ప్రజా ఉద్యమాలకు సిద్ధం కావాలి: వైఎస్ జగన్‌

13 Dec, 2014 03:54 IST|Sakshi

* పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి  
* జనం వెన్నంటి ఉండి ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలి

 
సాక్షి ప్రతినిధి, తిరుపతి: జనం వెన్నంటి ఉండి ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటాలు చేయాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పద్మావతి అతిథిగృహంలో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలతో ఆయన శుక్రవారం ముచ్చటించారు. చిత్తూరుజిల్లాలో మెజార్టీ స్థానాలు ఎనిమిది శాసనసభ.. రెండు లోక్‌సభ స్థానాలను వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను ప్రజలు గెలిపించారని శ్రేణులకు  గుర్తు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంకోసం ప్రజా ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
 
ప్రవాస భారతీయుడు చెన్నారెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరయ్యేందుకు  జగన్‌మోహన్‌రెడ్డి హైదరాబాద్ నుంచి శుక్రవారం సాయంత్రం తిరుపతిలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు.  వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, వైఎస్సార్‌సీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, వరప్రసాద్, ఎమ్మెల్యేలు కె.నారాయణస్వామి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, దేశాయ్ తిప్పారెడ్డి, సునీల్‌కుమార్, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కే.శ్రీనివాసులు, అంజయ్య విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలికారు. ఎన్నికల తర్వాత తొలిసారిగా తిరుపతికి వచ్చిన జగన్‌కు జనం బ్రహ్మరథం పట్టారు.   పద్మావతి అతిథిగృహంలో పార్టీ శ్రేణులతో సమావేశం తర్వాత ఆయన పీఎల్‌ఆర్ కన్వెన్షన్ హాల్‌కు చేరుకుని వధూవరులను ఆశీర్వదించారు. ఆ తర్వాత రోడ్డుమార్గంలో పులివెందులకు వెళ్లారు.

>
మరిన్ని వార్తలు