కు నీటిని తరలిస్తారు. దీని ద్వారా ఆయకట్టుకు సాగునీరు, బద్వేలు, మైదుకూరు నియోజకవర్గాల పరిధిలో ప్రజలకు తాగునీటిని సైతం అందిస్తారు. తెలుగుగంగ ప్రాజెక్టు పరిధిలో బ్రహ్మంసాగర్‌ రిజర్వాయర్‌తోపాటు ఎస్‌ఆర్‌–1, ఎస్‌ఆర్‌–2లకు కలిపి 20 టీఎంసీలు అందించాల్సి ఉంది. కానీ బ్రహ్మంసాగర్‌కు పది టీఎంసీలు వచ్చిన దాఖలాలు అరుదు. ఈ ఏడాది ఎగువన భారీ వర్షాలు కురిసి పలుమార్లు శ్రీశైలం నిండినా తెలుగుగంగ ప్రాజెక్టుకు అనుకున్న స్థాయిలో నీరు చేరలేదు. ప్రధాన కాలువ సామర్థ్యం పేరుకు ఐదు వేల క్యూసెక్కులు అయినా రెండు వేల క్యూసెక్కులకు మించి దిగువకు నీరు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఈ ఏడాది బ్రహ్మంసాగర్‌కు 6.5 టీంఎసీలు కూడా చేరలేదు. దివంగత నేత వైఎస్సార్‌ హయాం మినహా సాగర్‌ ఆయకట్టుకు నీరిచ్చిన పరిస్థితి లేదు. దీంతో తెలుగుగంగ ఆయకట్టు రైతాంగం ఆందోళన చెందుతోంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు కుందూ వరద నీటిని తెలుగుగంగకు లిఫ్ట్‌ చేసి ఆయకట్టుకు సాగు, తాగునీరు అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టును మంజూరు చేసింది.

రూ. 1357.10 కోట్లతో రాజోలి ఆనకట్ట
 కడప సరిహద్దులో కర్నూలు జిల్లా పరిధిలోని చాగలమర్రి మండలంలో కుందూనదిపై రూ. 1357.10 కోట్లతో రాజోలి ఆనకట్ట నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2.95 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. తద్వారా 92 వేల ఎకరాల కేసీ ఆయకట్టు స్థిరీకరణతోపాటు ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు తాగునీటిని అందించాలన్నది ఉద్దేశం. కరువు నేపథ్యంలో ఎగువన వర్షాలు కురవకపోతే శ్రీశైలం ప్రాజెక్టుకు సకాలంలో నీరు చేరుతుందన్న పరిస్థితి లేదు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా నిండితేనే జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు నీరు చేరే పరిస్థితి ఉంటుంది. ప్రతి యేటా కుందూనదికి పెద్ద ఎత్తున నీటి ప్రవాహం ఉంటుంది. ఈ నీరు నిరుపయోగంగా సముద్రం పాలవుతోంది. వరద సమయంలో కుందూ నీటిని నిల్వ ఉంచుకునే విధంగా ప్రాజెక్టులను నిర్మిస్తే కేసీ ఆయకట్టును స్థిరీకరించడంతోపాటు ప్రొద్దుటూరు పట్టణ ప్రజల దాహార్తిని తీర్చవచ్చన్న ఆలోచనతో ప్రభుత్వం ఈ పథకానికి ఆమోదముద్ర వేసింది. ఈనెల 23, 24 తేదీల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ ప్రాజెక్టుకు సైతం శంకుస్థాపన చేయనున్నారు. 2008 డిసెంబరులో అప్పటి సీఎం దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఆయన మరణంతో అది మూలనపడింది. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి సిద్ధమైంది. దీంతోపాటు ఈనెలలో జిల్లాలో వేల కోట్లతో ఇరిగేషన్‌ ప్రాజెక్టులతోపాటు ఇతర అభివృద్ధి పథకాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు.

మరిన్ని వార్తలు