ఘనంగా జననేత జన్మదిన వేడుకలు

22 Dec, 2017 03:23 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో రక్తదానం శిబిరం, చీరల పంపిణీ

ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వేడుకలు

జగన్‌కు శుభాకాంక్షలు తెలియజేసిన నేతలు, కార్యకర్తలు, అభిమానులు

సాక్షి, హైదరాబాద్‌/నెట్‌వర్క్‌:  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు వేడుకలు గురువారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి. పార్టీ సీనియర్‌ నేతలు బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సజ్జల రామకృష్ణారెడ్డి, గట్టు శ్రీకాంత్‌రెడ్డి నేతృత్వంలో భారీ కేక్‌ కట్‌ చేశారు. నేతలు, కార్యకర్తలు జగన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. పార్టీ  తెలంగాణ విభాగం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా సీనియర్‌ నేతలు మాట్లాడారు. ప్రజాభీష్టం మేరకు పాలన సాగించాలన్నదే జగన్‌ ధ్యేయమని, ఇందులో భాగంగానే ప్రజాసంకల్ప యాత్ర చేపట్టారని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెప్పారు. ప్రజల పక్షాన నిలిచిన జగన్‌కు ఆయురారోగ్యాలు సమకూరాలని ఆకాంక్షించారు. ఏపీలో రాజన్న రాజ్యం తీసుకురావడానికి జగన్‌ చేస్తున్న కృషి ఫలించాలని బొత్స సత్యనారాయణ భగవంతుడిని ప్రార్థించారు. జగన్‌మోహన్‌రెడ్డి అరుదైన రాజకీయ లక్షణాలు గల నేత అని ఆయన రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, నేతలు కొలగట్ల వీరభద్రస్వామి, విజయ్‌చందర్‌ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు వేడుకలను గురువారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. కేక్‌లు కట్‌ చేసి, జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పలుచోట్ల రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం, రెడ్డి శాంతి, ధర్మాన కృష్ణదాస్‌ తదితర ముఖ్యనేతలు పాల్గొన్నారు. జిల్లాలో నియోజకవర్గాల వారీగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

విజయవాడలో మహా వైద్య శిబిరం
వైఎస్‌ జగన్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని వైఎస్‌ జగన్‌ సేవాదళం, వెలంపల్లి యూత్‌ ఆధ్వర్యంలో విజయవాడ భవానీపురం క్రాంబ్వే రోడ్‌లో మహా వైద్య శిబిరం నిర్వహించారు. ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ముఖ్యఅతిథి హాజరయ్యారు. జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు కేక్‌ను కట్‌ చేశారు. జగన్‌ ఆయురారోగ్యాలతో ఉండాలని, రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ సర్వమత ప్రార్థనలు చేశారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వ అరాచక పాలనకు చరమగీతం పాడాలని వైవీ సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. సిద్ధార్థ మెడికల్‌ కాలేజీ వైఎస్సార్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ డాక్టర్స్‌ సెల్‌ అధ్యక్షులు డాక్టర్‌ నలిపిరెడ్డి వాసుదేవరెడ్డి సౌజన్యంతో మూడు ట్రైసైకిళ్లను దివ్యాంగులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు కొలుసు పార్థసారథి, సామినేని ఉదయభాను, వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, బొప్పన భవకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

చైనాలో వెల్లువెత్తిన అభిమానం
చైనాలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అభిమానం వెల్లువెత్తింది. వైఎస్సార్‌సీపీ చైనా మెడికల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో యూనియన్‌ అధ్యక్షులు, చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన కొంకల పవన్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో చైనాలోని జింఝౌ మెడికల్‌ యూనివర్సిటీలో జగన్‌ జన్మదిన వేడుకలు జరిపారు. జగన్‌మోహన్‌రెడ్డి ముఖచిత్రంతో కూడిన టీ షర్ట్‌లు ధరించి, కేక్‌ కట్‌ చేశారు.

పుష్పాలతో జగన్‌ చిత్రం
తూర్పు గోదావరి జిల్లా కడియంలో జననేత జగన్‌ జన్మదిన వేడుకలను వినూత్నంగా నిర్వహించారు. ఇక్కడ పుష్పాలు, పత్రాలతో రూపొందించిన జగన్‌ చిత్రం అభిమానులకు కనువిందు చేసింది. రాజమహేంద్రవరం కో–ఆర్డినేటర్‌ గిరిజాల వీర్రాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

మరిన్ని వార్తలు