సీఎం జగన్‌.. బిజీబిజీ

1 Jun, 2019 03:49 IST|Sakshi
సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన సచివాలయం అధికారులు, ఐఏఎస్‌ చిరంజీవి చౌదరి, ఐపీఎస్‌ అధికారులు విశాల్‌ గున్నీ, ఎం రవీంద్రనాథ్‌బాబు, నయీమ్‌ అద్నాన్‌ షమ్మీ

పాలనాపరమైన వ్యవహారాలతో తలమునకలు  

సమీక్షలు, సమావేశాలు, కీలక నిర్ణయాలు 

సుపరిపాలనా ఫలాలను పేదలకు వేగంగా అందించాలన్న తపన

సాక్షి, అమరావతి : నూతన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారమంతా పాలనాపరమైన వ్యవహారాలతో తనమునకలుగా గడిపారు. తాడేపల్లిలోని తన నివాసంలో, క్యాంపు కార్యాలయంలో పలుశాఖల అధికారులతో సమీక్షలు చేశారు. ఆరు నెలల నుంచి ఏడాది లోపే.. ‘జగన్‌ ఓ మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటాను’ అని ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించిన రోజున ప్రకటించిన మాటలకు కట్టుబడి.. సుపరిపాలనా ఫలాలు ప్రజలకు వేగంగా అందించాలన్న తపనతో వివిధశాఖల అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ.. కొన్ని కీలకమైన సూచనలు చేశారు. ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేశాక గురువారం తొలి రోజు నుంచే రాష్ట్ర పాలనపై పూర్తిగా పట్టు సాధించే దిశగా ప్రయత్నాలు చేశారు. అధికారుల పరిస్థితి.. వారి పనితీరుపై కూడా ఆయన అవగాహనకు రావడం ప్రారంభించారు. పాలనను పరుగెత్తించాలనే తపన ఆయన కార్యశైలిలో అధికారులకు కనిపించింది. ప్రజలకు తాను ఇచ్చిన హామీల అమలుతో పాటు.. అభివృద్ధిని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న అంశంపై ఆయన దృష్టి సారించారు. అధికారులతో సమావేశాలతో పాటు.. మధ్యలో వైఎస్సార్‌సీపీ వ్యవహారాలను కూడా ఆయన సమీక్షించారు. 

శుక్రవారం ఆయన షెడ్యూలు ఇలా సాగింది.
- ఉదయం 9 గంటలకు : రాష్ట్ర డీజీపీ గౌతమ్‌సవాంగ్‌తోపాటు.. పలువురు పోలీసు అధికారులతో తన నివాసంలో సమావేశం 
ఉదయం 10 గంటలకు : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం, ఆర్థికశాఖ అధికారులతో విస్తృత సమావేశం.. టెండర్ల ప్రక్రియ ప్రక్షాళనపై చర్చ, అధికారులకు పలు సూచనలు, ప్రభుత్వోద్యోగులు తమ పని గంటలకు మించి ఎవరూ పనిచేయరాదని నిర్దిష్ట ఆదేశాలు. 
11 గంటలకు : పార్టీ ముఖ్యనేతలు విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డితో రాజకీయపరమైన అంశాలపై చర్చలు
11.30 గంటలకు : మళ్లీ అధికారులతో సమావేశం
మధ్యాహ్నం 1.30 గంటలకు : భోజన విరామం తర్వాత క్యాంపు కార్యాలయంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారుల మర్యాదపూర్వక భేటీలు 
సాయంత్రం 4 గంటలకు : అక్షయపాత్ర ఫౌండేషన్‌ ప్రతినిధులతో సమావేశం. అది ముగిసిన వెంటనే పాఠశాల విద్యాశాఖ అధికారులతో సమావేశం 
సాయంత్రం 5 గంటలకు : మరికొందరు సందర్శకులను కలుసుకున్నారు.
రాత్రి 8 గంటలకు : తన అధికార కార్యక్రమాలన్నింటినీ ముగించారు. 

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సీఎం జగన్‌ను కలిసిన శ్రీలక్ష్మి
తెలంగాణ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి వై శ్రీలక్ష్మి జగన్‌తో భేటీ అయ్యారు. 

మరిన్ని వార్తలు